ఖమ్మంవైద్యవిభాగం: సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోవడం.. మందులు సక్రమంగా వేసుకోకపోవడం.. మధ్యలోనే నిలిపివేయడం.. జబ్బును నిర్లక్ష్యం చేయడంతో టీబీ వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ విభజన తర్వాత నివారణ చర్యలు చేపట్టినా తీవ్రత తగ్గడం లేదు. క్షయ బారినపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
జిల్లాలో ప్రతి నెల క్షయ కేసులు వందకు మించుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018, జనవరిలో 126 కేసులు, 2017లో 1,563 కేసులు నమోదు కావడంతో వ్యాధి వ్యాప్తి జిల్లాలో ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా క్షయ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2017లో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,774 కేసులు నమోదయ్యాయి. 2012లో టీబీని ప్రభుత్వం నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులు విధిగా తమ ఆస్పత్రిలో నమోదైన కేసుల వివరాలను టీబీ కంట్రోల్ అధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం ఇద్దరు హెల్త్ విజిటర్స్ ఎప్పటికప్పుడు ఆస్పత్రుల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రస్తుతం 56 శాతం మాత్రమే ప్రైవేటులో కేసులు నమోదైన వివరాలు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మాత్రం 2017లో 56 టీబీ మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒక్క రోగి నుంచి 20 మంది వరకు..
టీబీ వ్యాధికి ప్రత్యేక వైద్యం ఉన్నప్పటికీ అవగాహన లేమితో వ్యాధి బారిన పడుతున్నారు. మందులు సరిగా వేసుకోకుండా వ్యాధిగ్రస్తులు మధ్యలోనే మానేస్తుండటంతో మళ్లీ తిరగబెడుతోంది. ఒక వ్యాధిగ్రస్తుడి ద్వారా 15 నుంచి 20 మందికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని టీబీ డాక్టర్లు చెబుతున్నారు. రోగి దగ్గితే సుమారు 40 వేల వరకు వ్యాధి కారక క్రిములు గాలిలో కలుస్తాయి. వ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా గుండె, కాలేయం, పేగులు, మెదడు, ఎముకలు వంటి శరీర అవయవాలకు సోకే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు కూడా టీబీ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం రావటం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం వంటివి క్షయ లక్షణాలుగా చొప్పొచ్చు.
ఎండీఆర్ కేసులూ అధికమే..
జిల్లాలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్(ఎండీఆర్) కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మందులు వాడుతూ మధ్య ఆపివేయటం, విచ్చలవిడిగా మందులు వాడటం వంటి వ్యాధిగ్రస్తులను ఎండీఆర్ కేసులుగా పిలుస్తారు. సాధారణంగా టీబీ సోకిన వారు 6 నెలలు మందులు వాడాల్సి ఉండగా, ఎండీఆర్ కేసులకు చెందిన వ్యాధిగ్రస్తులు 18 నెలలు మందులు వాడాల్సి ఉంటుంది. జిల్లాలో 2017లో 31 ఎండీఆర్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 2015లో 66 కేసులు, 2016లో 82 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉండగా.. 18 డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ సెంటర్(డీఎంసీ)ల ద్వారా టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల పరిధిలో రెండు వారాలకు మించి దగ్గు ఉండే రోగులను డీఎంసీకి పంపిస్తారు. ఇక్కడ వారికి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఖమ్మం, సత్తుపల్లి, మధిర, తల్లాడ, నేలకొండపల్లి, మంచుకొండ, వైరాలో ట్యూబరో క్లోసిస్ యూనిట్లు ఉన్నాయి. అందులోని సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్లు రోగులు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అనే విషయంపై పర్యవేక్షిస్తుంటారు. ఖమ్మంలోని జిల్లా టీబీ కంట్రోల్ కార్యాలయంలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వార్డులో రోగులకు మందులు పంపిణీ చేస్తారు.
రోజువారీ కోర్సు ఇస్తున్నాం..
గతంలో రోజు విడిచి రోజు మందులు ఇచ్చేవారు. ఫలితంగా కొందరు రోగులకు మాత్రలు పడేవి కావు. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డైలీ కోర్సు ప్రవేశపెట్టి రోజూ మాత్రలు వేసుకునే విధానం వచ్చింది. నాలుగు రకాలకు చెందిన మందు ఒకే మాత్రలో ఉంటుంది. బరువునుబట్టి డోస్ ఇస్తున్నాం. జిల్లాలో టీబీని తగ్గించేందుకు శ్రమిస్తున్నాం. దగ్గు రెండు వారాలకు మించి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే రోగులు కోర్సు పూర్తయ్యే వరకు మందులు వాడితే మళ్లీ టీబీ వచ్చే అవకాశం ఉండదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. టీబీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – వి.సుబ్బారావు, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment