గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ చేయని ప్రయత్నాల్లేవు! ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కూడా కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్మాత్మకంగా మారింది. ముక్కోణ పోరులో నెగ్గేందుకు ఆదివాసీ మంత్రం జపిస్తోంది...!
ఆదివాసీ ప్రాంతాల్లో పట్టు బిగించడం ద్వారా గుజరాత్ అసెంబ్లీతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి బీజేపీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఎన్నిక, మరో జలియన్‌వాలాబాగ్‌గా పేరు పడిన రాజస్థాన్‌లోని మాన్‌గఢ్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం వంటి చర్యలెన్నో చేపడుతోంది. కాంగ్రెస్ కంచుకోటలైన ఈ స్థానాల్లో ఆప్ కూడా ప్రభావం చూపొచ్చన్న ఆందోళనా బీజేపీలో ఉంది.
ఆదివాసీ స్థానాల్లో ఆప్ గట్టిగా ప్రచారం చేస్తోంది. వారు మొదట్నుంచే తనవైపే అయినా ముక్కోణపు పోటీలో ఏం జరుగుతుందోనన్న అనుమానంతో భారతీయ ట్రైబల్ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 27 ఏళ్ల బీజేపీ పాలనతో తమ బతుకులు ఏమీ మారలేదని ఆదివాసీలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రచారాన్ని బీజేపీ మరింత ఉధృతం చేసింది. ‘మీ దీవెనలు కావా’లంటూ ఆదివాసీ ప్రాంతమైన వల్సద్ నుంచే మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
27 ఎస్టీ స్థానాల్లో కనీసం 20 గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లతో ఆదివాసీల అభివృద్ధి ప్యాకేజీ తెచ్చింది. ఆదివాసీలకు ఉద్యోగాల కల్పన, ఆ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని ప్రచారంలో ప్రస్తావిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో స్వయంపాలన కోసం 1996లో పార్లమెంటు చేసిన ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ (పెసా) అమలు కాకపోవడం, భూ యాజమాన్య హక్కుల వంటివి విపక్షాల ప్రచారాస్త్రాలుగా మారాయి.
‘‘పెసా తదితరాలపై ఆదివాసీలు కాస్త అసంతృప్తిగా ఉన్నా అది చాలా తక్కువ. 20 ఏళ్లలో వారి జీవితాలు చాలా మారాయి. అభివృద్ధి కనిపిస్తోంది. అందుకే ఆదివాసీలు ఈ సారి మా వైపే ఉంటారు’’ అని భరూచ్ బీజేపీ ఎంపీ మన్‌సుఖ్ వాసవ ధీమాగా చెప్పారు. గుజరాత్‌లో ప్రచారాన్ని బీజేపీ, ఆప్ ఉధృతంగా చేస్తున్నా కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ఆ రాష్ట్రం వైపు కూడా చూడకపోవడం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తిని రాజేస్తోంది. ఈ ముక్కోణపు పోటీలో బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఆదివాసీలు అండగా ఉంటారో లేదో.. వేచి చూడాలి..
ఏ ఫర్ ఆదివాసీ
‘‘ఏ ఫర్ ఆదివాసీ’’ వారి కంటే తనకు ముఖ్యం మరెవరూ కాదంటూ ప్రధాని మోదీ గుజరాత్‌లోని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గుజరాత్ జనాభాలో 15% గిరిజనులే ఉన్నారు. అంటే దాదాపుగా 80 లక్షల నుంచి కోటి మంది వరకు గిరిజన జనాభా ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 8.1% గిరిజన జనాభా గుజరాత్‌లోనే ఉన్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాలు 53 తాలూకాల్లో వీరి జనాభా విస్తరించి ఉంది. ఉత్తరాన అంబాజీ నుంచి దక్షిణాన ఉంబర్‌గావ్ వరకు ఆదివాసీల ప్రాబల్యమున్న ప్రాంతాలున్నాయి. మొత్తంగా 12 తెగలు ఉన్నప్పటికీ భిల్ తెగకు చెందినవారే సగం మంది ఉన్నారు. ఇక దాంగ్ జిల్లాలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ.
గిరిపుత్రులు ఎటువైపో?!
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 182కి గాను 27 ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 48 అసెంబ్లీ స్థానాల్లో ఆదివాసీ ఓట్లు అత్యంత కీలకం. రెండు దశాబ్దాలుగా అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ ఎస్టీ జనాభా ప్రాబల్యం అధికంగా ఉన్న సీట్లలో కాంగ్రెస్ స్థానం చెక్కు చెదరలేదు. గత మూడు దఫా ఎన్నికల్లోనూ ఎస్టీ రిజర్వ్ స్థానాలను బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది సీట్లు, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రెండు సీట్లలో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో అయిదుగురు ఆ తర్వాత బీజేపీ గూటికి చేరుకున్నారు. అంతకు ముందు 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 16 సీట్లలో గెలుపొందితే, బీజేపీకి 10, జనతాదళ్ (యూ)కి ఒక్క సీటు వచ్చింది.
గిరిజనుల సమస్యలు
గుజరాత్‌లో ఆదివాసీ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపం ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉంది. అక్షరాస్యత చాలా తక్కువ. కొండల్లో కోనల్లో పండిన పంటల నుంచి వచ్చే ఆదాయం ఏ మాత్రం వారికి సరిపోవడం లేదు. దళారుల దోపిడీలతో విసిగి వేసారి ఉన్నారు. ప్రతీ ఏడాది రాష్ట్రంలోని గిరిజనుల్లో 30% మంది ఉపాధి అవకాశాల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిపోతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్య, నిరుద్యోగం, ఆరోగ్యం, కుల సర్టిఫికెట్, ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ అమలు వంటి సమస్యలు ఇప్పటికీ ఎన్నికల ఎజెండాలో ఉన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment