గాలిని నిరంతరం ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని మళ్లీ వదిలేసే ప్రక్రియే శ్వాసక్రియ. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో... అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి ఆ గ్లాటిస్‌నుంచి ఒక్కసారిగా బలంగా నోటి నుంచి బయటకు రావడాన్ని ‘దగ్గు’ అంటారు. అది ఒకే ఒకసారి రావచ్చు. లేదా అలా వస్తూనే ఉండవచ్చు.
దగ్గులో రకాలు...
తడి దగ్గు : మన ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి జరిగే చోట తడిగా ఉంచేందుకు కొన్ని స్రావాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ స్రావాలు మామూలుగానైతే బయటకు రావు. ఏవైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువగా జరుగుతుంటే దగ్గుతో పాటు అవి బయటకు వస్తుంటాయి. అలా వచ్చేదాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు.
పొడి దగ్గు : దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. తడి, పొడి దగ్గులను బట్టి కొన్ని వ్యాధులను తొలిదశలో ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పొడి దగ్గు వస్తుంటే వ్యాధి శ్వాసకోశనాళాల తొలి భాగం (అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్–వే)లో ఉందని, తడి దగ్గు అయితే ఊపిరితిత్తుల్లోపల వ్యాధులు (బ్రాంకైటిస్, నిమోనియా, ఆస్తమా) ఉండవచ్చునని డాక్టర్లు ఒక అంచనాకు వస్తుంటారు.
రాత్రీ – పగలూ తేడాను బట్టి...
దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కొన్ని వ్యాధిలను అనుమానించవచ్చు. రాత్రి వేళల్లో దగ్గు వస్తుంటే అది అలర్జీ కారణంగా వస్తుందని అనుమానించవచ్చు. మధ్యాహ్నం పూట దగ్గు ఎక్కువగా ఉంటే దానికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చని ఊహిస్తారు.
తెమడను బట్టి...
తడి దగ్గు వచ్చే సమయంలో బయటకు వచ్చే తెమడ /కళ్లె (స్ఫుటమ్/ఫ్లెమ్) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. ఉదాహరణకు
►ఆకుపచ్చరంగులో తెమడ ఉంటే... సూడోమొనాస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుండవచ్చు.
►పసుపుపచ్చగా ఉంటే... క్లెబ్‌సిల్లా నిమోనియా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు.
►ఎర్రగా ఉంటే... సూడోమొనాలీ, నీమోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఎర్రరంగులో కళ్లెపడవచ్చు.
►నలుపు రంగులో ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు.
మరెన్నో జబ్బులకు సూచిక...
దగ్గుతో అలర్జీ, టీబీ, నిమోనియా వంటి జబ్బులని అనుమానించవచ్చు. అలాగే...
►ఊపిరితిత్తుల్లో నీరు నిలిచిపోయే ప్లూరల్ ఎఫ్యూజన్
►కీళ్ల నొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్
►కీళ్లకు సంబంధించిన లూపస్ అరిథమెటోసిస్ వంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా పొడి దగ్గు వస్తూ ఉంటుంది.
క్యాన్సర్లలో...
స్వరపేటిక, ఊపిరితిత్తులు, నోటికి సంబంధించి క్యాన్సర్లలో మొదటి లక్షణంగా దగ్గు కనిపించవచ్చు.
చికిత్స
ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు కనిపించగానే చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. అసలు ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందంటేనే అది లోపలేదో తీవ్రమైన సమస్య ఉందని చెప్పడానికి ఒక సూచన. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్‌పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో దగ్గు ఎడతెరిపిలేకుండా వస్తుంటే కేంద్ర నాడీ వ్యవస్థలో దగ్గును ప్రేరేపించే కేంద్రాన్ని ఉపశమింపజేయడానికి కోడిన్ వంటి మందులు ఉపయోగిస్తారు.
వయసును బట్టి..
దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు...
►పిల్లల్లో (ఇన్‌ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్ల కావచ్చునని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్‌టాయ్స్‌లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు, దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు.
►గొంతు, ముఖంలో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లు, శ్వాసనాళంలోని కింది భాగమైన బ్రాంకైలలో వైరల్ ఇన్ఫెక్షన్‌తో దగ్గు రావచ్చు.
►పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే మనమంతా ‘కోరింత దగ్గు’ (ఊఫింగ్ కాఫ్) అంటుంటాం. అంతేకాదు... మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా దగ్గురావచ్చు.
►పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్‌డీ, ఏఎస్‌డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని ‘సైనోసిస్’ అంటారు. దగ్గుతో పాటు ఈ లక్షణం కనిపిస్తే దాన్ని గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స అందించాలి.
ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమాలో పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదటగా దగ్గు కనిపిస్తుంటుంది.
పెద్దల్లో వచ్చే దగ్గు...
పొగతాగడం వల్ల : పొగతాగేవారిలో ఊపిరితిత్తులోకి అనేక విషపూరితమైన రసాయనాలు వెళ్తాయి. పొగతాగడం అలవాటయ్యాక తొలి సిగరెట్‌లోలా వెంటనే దగ్గు రాకపోయినా, సుదీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగులో తెమడ కూడా పడుతుంటుంది.
అలర్జీతో : పెద్దల్లో తగ్గు వస్తుంటే అది అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి.
ఇన్ఫెక్షన్లతో : టీబీ వ్యాధి ఉన్నవారిలో దగ్గు ప్రధానంగా కనిపిస్తుంది. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మంది దేహాల్లో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా ఇన్ఫెక్షన్లతో వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి బయటపడుతుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు వస్తూ, కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత (టెంపరేచర్) పెరుగుతుంది. ఈ మూడు లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు అది టీబీ వ్యాధి కావచ్చేమోనని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే... వారిలో వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్‌ఐవీ లాంటి కారణాలేమైనా ఉన్నాయా అని తగిన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.
నిమోనియా: ఈ కారణంగా వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు.
కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే కొన్ని మందులు వాడుతున్నప్పుడు వారిలో కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందులు ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి మందులు మార్చాల్సి ఉంటుంది.
వృద్ధుల్లో...
వయసు పెరుగుతున్న కొద్దీ మనలో తెమడను బయటకు పంపించే శక్తి (కాఫ్ రిఫ్లక్స్) తగ్గుతుంది. దాంతో తెమడ శ్వాసనాళంలోనే ఇరుక్కుపోవడంతో వృద్ధుల్లో దగ్గు చాల సాధారణంగా కనిపిస్తుంటుంది.
నివారణ ఇలా...
►మన పరిసరాలను, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
►పొగతాగే దురలవాటును పూర్తిగా మానేయాలి.
►సరిపడని వారు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి.
►పక్కబట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి.
►పుస్తకాల అరలను సాధ్యమైనంతవరకు మూసి ఉంచాలి
►వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే సుగంధద్రవ్యాలు (పెర్‌ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు.
డాక్టర్ జి. హరికిషన్,
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment