సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎయిడ్స్ రహిత తరాన్ని అందించడానికి అవసరమైన సాధనాలు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి’ అంటూ 2011, డిసెంబర్ 1వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్య ఓ కొత్త చొరవకు దారితీసింది. ఎయిడ్స్‌ను కనుగొన్న 30 సంవత్సరాల అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైద్య రంగానికే స్ఫూర్తినిచ్చింది. అప్పటికే దాదాపు మూడు కోట్ల మంది మరణానికి కారణమైన ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచం కలసికట్టుగా ముందుకు కదిలింది. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు ఎయిడ్స్ రోగులను ‘పీపుల్ లివింగ్ విత్ హెచ్‌ఐవీ’ అని పిలుస్తున్నారు.
ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన కృషి ఫలితంగా 2000 సంవత్సరం నుంచి హెచ్‌ఐవీ కేసుల సంఖ్య 30 శాతం తగ్గింది. 2003 నుంచి మృతుల సంఖ్య 40 శాతం తగ్గింది. ఒక్క సబ్ సహారా ఆఫ్రికాలో గత దశాబ్దం కాలంలో 25 నుంచి 50 శాతం కేసులు తగ్గాయి. ఈ క్రమంలోనే ఆమ్‌స్టర్‌డామ్‌లో జూలై 23 నుంచి 27 వరకు ఎయిడ్స్‌పై ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఇదే సమయంలో ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. రెండో రకం చికిత్సను కూడా తట్టుకొని బతకకలిగే శక్తిని హెచ్‌ఐవీ సాధించిందనేదే ఆ వార్త.
ఎయిడ్స్ నివారణలో ప్రస్తుతం రెండు రకాల చికిత్స విధానాన్ని అమలు చేస్తున్నారు. మొదటి రకం విధానానికి రోగి స్పందించకపోతే రెండోరకం విధానాన్ని అమలు చేస్తారు. దాంతో 90 శాతం మంది రోగులకు హెచ్‌ఐవీ నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ విధానం కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదని, రోగుల్లో వ్యాధి ముదిరి మరణిస్తున్నారని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఇతర బ్యాక్టీరియాలకన్నా పరావర్తనం చెందే శక్తి హెచ్‌ఐవీ వైరస్‌లో పది లక్షల కన్నా ఎక్కువ ఉండడం వల్ల అది మందులకు లొంగకపోతే విపరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఎయిడ్స్ నివారణకు అమెరికాలో 28 రకాల మందులు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు రకాల కాంబినేషన్లలో మాత్రమే ఈ మందులను వాడుతారు. ఒకటో రకం కాంబినేషన్ రోగిపై పనిచేయడం ఇది వరకే నిలిచిపోగా, ఇప్పుడు రెండో రకం కాంబినేషన్ కూడా పనిచేయక పోవడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment