పాలకులకు పట్టని పోర్టు నిర్మాణం
► అధికారం చేపట్టిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తామని హామీ
► పోర్టును పక్కనపెట్టి పరిశ్రమల స్థాపన పేరుతో కాలయాపన
► 4,800 ఎకరాలకు బదులు 30 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్
మచిలీపట్నం : ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభిస్తాం... పోర్టు నిర్మాణంతో పాటు బందరులో ఆయిల్ రిఫైనరీ, క్రాకరీ యూనిట్లు ప్రారంభిస్తాం’ అంటూ జిల్లాకు చెందిన మంత్రులు చెప్పిన మాటలు ఇవి. అయితే ఇప్పుడు పాలకులకు పోర్టు అంశం పట్టడంలేదు. పోర్టు అంశాన్ని పక్కనపెట్టి అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో 2015 ఆగస్టులో 30 వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం వివాదాస్పదమైంది.
పోర్టు కోసం భూములు ఇస్తామని, నిర్మాణం చేపట్టాలని మచిలీ పట్నం వాసులు కోరుతున్నా ఫలితంలేదు. గత ఏడాది బడ్జెట్‌లో పోర్టు నిర్మాణం కోసం రూ.800 కోట్లు కేటాయిస్తారని టీడీపీ నాయకులు ప్రచారం చేసినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 2016-17 బడ్జెట్‌లోనూ పోర్టు అంశాన్ని పక్కనపెట్టారు. అసలు పోర్టు నిర్మాణం జరుగుతుందా, లేదా అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఒత్తిడి తెచ్చే వారేరి?
టీడీపీ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర రాజ ధాని అమరావతిపైనే దృష్టిసారించింది. 2016 సంక్రాంతి నాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తామని మచిలీపట్నానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర పలుమార్లు ప్రకటించారు. సంక్రాంతి గడిచి రెండు నెలలు పూర్తయినా పోర్టు పనులు మొదలవలేదు. బందరుపోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రజాప్రతినిధులే లేరనే వాదన జిల్లావాసుల నుంచి వ్యక్తమవుతోంది.
మళ్లీ ఎన్నికల హామీయేనా?
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అన్ని రాజకీయ పార్టీలు బందరు పోర్టు నిర్మించి తీరుతామని హామీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బందరు పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాల భూమిని సేకరించేందుకు 2012 మే 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో నంబరు 11ను జారీ చేసినా పనులు మొదలవలేదు. పోర్టు నిర్మాణానికి కావాల్సిన 4,800 ఎకరాల్లో తొలి విడత రెండువేల ఎకరాలు ఇస్తే పనులు ప్రారంభిస్తామని పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రభుత్వానికి నివేదిం చింది. అయినప్పటికీ నవయుగ సంస్థకు ప్రభుత్వం భూమి అప్పగించలేదు. ఈ జాప్యం ఎందుకన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంఏడీఏ పరిధిలోకి 1.05 లక్షల ఎకరాలు, మచిలీపట్నం మునిసిపాల్టీతో పాటు మరో 28 గ్రామాలను చేర్చింది. సాగరమాల పథకంలో బందరు పోర్టు, ఇతర పరిశ్రమల అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బందరు పోర్టు 10 నుంచి 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ పోర్టు పనులు ఎప్పటికి ప్రారంభిస్తారనే అంశంపై పాలకులు, అధికారులు పెదవి విప్పడం లేదు.