‘ఎమ్‌డీఆర్‌ టీబీ’ అంటే ఏమిటి? | TB will be completely reduced if you take full treatment under Doctors | Sakshi
Sakshi News home page

‘ఎమ్‌డీఆర్‌ టీబీ’ అంటే ఏమిటి?

Published Wed, Jun 5 2019 5:18 AM | Last Updated on Wed, Jun 5 2019 5:18 AM

TB will be completely reduced if you take full treatment under Doctors - Sakshi

మా నాన్నగారు ఎక్కువగా పొగతాగుతుంటారు. ఆయనకు ఊపిరితిత్తుల క్షయ వచ్చింది. అయితే చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్‌ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు.   
     
మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్‌ బాసిల్లస్‌) ప్రవేశించినప్పుడు కొన్ని అత్యంత సూక్ష్మజీవులను నిర్మూలించే శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్‌ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి.

దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి.ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్‌ బేస్‌డ్‌ అనీ, కల్చర్‌ బేస్‌డ్‌ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్‌ బెస్‌డ్‌ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్‌ లైన్‌ ఆఫ్‌ ట్రీట్‌మెంట్‌) వాడటం మందుపెట్టాలి.

ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్‌ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండో శ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండో శ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి.

సిలికోసిస్‌కు చికిత్స ఏమిటి?

నా వయసు 57 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడి దగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్‌’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్‌’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు.

మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్‌’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వార్ట్‌జ్‌ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్‌లో మూడు రకాలు ఉన్నాయి. అవి...

క్రానిక్‌ సిలికోసిస్‌: ఇది సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్‌పోజ్‌ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది.

యాక్సిలరేటెడ్‌ సిలికోసిస్‌: సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది.
అక్యూట్‌ సిలికోసిస్‌: కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే పెద్దమొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్‌ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్‌ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్‌ బయటపడుతుంది.

క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్‌ లేదా ఆక్సిజన్‌ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్‌ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి.

రుతు సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదు... ఎందుకు?

నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి?

  రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్‌ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్‌ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి.

రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి.పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్‌ లేదా ప్రోస్టాగ్లాండిన్స్‌ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు.ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్‌ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి.

మహిళల్లో కండరాలు రిలాక్స్‌ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్‌ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే  రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే  దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం.ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి.

డాక్టర్‌ రమణ ప్రసాద్‌
కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌  పల్మునాలజిస్ట్,
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement