Port construction work
-
కాకినాడకు మరో కిరీటం
రామాయపట్నం.. మూలపేట.. మచిలీపట్నం పరంపరలో రాష్ట్రంలో మరో పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మూడు పోర్టులు (కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ క్యాపిటివ్) ఉన్న కాకినాడ సిగలో త్వరలో మరో పోర్టు చేరనుంది. కాకినాడ సమీపంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద సుమారు 1,944 ఎకారాల్లో కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టు (కే–సెజ్ పోర్టు)ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. తొలిదశలో సుమారు రూ.2,123.43 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏడాదికి 16 మిలియన్ టన్నుల సామర్థ్యం, నాలుగు బెర్తులతో అరబిందో గ్రూపు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. 2023 ప్రారంభంలో మొదలైన ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్‌ను నిర్మించడానికి 12 లక్షల టన్నుల రాయిని ఇప్పటివరకు వినియోగించారు. బ్రేక్ వాటర్ నిర్మాణం ఇప్పటికే 45 శాతం మేర పూర్తికాగా మొత్తం ప్రాజెక్టులో పనులు 18 శాతం వరకు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. – సాక్షి, అమరావతి పర్యావరణ అనుమతులు మంజూరు.. 5,886 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాకినాడ సెజ్ మధ్యలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతోంది. మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మధ్యనే కీలక అనుమతులు లభించాయి. ఈ పోర్టు నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయంలో 2.70 శాతం ప్రభుత్వానికి రానుండగా.. 31–40 ఏళ్ల వరకు 5.40 శాతం, 41–50 ఏళ్ల వరకు 10.80 శాతం వాటా ఏపీ మారిటైమ్ బోర్డుకు సమకూరనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి పరోక్షంగా 10,000 మందికి చొప్పున మొత్తం 13,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టు లావాదేవీలు, పరిశ్రమల రాకతో రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్తలు స్పష్టంచేస్తున్నారు. మౌలిక వసతులకు భారీ వ్యయం.. ► కే–సెజ్ గేట్‌వే పోర్టును ఇటు కాకినాడతో పాటు అటు అన్నవరం వద్ద జాతీయ రహదారికి రోడ్డు, రైల్వేలైన్ ద్వారా అనుసంధానించనున్నారు. ► సాగరమాల ప్రాజెక్టుకు కింద 40.కి.మీ మేర నాలుగులైన్ల రహదారిని రూ.1,480 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ► అలాగే, ఈ పోర్టును అన్నవరానికి అనుసంధానిస్తూ రూ.300 కోట్లతో 25కి.మీ మేర రైల్వేలైన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ► 24 నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 400/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయడానికి ట్రన్స్కోకు 64 ఎకరాలను కేటాయించారు. 2,000 ఎంవీఏ విద్యుత్‌ను ఉత్పత్తి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఈ సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తున్నారు. ► ఈ సెజ్‌లోని పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థాలను శుద్ధిచేయడానికి ఒక ఉమ్మడి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడమే కాకుండా ఈ వ్యర్థాలను గొట్టాల ద్వారా 35 కి.మీ దూరంలోని పాయకరావుపేటవరకు తరలించి అక్కడ నుంచి సుమారు రెండు కి.మీ లోతున సముద్రంలో కలపనున్నారు. ► ఇక్కడ యూనిట్లకు అవసరమైన నీటిని పోలవరం కాలువతో పాటు సుముద్రపు నీటిని శుద్ధిచేసుకుని వినియోగించుకునేందుకు డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ► అన్నవరం నుంచి పోలవరం కాలువ ద్వారా 100 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయడంతో పాటు రూ.100 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. రూ.50,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఇలా అన్ని మౌలిక వసతులతో పోర్టు అభివృద్ధి చేస్తుండటంతో ఈ పోర్టు పక్కనే దివీస్ భారీ ఫార్మా యూనిట్, రూ.2,000 కోట్లతో లైఫియస్ ఫార్మా పేరుతో పెన్సులిన్ తయారీ యూనిట్‌ను.. రూ.2,000 కోట్లతో క్యూలే ఫార్మా యూనిట్‌ను అరబిందో ఫార్మా ఏర్పాటుచేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ సెజ్ ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ,5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ హైడ్రోజన్, టెక్స్టైల్స్, ఆక్వా, స్టీల్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. కాకినాడ సెజ్‌కు ఆనుకుని ఉన్న ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మినీపోర్టు తరహాలో భారీ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తుండటంతో ఆక్వా రంగానికి చెందిన పలు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నెక్కంటి సీ ఫుడ్స్, దేవీ ఫిషరీస్, సంధ్య ఆక్వా, కాంటినెంటల్ ఫిషరీస్, ఆదివిష్ణు వంటి పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించి 8,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో అత్యధికమంది మహిళలు.. పైగా స్థానికులే కావడం గమనార్హం. 2025 నాటికి అందుబాటులోకి తెస్తాం.. ఇప్పటికే కీలకమైన బ్రేక్ వాటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే డ్రెడ్జింగ్ బెర్తుల నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. బ్యాంకులతో రుణాల ద్వారా నిధుల సమీకరణ పూర్తికావడంతో ఇక పనులు వేగవంతం కానున్నాయి. 2025 ద్వితీయ త్రైమాసికం నాటికి పోర్టును పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఓం రామిరెడ్డి, ఎండీ, కాకినాడ గేట్‌వే పోర్ట్స్ లిమిటెడ్ మా వాళ్లకు ఉద్యోగాలొస్తాయన్న ఆశ.. నాకున్న నాలుగెకరాల భూమి సెజ్‌కు ఇచ్చాను. ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. మా వాళ్లు బాగుపడతారనే నమ్మకంతో భూమి ఇచ్చాను. అందుకు తగ్గట్లుగానే సెజ్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను. పెద్దగా చదువుకోకున్నా భూమి ఇచ్చాననే కారణంతో ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – యాదాల చంటిబాబు. ఆవులమంద, పెరుమాళ్లపురం, తొండంగి మండలం ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయి.. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. గతంలో పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు సెజ్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సెజ్‌కు భూమి ఇచ్చిన వారిలో నేను ఒకడిని. గత పాలనలో కొంతమందిని బెదిరించి భూములు లాక్కున్నారు. అప్పట్లో నాపై అన్యాయంగా 15 కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక గత డిసెంబరు 26న 12 కేసులు ఎత్తేశారు. మరో 3 కేసులు నాపై పెండింగ్‌లో ఉన్నాయి. – దూలం శ్రీను, గోర్సపాలెం, తొండంగి మండలం -
పోలీసుల ప్రమేయం లేదు
శ్రీకాకుళం , కాశీబుగ్గ: భావనపాడు పోర్టు నిర్మాణ విషయంలో పోలీసుల ప్రమేయం ఉండదని, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తేనే పోలీసులు స్పందిస్తారని ఎస్పీ త్రివిక్రమవర్మ అన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉందని, నష్టపరిహారాన్ని మొదలుకొని పూర్తి చర్యలు వారే చేపడతారని తెలిపారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు గురువారం విచ్చేసిన ఆయనతో ‘సాక్షి’ ముఖాముఖి. సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? ఎస్పీ: జిల్లాలో జాతీయ రహదారిపై ప్రతి కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశాం. కూడళ్లతో పాటు సబ్ రోడ్లకు సైతం బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు తగ్గించాం. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించగలిగాం. సాక్షి: వాహనదారులపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్పీ: ట్రాక్టర్, ఆటో, బస్సులు, పాఠశాల బస్సులు, బైక్‌లు ఇలా వాహనాలను బట్టి డ్రైవర్లకు అవగాహన సదస్సులు చేపడుతున్నాం. ఫిట్నెస్ లేని బస్సులు, కాలం చెల్లిన స్కూల్ బస్సులను నిలిపివేస్తున్నాం. సాక్షి: ఉద్దాన ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత ఉందా? ఎస్పీ:బారువ, సొంపేట, వజ్రపుకొత్తూరు, కాశీబుగ్గ పరిధిలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొత్తవారు వస్తున్నారు తప్ప పాతవారు వేరేచోటకు మొగ్గుచూపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మినహాయిస్తే ఉద్దాన ప్రాంతంలో పనిచేయడానికి ముఖం చాటేస్తున్నారు. సాక్షి: జిల్లాలో క్రైం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది? ఎస్పీ:కాశీబుగ్గ–పలాస ప్రాంతం. అనంతరం టెక్కలి, నందిగాం ఉన్నాయి సాక్షి: కాశీబుగ్గ పరిధిలో క్రైం రేటు తగ్గించేందుకు ఏ చర్యలు చేపడుతున్నారు? ఎస్పీ:కాశీబుగ్గ పరిధిలో స్టాఫ్ తక్కువగా ఉన్నారు. 53 మంది పురుషులు అవసరం ఉండగా 29 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యేక చర్యలు ద్వారా ఇక్కడ శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. సాక్షి: జిల్లాలో హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. నివారణ చర్యలు చేపడుతున్నారా? ఎస్పీ: గత ఏడాది కాలంలో 9 హత్యలు జరిగాయి. ఇందులో కొర్లాం సమీపంలో తన్మయిపండా అనే యువతి హత్య కేసు ఛేదించాం. హత్యలు అదుపునకు మరిన్ని చర్యలు చేపడుతున్నాం. సాక్షి: నాన్‌బెయిల్‌బుల్ కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిసింది. వీటిపై మీ చర్యలేమిటి? ఎస్పీ: జిల్లాలో 2012 ముందు నాన్‌బెయిల్‌బుల్ కేసులు 306 ఉండేవి. హైకోర్టు దృష్టిపెట్టడంతో 170కు చేరుకున్నాయి. వీటిని మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. సాక్షి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వీటిపై ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ:జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్న మాట వాస్తమే. మొత్తం 304 కేసులు నమోదు కాగా, పరిష్కారానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం. సాక్షి: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎలా ఉంది? ఎస్పీ:మావోల ప్రభావం బాగా తగ్గింది. అయినా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఉంచాం. సాక్షి: ఎల్‌హెచ్‌ఎంఎస్(లాకుడ్ హౌస్ మానటరింగ్ సిస్టం) యాప్ ఫెయిలైందా... ఎందుకు వాడటంలేదు? ఎస్పీ:ఈ యాప్ ప్రజలలోకి ఇంకా చేరాల్సి ఉంది. ఇంటర్నెట్పై అవగాహన ఉన్నవారు వాడుతున్నారు. ఇంతవరకు 8వేల మంది యాప్‌లో నమోదయ్యారు. అంతా ఉచిత సర్వీసులు అందజేస్తున్నాం. -
పాలకులకు పట్టని పోర్టు నిర్మాణం
► అధికారం చేపట్టిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తామని హామీ ► పోర్టును పక్కనపెట్టి పరిశ్రమల స్థాపన పేరుతో కాలయాపన ► 4,800 ఎకరాలకు బదులు 30 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ మచిలీపట్నం : ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభిస్తాం... పోర్టు నిర్మాణంతో పాటు బందరులో ఆయిల్ రిఫైనరీ, క్రాకరీ యూనిట్లు ప్రారంభిస్తాం’ అంటూ జిల్లాకు చెందిన మంత్రులు చెప్పిన మాటలు ఇవి. అయితే ఇప్పుడు పాలకులకు పోర్టు అంశం పట్టడంలేదు. పోర్టు అంశాన్ని పక్కనపెట్టి అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో 2015 ఆగస్టులో 30 వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం వివాదాస్పదమైంది. పోర్టు కోసం భూములు ఇస్తామని, నిర్మాణం చేపట్టాలని మచిలీ పట్నం వాసులు కోరుతున్నా ఫలితంలేదు. గత ఏడాది బడ్జెట్లో పోర్టు నిర్మాణం కోసం రూ.800 కోట్లు కేటాయిస్తారని టీడీపీ నాయకులు ప్రచారం చేసినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 2016-17 బడ్జెట్లోనూ పోర్టు అంశాన్ని పక్కనపెట్టారు. అసలు పోర్టు నిర్మాణం జరుగుతుందా, లేదా అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒత్తిడి తెచ్చే వారేరి? టీడీపీ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర రాజ ధాని అమరావతిపైనే దృష్టిసారించింది. 2016 సంక్రాంతి నాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తామని మచిలీపట్నానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర పలుమార్లు ప్రకటించారు. సంక్రాంతి గడిచి రెండు నెలలు పూర్తయినా పోర్టు పనులు మొదలవలేదు. బందరుపోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రజాప్రతినిధులే లేరనే వాదన జిల్లావాసుల నుంచి వ్యక్తమవుతోంది. మళ్లీ ఎన్నికల హామీయేనా? ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అన్ని రాజకీయ పార్టీలు బందరు పోర్టు నిర్మించి తీరుతామని హామీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బందరు పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాల భూమిని సేకరించేందుకు 2012 మే 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో నంబరు 11ను జారీ చేసినా పనులు మొదలవలేదు. పోర్టు నిర్మాణానికి కావాల్సిన 4,800 ఎకరాల్లో తొలి విడత రెండువేల ఎకరాలు ఇస్తే పనులు ప్రారంభిస్తామని పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రభుత్వానికి నివేదిం చింది. అయినప్పటికీ నవయుగ సంస్థకు ప్రభుత్వం భూమి అప్పగించలేదు. ఈ జాప్యం ఎందుకన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంఏడీఏ పరిధిలోకి 1.05 లక్షల ఎకరాలు, మచిలీపట్నం మునిసిపాల్టీతో పాటు మరో 28 గ్రామాలను చేర్చింది. సాగరమాల పథకంలో బందరు పోర్టు, ఇతర పరిశ్రమల అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బందరు పోర్టు 10 నుంచి 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ పోర్టు పనులు ఎప్పటికి ప్రారంభిస్తారనే అంశంపై పాలకులు, అధికారులు పెదవి విప్పడం లేదు.