ఇటీవల రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన రాహుల్‌గాంధీ దోసెలేశాడు. అలా ఆయన దోసెలేస్తూ ఉండగా..అంకితభావంతో క్రమశిక్షణతో మెలిగే ఓ కార్యకర్తకు ఆ చర్య ద్వారా అందిన సందేశమిది...
‘‘పరిశీలనగా చూడాలేగానీ..ఎన్నికల ఉపదేశాలెన్నో ఉన్నాయి దోసెలో’’అన్నాడు రాహుల్‌గాంధీ గిన్నెడు పిండిని పెనమ్మీద పోస్తూ.
‘‘దోసెల్లో ఎన్నికల క్లాసులా?!’’ ఆశ్చర్యపోయారు రాష్ట్ర నేతలూ, కార్యకర్తలు.
‘‘కాదా మరి..ఎన్నికల వాతావరణం వేడెక్కిందంటూ జర్నలిస్టులు తరచూ అంటుంటారు. ఎందుకనీ?..ఎందుకంటే వేడెక్కిన పెనం మీద సర్రుమంటూ నీళ్లు జల్లగానే ‘సుయ్యి’మంటుంది కదా. ఎన్నికల వాతావరణం కూడా అలాగే వేడెక్కుతుందన్నమాట’’
‘‘ఇక... పిండి కలపడమూ, నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికా ఒక్కలాంటివే. ఎన్నికల తయారీకవి కసరత్తుల్లాంటివన్నమాట. ఇకమరి మన దోసెపెనం అన్నది నియోజకవర్గమనుకుందాం. పోసిన పిండి పోసిందగ్గరే ఉండకూడదు. అభ్యర్థన్నవాడు ఒకేచోట అలాగే ఉండిపోకుండా.. నియోజకవర్గ నలుమూలలా నాలుగు దిక్కులకు తిరుగుతూ, విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. పెనం మూలమూలలకూ విస్తరించే పిండి ఇచ్చే సందేశమిదే’’ పెనమ్మీద పోసిన పిండిని అన్నివైపులకూ గుండ్రంగా విస్తరింపజేస్తూ వివరించాడు.
‘‘రవ్వదోసెలోని రంధ్రాల్లా అభ్యర్థి వ్యక్తిగత జీవితం కూడా అవతలకీ ఇవతలకీ కనిపించేటంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఇక మసాలాదోసె.... మధ్యనున్న మసాలాని అన్నివైపుల్నుంచీ కవర్ చేసినట్టుగానే..మన సొంత కార్యకర్తల ప్రయోజనాల్ని అన్నివైపులా కవర్ చేసుకుంటూ, కాపాడుకోవాలన్న స్ఫూర్తినిస్తుంది మసాలాదోసె’’
‘‘దోసె పోసిన కాసేపటికి సలాటంతో చకచకా నూనె జల్లినట్టు చేయడమే మన ఈ డబ్బులూ, సారా పంచడమన్నది. ఇక పోసినది పోసినట్టుగా అట్టు పెనానికంటుకుపోకుండా దోసె కింద కస కసా, కర కరామంటూ సరాటంతో సరసరలాడించడమే ఓటరింటికి మాటిమాటికీ పోయి, మన గుర్తును గుర్తు చేసి రావడం’’
‘‘ఓటమి అన్నది ఒక్కోసారి మాడిపోయే మసాలాదోసె లాంటిది. రుచి, పచీ ఉండదు. పెనమ్మీద మాడిన పెరసట్టంటే గ్రహణం పట్టిన సూర్యుడి లాంటిది. గ్రహణం ఎల్లకాలమూ ఉండదు. ఇవ్వాళ ఓడిన అభ్యర్థి..అట్టు తిరగేసినట్టుగా... ఆవలితట్టున అంటే... రెండోవైపున తెల్లటి చంద్రుడిలా మెరుస్తూ గెలవచ్చు. దోసెకిరువైపులా ఉండే కలరుమార్పుల్లాంటివే గెలుపూ, ఓటమి అనుకోవాలి’’
‘‘ఇక సర్వింగులో కూడా ఓ సందేశముండాలి..’’ అంటుండగానే చుట్టూ మూగి చూస్తున్న ప్రజల్లోంచి ఎవరో గబుక్కున అరిచారు.
‘‘అవును..కొందరు నేతలు ‘కోన్’ షేపులో..అంటే టోపీ రూపంలో సర్వ్ చేస్తుంటారు. గెలిచాక అచ్చం ఓటరు నెత్తిన టోపీ పెట్టినట్టుగానే..’’ అంటూ అరుస్తూ ఆ కోణంగి కొంటెగా..చుట్టూ ఉన్న కార్యకర్తలు పట్టుకునేలోపే తుర్రుమంటూ పరుగందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment