
ఉమ్మితే..ఇకపై జైలుపాలే!
ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్
సాక్షి, ముంబై: పాన్, గుట్క నమిలి ఎక్కడబడితే అక్కడ ఉమ్మి వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దీపక్ సావంత్ చెప్పారు. దీనికోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తేవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. క్షయ రోగానికి ఊతమిచ్చే గుట్క, పాన్‌వంటి పదార్థాలను నమిలి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేసే వారి వల్ల క్షయరోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గడిచిన ఐదేళ్ల కాలం ఏకంగా 35 మంది సిబ్బంది క్షయతో చనిపోయారు.
శివ్డీలోని టీబీ ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి క్షయ సోకింది. దీంతో ఇష్టానుసారం ఉమ్మివేస్తూ రోగాలను విస్తరింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సావంత్ చెప్పారు. ఇదివరకు ఇలాంటి వారిపై కఠినమైన చట్టం లేదు. బీఎంసీ అధికారులు కేవలం రూ.200 జరిమాన వసూలుచేసి వదిలేస్తున్నారు. కొత్త చట్టంలో జరిమానా డబ్బులు పెంచడం, జైలు శిక్ష విధించడం లాంటి కఠిన చర్యలు ఉంటాయి.