
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శ
సాక్షి, అమరావతి : బడ్జెట్‌లో అంతా ప్రచార హడవిడి తప్ప రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. గతంలో ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలే చేసుకుని డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేసింది. 2016 సెప్టెంబర్‌లో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అంగీకరించడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని మండిపడింది. ‘అర్ధరాత్రి అద్భుత ప్రకటన అంటూ నానా హడావిడి చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం స్వర్గం అవుతుందా?’ అంటూ రాష్ట్రం హక్కుపై సీఎం హోదాలో చంద్రబాబు తన చేతులతో తానే నీళ్లు చల్లారని మండిపడింది. ఈ మేరకు బడ్జెట్‌పై మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
» 2014 –19 మధ్య రాజధాని కోసం ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లే. ఇప్పుడు రూ.15 వేల కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చే కొన్నేళ్లలో ఇస్తామంటూ కేంద్రం ప్రకటించింది. అంటే రూ.15 వేల కోట్లు అప్పుగా ఇస్తున్నారా? లేక గ్రాంటుగా ఇస్తున్నారా? అప్పుగా ఇస్తే అది రాష్ట్రానికి ఏ విధంగా లాభం అవుతుంది? చంద్రబాబు చెప్పింది ఏమిటి? జరుగుతున్నది ఏమిటి? ఇలాగైతే రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది? ఇది ప్రజలను మోసం చేయడం కాదా?
» రాజధానిలో కేవలం రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని గతంలో చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. ఈ పరిస్థితిలో రాజధాని కోసం కేంద్రం ఏం సహాయం చేసినట్లు?
» నాడు ప్రత్యేక ఆర్థిక సహాయంతో రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోతాయని ఎల్లో మీడియాతో ఊదరగొట్టించారు. ఇవాళ కూడా అలాంటి ప్రచారాలే చేస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీలు.. ఇవన్నీ రాష్ట్రానికి ఒక హక్కు కింద రావాలి. ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ప్రయోజనాలు ఏ ప్యాకేజీతో తీరుతాయి? ఏ సర్దుబాట్లతో భర్తీ అవుతాయి?
» పోలవరం సవరించిన అంచనాలకు సంబంధించి రూ.55,656.87 కోట్ల ఆమోదం అంశం పెండింగ్‌లో ఉంది. దీనికి ఓకే చెప్పి ఆ నిధులను తెప్పించుకోకపోతే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? పోలవరంలో తక్షణ పనుల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదేపదే ఒత్తిడి తెస్తే రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ నిధులు రాకుండా చంద్రబాబు అడ్డుకోవడం నిజం కాదా?
» వెనుకబడ్డ జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఏటా ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. నీతి ఆయోగ్ రూ.2,100 కోట్లు సిఫార్సు చేస్తే కేంద్రం 2014 –15 నుంచి మొదటి మూడేళ్లపాటు ఇచ్చింది రూ.1,050 కోట్లు. తర్వాత నిధుల విడుదల ఆపేసింది. మరి ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో అదనంగా వచ్చేది ఏముంది? ఇవ్వాల్సిన పెండింగ్ డబ్బులు ఇస్తారా? లేక అంతకంటే ఎక్కువ ఇస్తారా? తాను గతంతో డిమాండ్ చేసినట్టుగా బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహాలో చంద్రబాబు రూ.22 వేల కోట్లు తెస్తారా?
Comments
Please login to add a commentAdd a comment