PHC staff
-
అందరూ సెలవులు పెడితే ఎలా?
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : ఆసుపత్రి పనివేళల్లో కనీసం 20 శాతం సిబ్బంది అయినా అందుబాటులో ఉండకపోతే ఎలా? రోగుల పరిస్థితి ఏంటని కలెక్టర్ జే నివాస్ వైద్యాధికారి ప్రదీప్‌కుమార్‌పై అసహనం వ్యక్తం చేశారు. గురువారం వీరఘట్టం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇక్కడ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించారు. తక్కువ మంది సిబ్బందిలో కొంద రు బదిలీల కౌన్సెలింగ్‌కు, ఇంకొంత మంది సెలవుపై వెళ్లారు. అయితే ఆసుపత్రిలో కనీస సిబ్బంది కూడా లేకపోవడంతో ఆసుపత్రి నిర్వహణ బాగులేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ వై యోగీశ్వరరరెడ్డి నాలుగు నెలల్లో 27 సెలవులు పెట్టినట్లు గుర్తించిన కలెక్టర్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగికి ఇన్ని సెలవులు ఎలా మంజూరు చేశారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే హెల్త్ ఎడ్యుకేటర్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఫోన్లో ఆదేశించారు. అంతకు ముం దు వార్డుల్లో రోగులను పలకరించి ఇక్కడ వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు. అందరూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఈయన వెంట పాలకొండ ఆర్డీవో ఎల్ రఘుబాబు, మండల ప్రత్యేకాధికారి ఎస్ శ్రీనివాసరావు ఉన్నారు. ప్రభుత్వ సంస్థల్లో వసతులు మెరుగుపడాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని కలెక్టర్ జే నివాస్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు విధిగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, తదితర సంస్థలను సందర్శించాలన్నారు. అక్కడ మౌలిక వసతుల కొరతను గుర్తించి వారంలోగా పరిష్కరించాలన్నారు. గురువారం సాయంత్రం మండల ప్రత్యేకాధికారులతో, మండల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలు మంచి సేవలకు నిలయాలుగా మారాలన్నారు. ఆస్పత్రి ప్రసవాలు, వైద్యసేవలు పక్కాగా అం దాలని, వసతి గృహాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, తదితర మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై, సిబ్బందిపై చర్యలు చేపట్టాలన్నారు. స్పందన కార్యక్రమానికి రావడం వల్ల సమస్య పరిష్కరమైనట్లుగా ప్రజల్లో నమ్మకం కలగాలన్నారు. మండల వ్యవస్థపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
మరణించాకా.. మందులిచ్చారు
• ముదిగొండ పీహెచ్సీ సిబ్బంది నిర్వాకం • సకాలంలో బాధితులకు అందని డోస్‌లు • కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ • మృత్యువాత పడుతున్న టీబీ వ్యాధిగ్రస్తులు ముదిగొండ : ముదిగొండ మండల కేంద్రానికి చెందిన టీబీ వ్యాధిగ్రస్తుడు తుపాకుల చిరంజీవి గత ఏడాది అక్టోబర్ 12న మృతి చెందాడు. మృతి చెందిన రోజు నుంచి అదే నెలలో 17వ తారీకు వరకు ఆయనకు మందులు పంపిణీ చేసినట్లు స్థానిక పీహెచ్సీ రికార్డులో నమోదు చేశారు. గుర్తించిన ప్రాథమిక ఆరోగ్యవైద్యాధికారిణి కార్డుపై సంతకం చేయలేదు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. మండలంలోని ముదిగొండ, పెద్దమండవ, మాదాపురం, చిరుమర్రి, పమ్మి గ్రామాల్లో టీబీ వ్యాధి గ్రస్తులు ఇటీవల ఐదుగురు మృతి చెందారు. సకాలంలో మందులు ఇవ్వకపోవడం వల్లే వారు మృతి చెందారని పలువురు ఆరోపిస్తున్నారు. విడతల వారీగా అందని మందులు ముదిగొండ మండలంలో ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యలో టీబీ వ్యాధి గ్రస్తులున్నారు. ఈ ఏడాది కేవలం ఇప్పటి వరకు 75 మందినే గుర్తించి వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు రికార్డులున్నాయి. వారికి కూడా విడతల వారీగా డోస్‌లు అందడంలేదు. బయట కొనలేకపోవడంతో వ్యాధి ముదిరి మృత్యవాత పడుతున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది. బాధితులకు ప్రత్యేకంగా కిట్లు ఏర్పాటు చేసి మందుల వాడకాన్ని అందులో నమోదు చేస్తారు. ఒకవేళ బాధితుడు మృతి చెందితే ఆ కిట్‌ను డీఎంహెచ్ఓ ఆఫీస్‌కు పంపాలి. పీహెచ్సీ పర్యవేక్షణలో ఇదంత జరుగుతుంది. కానీ ముదిగొండ పీహెచ్సీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి కూడా మందులు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి, ఆ మందులను అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ మందులు ఖరీదైనవి. మార్కెట్లో అంత సులభంగా దొరకవు. కేంద్ర ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఇస్తున్న మందులను పీహెచ్సీ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. మృతి చెందినవారి కిట్లను తిరిగి డీఎంహెచ్ఓ ఆఫీస్‌కు పంపడం లేదు. మెరుగుపడని పరిస్థితి కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో బాధితుల పరిస్థితి మెరుగుపడడం లేదు. డోస్‌లు పడకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. టీబీ వ్యాధి సోకిన వారికి పరీక్షలు చేయించి వ్యాధిని బట్టి విడతల వారీగా మందులు పంపిణీ చేయాలి. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పీహెచ్సీ స్థాయిలో అమలు కావడం లేదు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తాం సిబ్బంది పని తీరుపై వారి రూట్లలో మందులు పంపిణీ కార్డులు పరిశీలించాం. సమాచారం పూర్తిగా లేదు. మృతి చెందిన తరువాత కూడా ఐదు రోజులు మందులు పంపిణీ చేసినట్లు రికార్డులో నమోదు చేశారు. ఆ రికార్డుపై నేను సంతకం చేయలేదు. పరిశీలించి డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ ఇందిర, ప్రాథమిక ఆరోగ్యవైద్యాధికారిణి -
చికిత్స కోసం వస్తే... చూపు పోయేలా...
* పీహెచ్సీ సిబ్బంది నిర్వాకం * ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు దుగ్గొండి : కంటికి దురద ఉందని చికిత్స కోసం సర్కారీ దవాఖానకు వెళితే సిబ్బంది ఇచ్చిన చుక్కల మందుతో ఉన్న చూపే పోయే పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన దళితుడు బోయిన మల్లేష్‌కు కంటి దురదతోపాటు మంట ఉండడంతో ఈ నెల 8న మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ అప్పటికి వైద్యుడు లేడు. డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు భోజనానికి వెళ్లిన సమయంలో ఆస్పత్రి సిబ్బందికి చూపించుకున్నాడు. వారు ఓపీ రిజిస్టర్లో పేరు రాసి కంటికి సంబంధించిన డిసీజ్‌గా గుర్తించి చుక్కల మందుతో పాటు 10 ఏవిల్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. జెంటామైసిన్ చుక్కల మందుకు బదులు మలేరియా వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్షలో ఉపయోగించే మలేరియా ఏజీ.పీ.ఎప్.పీవీ చుక్కల మందును నిర్లక్ష్యంగా అందించారు. బాధితుడు ఇంటికి వెళ్లి చుక్కల మందు కంట్లో వేసుకున్నాడు. కొంత సేపటి తర్వాత కండ్లు విపరీతంగా మంటలు వచ్చాయి. ఆ తర్వాత మరుసటి రోజు 9న దుగ్గొండి పీహెచ్‌సీకి రాగా సిబ్బంది పరిశీలించి వరంగల్‌కు వెళ్లాలని సెలవిచ్చారు. దీంతో ఆయన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. కళ్ల శుక్లాలకు ప్రమాదం ఉందని 10 రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచించాడు. చేతిలో చిల్లిగవ్వలేక తిరిగి ఇంటికి వచ్చి బుధవారం ఉదయం దుగ్గొండి పీహెచ్‌సీకి బంధువులతో కలిసి వచ్చి ఆందోళనకు దిగాడు. వైద్యాధికారి కొంరయ్యతో వాగ్వాదానికి దిగారు. తాను వైద్యం చేయలేదని తప్పుడు వైద్యం అందించిన వ్యక్తిని గుర్తించి చర్య తీసుకుంటానని చెప్పారు. వెంటనే బాధితుడిని 108 వాహనంలో వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రికి పంపించారు. ఈ ఆందోళనలో టీఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ముక సంజీవ, బొట్ల నరేష్, బట్టు సాంబయ్య ఉన్నారు.