పనామా వెనక్కి తీసుకుంటాం | Donald Trump Threatens To Take Control Of Panama Canal Over Ridiculous Fees, More Details Inside | Sakshi
Sakshi News home page

పనామా వెనక్కి తీసుకుంటాం

Published Tue, Dec 24 2024 6:32 AM | Last Updated on Tue, Dec 24 2024 9:59 AM

Donald Trump Threatens to Take Control of Panama Canal

మరోసారి ట్రంప్‌ కవ్వింపు ప్రకటన 

తోసిపుచ్చిన పనామా అధ్యక్షుడు ములినో 

ఫీనిక్స్‌: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ పొరుగుదేశాలపై కవ్వింపు చర్యలు మొదలుపెట్టారు. మిత్రదేశానికి తెలివితక్కువగా అప్పగించిన పనామా కాలువపై నియంత్రణను తిరిగి పొందడానికి తన కొత్త యంత్రాంగం ప్రయత్నిస్తుందని ట్రంప్‌ ప్రకటించారు. కీలకమైన ఈ రవాణా మార్గం గుండా వెళ్ళడానికి అత్యధిక రుసుము వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ట్రంప్‌ ప్రకటనను పనామా కన్జర్వేటివ్‌ అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ ములినో తోసిపుచ్చారు. ఇది తమ దేశ సార్వభౌమత్వానికి అవమానమని కొట్టిపారేశారు.  

ఓవైపు ప్రభుత్వ షట్‌డౌన్‌ను నివారించడానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుండగా.. ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌ మార్‌–ఎ–లాగోలో ఉన్న ట్రంప్‌.. అక్కడినుంచే తేనెతుట్టలను కదుపుతున్నారు. అమెరికా ఫెస్ట్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించారు. తాము అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ట్రంప్‌.. విశ్వాసాన్ని కోల్పోయిన డెమొక్రాట్లు తమవైపు వస్తే స్వాగతిస్తామన్నారు. పనామా కాలువను తమ దేశం మూర్ఖంగా ఇచ్చేసిందని విచారం వ్యక్తం చేశారు. కాలువ విషయంలో అమెరికా పట్ల నైతిక, చట్టపరమైన సూత్రాలను పాటించకపోతే, కాలువను అమెరికాకు తిరిగి ఇవ్వాలని తాము డిమాండ్‌ చేస్తామన్నారు. తదనుగుణంగా అధికారులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అదెలా సాధ్యమనే విషయాన్ని ఆయన వివరించలేదు. అంతేకాదు.. పనామా అధ్యక్షుడు ములినోను కన్జర్వేటివ్‌ జనాకర్షకుడని, పలు విషయాల్లో తనతో ఏకీభవిస్తారని ట్రంప్‌ అభివరి్ణంచారు.  

పనామా అంతా ఏకమవుతుంది: ములినో 
ట్రంప్‌ ప్రకటనపై పనామా అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ ములినో స్పందించారు. ట్రంప్‌ ప్రసంగించిన కొద్దిసేపటికే ‘ఆ కాలువలోని ప్రతి చదరపు మీటర్‌ పనామాకు చెందినదని, అది తమ దేశానికి చెందుతుందని ములినో ఓ వీడియోను విడుదల చేశారు. ట్రంప్‌ పేరును ప్రస్తావించకుండా, నిర్వహణ ఖర్చులు, సరఫరా, డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ పన్నులను నిర్ణయిస్తుందని ములినో అన్నారు. సుంకాలు ఇష్టానుసారంగా నిర్ణయించలేదని ములినో చెప్పారు. షిప్‌ ట్రాఫిక్‌ను పెంచడానికి పనామా కొన్ని సంవత్సరాలపాటు కాలువను విస్తరించిందని, రుసుముల పెరుగుదల కాలువ అభివృద్ధికే ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు.. పనామావాసులు ఇతర అంశాలపై భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉండవచ్చని, కానీ కాలువ, సార్వభౌమాధికారం విషయానికి వస్తే... పనామా అంతా ఏకమవుతుందని స్పష్టం చేశారు.  

పనామా కాలువపై ఎందుకీ వివాదం..  
పనామా.. అమెరికాకు మిత్రదేశం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ కాలువ కీలకమైనది. ఆ ప్రభుత్వ వార్షిక ఆదాయంలో ఐదోవంతు దీనినుంచే వస్తుంది. తన తీరాల మధ్య వాణిజ్య, సైనిక నౌకల రవాణాను సులభతరం చేయడంలో భాగంగా అమెరికా 1900ల ప్రారంభంలో ఈ కాలువను నిర్మించింది. 1977లో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం 1999 డిసెంబర్‌ 31న పనామా కాలువపై నియంత్రణను అమెరికా కోల్పోయింది. 2023లో మధ్య అమెరికా కరువుల వల్ల కాలువ తీవ్రంగా ప్రభావితమైంది. సరిపడా జలాలు లేక నౌకలు దాటే స్లాట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి వచి్చంది. దీంతో కాలువ దాటేందుక వసూలు చేసే రుసుమును కూడా పెంచారు. ఈ ఏడాది చివరి నెలల్లో వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో కాలువపై రాకపోకలు యథాస్థితికి చేరుకున్నాయి. రుసుములు యథాస్థితిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ‘నియంత్రణ’వ్యాఖ్యలు చేశారు 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement