గాంధీనగర్: డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీగా పనిచేసే ఒక యువకుడు బరిలోకి దిగుతున్నాడు. గాంధీ నగర్‌లోని ఓ మురికివాడలో నివసించే మహేంద్ర పాట్నీకి స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి నుంచి ఇతడు రూ.10వేలు సేకరించాడు. ఈ డబ్బంతా రూపాయి నాణేల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి అతడు ఎన్నికల సంఘం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. దీంతో డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.
మహేంద్ర పాట్నీ గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు స్వతహాగా ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే ఉంది. 2019లో ఓ హోటల్‌కు దారికోసం ఇతడు నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. 521 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో వారు గత్యంతరంలేక వేరేప్రాంతానికి తరలివెళ్లారు. కానీ అక్కడ విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేవు. వీరిని పట్టించుకునే నాథుడు కూడా లేడు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వారంసా తమ ప్రతినిధిగా మహేంద్ర పాట్నీని నిలబెట్టారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దింపుతున్నారు.
2010లోనూ మహెంద్ర పాట్నీ నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ప్రభుత్వం నిర్మించిన దండీ కుటీర్ మ్యూజియం కోసం వీరి గుడిసెలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు ఓ హోటల్‌కు దారికోసం వీరి కాలనీని కాళీ చేయించారు.
దీంతో తమ సమస్యను పరిష్కరించునేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుని మహేంద్ర పాట్నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తాయని, కానీ ఎన్నికల తర్వాత తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. అందుకే తామే స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు.
అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మహేంద్ర పాట్నీ చెబుతున్నాడు. తాము నివసించేందుకు శాశ్వతంగా ఒక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాడు. అంతేకాదు తమ దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తరచూ సీజ్ చేస్తున్నారని, తిరిగి వాటిని విడిచిపెట్టేందుకు రూ.2500-3000 తీసుకుంటున్నారని తెలిపాడు. ఇలా జరగకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 2, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటిస్తారు.
చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్‌మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్..
Comments
Please login to add a commentAdd a comment