మరణించాకా.. మందులిచ్చారు
• ముదిగొండ పీహెచ్‌సీ సిబ్బంది నిర్వాకం
• సకాలంలో బాధితులకు అందని డోస్‌లు
• కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
• మృత్యువాత పడుతున్న టీబీ వ్యాధిగ్రస్తులు
ముదిగొండ :
ముదిగొండ మండల కేంద్రానికి చెందిన టీబీ వ్యాధిగ్రస్తుడు తుపాకుల చిరంజీవి గత ఏడాది అక్టోబర్ 12న మృతి చెందాడు. మృతి చెందిన రోజు నుంచి అదే నెలలో 17వ తారీకు వరకు ఆయనకు మందులు పంపిణీ చేసినట్లు స్థానిక పీహెచ్‌సీ రికార్డులో నమోదు చేశారు. గుర్తించిన ప్రాథమిక ఆరోగ్యవైద్యాధికారిణి కార్డుపై సంతకం చేయలేదు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. మండలంలోని ముదిగొండ, పెద్దమండవ, మాదాపురం, చిరుమర్రి, పమ్మి గ్రామాల్లో టీబీ వ్యాధి గ్రస్తులు ఇటీవల ఐదుగురు మృతి చెందారు. సకాలంలో మందులు ఇవ్వకపోవడం వల్లే వారు మృతి చెందారని పలువురు ఆరోపిస్తున్నారు.
విడతల వారీగా అందని మందులు
ముదిగొండ మండలంలో ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యలో టీబీ వ్యాధి గ్రస్తులున్నారు. ఈ ఏడాది కేవలం ఇప్పటి వరకు 75 మందినే గుర్తించి వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు రికార్డులున్నాయి. వారికి కూడా విడతల వారీగా డోస్‌లు అందడంలేదు. బయట కొనలేకపోవడంతో వ్యాధి ముదిరి మృత్యవాత పడుతున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది. బాధితులకు ప్రత్యేకంగా కిట్లు ఏర్పాటు చేసి మందుల వాడకాన్ని అందులో నమోదు చేస్తారు. ఒకవేళ బాధితుడు మృతి చెందితే ఆ కిట్‌ను డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌కు పంపాలి. పీహెచ్‌సీ పర్యవేక్షణలో ఇదంత జరుగుతుంది. కానీ ముదిగొండ పీహెచ్‌సీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి కూడా మందులు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి, ఆ మందులను అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ మందులు ఖరీదైనవి. మార్కెట్‌లో అంత సులభంగా దొరకవు. కేంద్ర ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఇస్తున్న మందులను పీహెచ్‌సీ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. మృతి చెందినవారి కిట్లను తిరిగి డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌కు పంపడం లేదు.
మెరుగుపడని పరిస్థితి
కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో బాధితుల పరిస్థితి మెరుగుపడడం లేదు. డోస్‌లు పడకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. టీబీ వ్యాధి సోకిన వారికి పరీక్షలు చేయించి వ్యాధిని బట్టి విడతల వారీగా మందులు పంపిణీ చేయాలి. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పీహెచ్‌సీ స్థాయిలో అమలు కావడం లేదు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.
డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేస్తాం
సిబ్బంది పని తీరుపై వారి రూట్‌లలో మందులు పంపిణీ కార్డులు పరిశీలించాం. సమాచారం పూర్తిగా లేదు. మృతి చెందిన తరువాత కూడా ఐదు రోజులు మందులు పంపిణీ చేసినట్లు రికార్డులో నమోదు చేశారు. ఆ రికార్డుపై నేను సంతకం చేయలేదు. పరిశీలించి డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ ఇందిర, ప్రాథమిక ఆరోగ్యవైద్యాధికారిణి