పులిరాజా పరీక్షల్లేవు! | no tests to aids | Sakshi
Sakshi News home page

పులిరాజా పరీక్షల్లేవు!

Published Tue, Jul 14 2015 8:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

పులిరాజా పరీక్షల్లేవు!

పులిరాజా పరీక్షల్లేవు!

⇒  హెచ్‌ఐవీ రోగుల నెత్తిన పిడుగు
⇒  ఆరు నెలలుగా టెస్టింగ్ కిట్‌లు లేక ఆగిన వైద్యపరీక్షలు
⇒  హెచ్‌ఐవీ పాజిటివ్ తల్లుల బిడ్డలకు లభించని సిరప్‌లు
 ⇒ నెలకు రెండు లక్షలమంది కిట్‌లు లేక తిరుగుముఖం
 ⇒ చిన్నాభిన్నమైన ఎన్జీవో వ్యవస్థ.. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ల దోపిడీ


సాక్షి, హైదరాబాద్: జబ్బును బయటకు చెప్పలేరు.. అలాగని లోపలా దాచుకోలేరు.. అలాంటి బాధ అనుభవించే హెచ్‌ఐవీ రోగుల నెత్తిన పిడుగుపడింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి (నాకో) నిధులివ్వలేదన్న కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ ఉందో లేదో నిర్ధారించేందుకు వాడాల్సిన టెస్ట్‌కిట్‌లు అందుబాటులో లేకుండా చేశారు.  దీంతో హెచ్‌ఐవీ పరీక్షలకు వచ్చేవారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఏపీశాక్స్‌ను 10వ షెడ్యూల్‌లో చేర్చడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలూ దీన్ని గాలికొదిలేశాయి. దీంతో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల తర్వాత అత్యధిక హెచ్‌ఐవీ రోగులున్న తెలుగు రాష్ట్రాల్లో నియంత్రణ పూర్తిగా అదుపు తప్పింది. ఈఏడాది నాకోనుంచి రూ.100 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఐసీటీసీల్లో కిట్‌లు ఎక్కడ?
ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ (ఐసీటీసీ)కు నెలకు రెండు లక్షలమంది సెక్స్ వర్కర్లు, డ్రై వర్లు ఇలా పలు వర్గాలకు చెందినవారు పరీక్షలకోసం వస్తారు. ఇందులో నెలకు కనీసం నాలుగువేల మందికి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో 463 ఐసీటీసీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో గత ఫిబ్రవరి నుంచి కిట్‌లు లేకపోవడంతో వైద్య పరీక్షలు ఆపేశారు. దీంతో గడిచిన నాలుగు నెలల్లో ఎనిమిది లక్షల మంది బాధితులు వైద్య పరీక్షలు చేయించుకోకుండా వెనక్కు వెళ్లిపోయారు.

గర్భిణుల బిడ్డలకు సిరప్‌లు ఏవీ?
ఎయిడ్స్ నియంత్రణా మండలి లెక్కల ప్రకారం ఈ ఏడాది హెచ్‌ఐవీ పాజిటివ్ గర్భిణులు నాలుగువేల మందిపైనే ఉన్నట్టు అంచనా. వీళ్లు ప్రసవం అయిన తక్షణమే బిడ్డకు 72 గంటల్లోగా నెవాప్రిన్ సిరప్ వేయాలి. ఆ తర్వాత 3 నుంచి 13 వారాల వరకూ సెప్ట్రాన్ సిరప్ వేయాలి. ఈ రెండు సిరప్‌లు వేస్తేనే తల్లినుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా ఉంటుంది. గడిచిన ఆరు మాసాల్లో రెండువేల మందికి పైగా హెచ్‌ఐవీ సోకిన గర్భిణులు ప్రసవం అయ్యారు. కానీ ఆ బిడ్డలకు సిరప్‌లు వేసే పరిస్థితి లేదు. ఆ బిడ్డల పరిస్థితి దారుణం.

సీడీ4 కిట్‌లూ లేవు
హెచ్‌ఐవీ రోగులకు వ్యాధినిరోధకత శక్తిని సీడీ4 టెస్ట్‌ద్వారా చూస్తారు. అంటే తెల్లరక్త కణాల కొలమానం అన్నమాట. సీడీ4 కౌంట్ 350 కంటే తగ్గితే ఆ వ్యాధిగ్రస్థుడు ఖచ్చితంగా ఏఆర్‌టీ (యాంటీ రిట్రోవెల్ ట్రీట్‌మెంట్) మందులు వాడాలి. హెచ్‌ఐవీ సోకిన టీబీ రోగులైతే విధిగా ఏఆర్‌టీ మందులు వాడాల్సిందే. ఈ టెస్టును ప్రతి ఆరు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. కానీ ఏడాదిగా రెండు రాష్ట్రాల్లో సీడీ4 కిట్‌లు లేవు. దీంతో హెచ్‌ఐవీ రోగులు ప్రై వేటుకు వెళ్లలేక, ఇక్కడ కిట్‌లు లేక యాతన పడుతున్నారు.


డీపీఎంల దోపిడీ రాజ్యం
ఏడాదిగా హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క ప్రచార కార్యక్రమమూ లేదు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లుగా నియమితులైనవారు ఎన్జీవోలనుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. దీంతో ఎన్జీవోలు పనిచేయడం మానేశారు. కొందరు నాలుగైదేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తూ హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క కార్యక్రమమూ చేపట్టలేదు. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రాలను పర్యవేక్షించే ఓ జాయింట్ డెరైక్టర్ అండతో ప్రాజెక్టు మేనేజర్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.

కేంద్రం నుంచి రావడం లేదు
హెచ్‌ఐవీ కిట్‌లు లేని మాట వాస్తవమే. అయితే ఇవి  కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ రాలేదు. ఈ                     ఏడాది నిధులు కూడా రూ.100 కోట్లు రావాల్సి ఉండగా రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి. - డాక్టర్ రామ్మోహన్, జేడీ, ఏపీశాక్స్    

నా ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక పోతున్నా
ఐదారేళ్లుగా హెచ్‌ఐవీతో బాధపడుతున్నా. ఇక్కడ హెచ్‌ఐవీ రోగులకు వైద్యసేవలు అందడం లేదంటే జిల్లా ప్రాజెక్టు మేనేజర్లే కారకులు. ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకుండా వచ్చిన నిధులను తినేస్తున్నారు. దీంతో వేలాదిమంది హెచ్‌ఐవీ రోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.-కె.రవి, హెచ్‌ఐవీ బాధితుడు  (సమాచార హక్కుచట్టం కార్యకర్త)

రెండు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ బాధితులు    5 లక్షలు
తెలంగాణలో హెచ్‌ఐవీ బాధితులు    2.5 లక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌ఐవీ బాధితులు 2.7 లక్షలు
ఏటా కొత్తగా నమోదయ్యే బాధితులు    25 వేలు
ఏటా ప్రసవానికి వస్తున్న హెచ్‌ఐవీ బాధితులు 5 వేలు
ఏటా రెండు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ మృతులు 31 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement