Adivasi woman
-
ఇప్పటికే ఏడుగురు.. ఇప్పుడు మరో ముగ్గురు.. మొత్తం 10 మంది పిల్లలు
భద్రాచలం అర్బన్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఆదివాసీ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది సాధారణ కాన్పు కావడం విశేషం. కాగా ఆమెకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బట్టిగూడెంకు చెందిన పుజ్జ అనే మహిళకు ఈనెల 2వ తేదీన పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం పుజ్జ మొదట ఇద్దరు మగ శిశువులకు జన్మనివ్వగా వైద్యులు కవల పిల్లలనే అనుకున్నారు. ఇంతలోనే పుజ్జ మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, పుజ్జ వయసు 29 ఏళ్లు మాత్రమే కాగా, ఆమెకు ఇది ఎనిమిదో కాన్పు అని చెప్పారు. ఇప్పటికే ఆమెకు నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు ఉండగా, ఇప్పుడు పుట్టిన ముగ్గురితో కలిపి ఆమెకు మొత్తం పది మంది సంతానం అయ్యారు. పుజ్జకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాక డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పుజ్జకు సాధారణ ప్రసవం జరిగేలా కృషి చేసిన హెడ్‌నర్సు విజయశ్రీ, ఇతర సిబ్బందిని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అభినందించారు. -
ఆదివాసీలు ఆదుకుంటారా?
గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ చేయని ప్రయత్నాల్లేవు! ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కూడా కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్మాత్మకంగా మారింది. ముక్కోణ పోరులో నెగ్గేందుకు ఆదివాసీ మంత్రం జపిస్తోంది...! ఆదివాసీ ప్రాంతాల్లో పట్టు బిగించడం ద్వారా గుజరాత్ అసెంబ్లీతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి బీజేపీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఎన్నిక, మరో జలియన్‌వాలాబాగ్‌గా పేరు పడిన రాజస్థాన్‌లోని మాన్‌గఢ్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం వంటి చర్యలెన్నో చేపడుతోంది. కాంగ్రెస్ కంచుకోటలైన ఈ స్థానాల్లో ఆప్ కూడా ప్రభావం చూపొచ్చన్న ఆందోళనా బీజేపీలో ఉంది. ఆదివాసీ స్థానాల్లో ఆప్ గట్టిగా ప్రచారం చేస్తోంది. వారు మొదట్నుంచే తనవైపే అయినా ముక్కోణపు పోటీలో ఏం జరుగుతుందోనన్న అనుమానంతో భారతీయ ట్రైబల్ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 27 ఏళ్ల బీజేపీ పాలనతో తమ బతుకులు ఏమీ మారలేదని ఆదివాసీలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రచారాన్ని బీజేపీ మరింత ఉధృతం చేసింది. ‘మీ దీవెనలు కావా’లంటూ ఆదివాసీ ప్రాంతమైన వల్సద్ నుంచే మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 27 ఎస్టీ స్థానాల్లో కనీసం 20 గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లతో ఆదివాసీల అభివృద్ధి ప్యాకేజీ తెచ్చింది. ఆదివాసీలకు ఉద్యోగాల కల్పన, ఆ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని ప్రచారంలో ప్రస్తావిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో స్వయంపాలన కోసం 1996లో పార్లమెంటు చేసిన ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ (పెసా) అమలు కాకపోవడం, భూ యాజమాన్య హక్కుల వంటివి విపక్షాల ప్రచారాస్త్రాలుగా మారాయి. ‘‘పెసా తదితరాలపై ఆదివాసీలు కాస్త అసంతృప్తిగా ఉన్నా అది చాలా తక్కువ. 20 ఏళ్లలో వారి జీవితాలు చాలా మారాయి. అభివృద్ధి కనిపిస్తోంది. అందుకే ఆదివాసీలు ఈ సారి మా వైపే ఉంటారు’’ అని భరూచ్ బీజేపీ ఎంపీ మన్సుఖ్ వాసవ ధీమాగా చెప్పారు. గుజరాత్లో ప్రచారాన్ని బీజేపీ, ఆప్ ఉధృతంగా చేస్తున్నా కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ఆ రాష్ట్రం వైపు కూడా చూడకపోవడం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తిని రాజేస్తోంది. ఈ ముక్కోణపు పోటీలో బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఆదివాసీలు అండగా ఉంటారో లేదో.. వేచి చూడాలి.. ఏ ఫర్ ఆదివాసీ ‘‘ఏ ఫర్ ఆదివాసీ’’ వారి కంటే తనకు ముఖ్యం మరెవరూ కాదంటూ ప్రధాని మోదీ గుజరాత్‌లోని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గుజరాత్ జనాభాలో 15% గిరిజనులే ఉన్నారు. అంటే దాదాపుగా 80 లక్షల నుంచి కోటి మంది వరకు గిరిజన జనాభా ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 8.1% గిరిజన జనాభా గుజరాత్‌లోనే ఉన్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాలు 53 తాలూకాల్లో వీరి జనాభా విస్తరించి ఉంది. ఉత్తరాన అంబాజీ నుంచి దక్షిణాన ఉంబర్‌గావ్ వరకు ఆదివాసీల ప్రాబల్యమున్న ప్రాంతాలున్నాయి. మొత్తంగా 12 తెగలు ఉన్నప్పటికీ భిల్ తెగకు చెందినవారే సగం మంది ఉన్నారు. ఇక దాంగ్ జిల్లాలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ. గిరిపుత్రులు ఎటువైపో?! రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 182కి గాను 27 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 48 అసెంబ్లీ స్థానాల్లో ఆదివాసీ ఓట్లు అత్యంత కీలకం. రెండు దశాబ్దాలుగా అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ ఎస్టీ జనాభా ప్రాబల్యం అధికంగా ఉన్న సీట్లలో కాంగ్రెస్ స్థానం చెక్కు చెదరలేదు. గత మూడు దఫా ఎన్నికల్లోనూ ఎస్టీ రిజర్వ్ స్థానాలను బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది సీట్లు, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రెండు సీట్లలో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో అయిదుగురు ఆ తర్వాత బీజేపీ గూటికి చేరుకున్నారు. అంతకు ముందు 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 16 సీట్లలో గెలుపొందితే, బీజేపీకి 10, జనతాదళ్ (యూ)కి ఒక్క సీటు వచ్చింది. గిరిజనుల సమస్యలు గుజరాత్లో ఆదివాసీ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపం ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉంది. అక్షరాస్యత చాలా తక్కువ. కొండల్లో కోనల్లో పండిన పంటల నుంచి వచ్చే ఆదాయం ఏ మాత్రం వారికి సరిపోవడం లేదు. దళారుల దోపిడీలతో విసిగి వేసారి ఉన్నారు. ప్రతీ ఏడాది రాష్ట్రంలోని గిరిజనుల్లో 30% మంది ఉపాధి అవకాశాల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిపోతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్య, నిరుద్యోగం, ఆరోగ్యం, కుల సర్టిఫికెట్, ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ అమలు వంటి సమస్యలు ఇప్పటికీ ఎన్నికల ఎజెండాలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేలమ్మ
ఆమె ఒక విత్తన గని. భారతదేశ ధాన్య సంపదను పరిరక్షించిన దేశభక్తురాలు. నేలను నమ్మిన భూమాత. మట్టిని గౌరవించిన దేశమాత. సస్యాన్ని కాపాడిన ప్రకృతి తల్లి. అందుకే... ఆమెను గౌరవించడం ద్వారా మనందరి గౌరవాన్ని పెంచింది మన భారతదేశం. మార్చి 16వ తేదీన రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాలకు వేదికైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందచేస్తున్నారు. మహామహులు అందుకునే పురస్కారాల్లో ఈ ఏడాది పద్మాలు ఎవరో చూడాలని టీవీల ముందు కూర్చుంది ఇండియా. ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రొటోకాల్ గౌరవాలందుకుంటూ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి ముందుకు వస్తున్నారు. ‘కమలా పూజారి, వ్యవసాయరంగం’ అని వినిపించింది. ఒక బక్క పలుచటి మహిళ, డెబ్బై ఏళ్లు నిండిన మహిళ, ఒడిషా రాష్ట్రానికి చెందిన భూమియా ఆదివాసీ మహిళ... రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తోంది. ఒడిషా ముతక చేనేత చీరను మడమల పైకి కట్టుకుంది. పాదాలకు స్లిప్పర్స్. భుజాల మీద శాలువా ఉంది. శాలువా ఆమెకు అలవాటున్న వస్త్రధారణలా లేదు. జారిపోతున్న శాలువాను సర్దుకుంటూ రాష్ట్రపతి ఎదురుగా మెరిసే కళ్లతో నిలబడిందామె. దేహం బలహీనంగా ఉంది, ఆమె కళ్లలో ధైర్యం బలంగా ఉంది. పద్మశ్రీ పురస్కారాన్ని మనసారా స్వీకరించడానికి సిద్ధంగా ఉందామె. భావి తరాలకు అన్నానికి భరోసా కల్పించిన ఆ తల్లికి పద్మశ్రీ పురస్కారాన్ని తన చేతుల మీదుగా ప్రదానం చేస్తున్నందుకు రాష్ట్రపతి కూడా సంతోషిస్తున్నారు. విత్తనానికి భవిష్యత్తు కమలా పూజారిది ఒడిషా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పత్రాపుట్ గ్రామం. ఆమె ఏమీ చదువుకోలేదు. స్కూలు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది. ఆమెకు మాత్రమే కాదు ఆ గ్రామంలో అందరిదీ ఒకటే జీవనశైలి. రోజుకింత వండుకోవడం, పొలానికి వెళ్లి సేద్యం చేసుకోవడమే ఆమెకి తెలిసింది. అది కాకుండా ఆమెకి తెలిసిన మరో సంగతి.. మన నేల మనకిచ్చిన వంగడాలను కాపాడుకోవాలని మాత్రమే. అందుకే పండించిన ప్రతి పంట నుంచి కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది. అలా ఇప్పటి వరకు వందకు పైగా విత్తనాల రకాలున్నాయి ఆమె దగ్గర. అవి మన నేలలో ఉద్భవించిన మొలకలు కాబట్టి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. తెగుళ్ల నుంచి వాటిని అవే కాపాడుకుంటాయి. రసాయన పురుగు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదు. ‘మా విత్తనాలు కొనండి, అధిక దిగుబడిని సాధించండి’ అని ఊదరగొట్టే విత్తనాల కంపెనీల ఆటలేవీ సాగవు ఆమె దగ్గర. తెగుళ్ల నివారణకు మా క్రిమి సంహారక మందులనే వాడండి అనే ప్రకటనలకూ మార్కెట్ లేదక్కడ. దేశీయతను పరిరక్షించడం ద్వారా బహుళ జాతి కంపెనీలకు ఎంట్రీ లేకుండా చేయగలగడమే ఆమె సాధించిన విజయం. జన్యుమార్పిడి పంటలు, డీ జనరేషన్ విత్తనాలు రాజ్యమేలుతూ, ఎరువుల కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీలు రైతుని నిలువునా దోచేస్తున్న ఈ రోజుల్లో... భారత భవిష్యత్తు తరానికి ఆరోగ్యకరమైన విత్తనాలను దాచి పెట్టింది కమలా పూజారి. అందుకే దేశం ఆమెకు పద్మశ్రీ ప్రదానం చేసి ప్రణమిల్లింది. స్వామినాథన్ వదిలిన బాణం దాదాపు పాతికేళ్ల కిందట... ఒడిషాలోని జేపూర్ పట్టణంలో ఉన్న ఎమ్.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. ఆ సదస్సుకు హాజరైన రైతు మహిళల్లో కమలాపూజారి కూడా ఉన్నారు. ఆమె శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను తదేకంగా గ్రహించడంతోపాటు ఆచరణలోనూ పెట్టింది. పంటను గింజ కట్టడం ఆమె ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అయితే ఆ సదస్సులో ఆమె కొత్తగా రసాయన ఎరువుల అవసరం లేని పంటలనే పండించాలని తెలుసుకున్నారు. మంచి విత్తనాన్ని దాచడం అనేది తాను ఎప్పటి నుంచో ఆచరిస్తున్నదే. కొత్తగా చేయాల్సింది ప్రతి విత్తనాన్నీ దాచి ఉంచడం, సేంద్రియ వ్యవసాయం చేయమని పదిమందికి తెలియ చెప్పడం. వాడ వాడలా జనాన్ని సమీకరించి దేశీయ విత్తనాలను కాపాడాల్సిన అవసరాన్ని తెలియ చెప్పడంతోపాటు రసాయన ఎరువులను బహిష్కరించడానికి కూడా పిలుపునిచ్చారు కమల. పత్రాపూట్లో తన ఊళ్లో ఇంటింటికీ తిరిగి చెప్పారు. పరిసర గ్రామాలకు కూడా వెళ్లి సేంద్రియ చైతన్యం తెచ్చారు. కోరాపూట్ పక్కనే ఉన్న నబరంగపూర్ జిల్లాలోని అనేక గ్రామాలు ఆమె బాట పట్టాయి. గ్రామస్థులను సమీకృతం చేసి, స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విత్తనాల బ్యాంక్ (సీడ్ బ్యాంక్) నెలకొల్పారు కమల. రసాయన ఎరువుల పంజా తమ ఆదివాసీ ప్రాంతాల మీద పడనివ్వకుండా ఆపిన ధీర ఆమె. బీజంలో జీవం ఉంటుంది. గింజలో ఉన్న పునరుత్పత్తి చేసే గుణాన్ని కాపాడుకోవాలి. డీ జర్మినేషన్ గింజల వెంట పరుగెత్తకుండా జర్మినేషన్ సీడ్‌ను రక్షించుకోవాలనేది స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం, అవార్డుల పంట సేంద్రియ పంటతోపాటు కమలాపూజారికి అవార్డుల పంట కూడా వరించింది. స్వామినాథన్ ఫౌండేషన్ 2002లో సౌత్ ఆఫ్రికా, జోహాన్నెస్ బర్గ్‌లో సేంద్రియ వ్యవసాయం మీద నిర్వహించిన సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆమె తన అనుభవాలను ఆ సదస్సులో ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. విశేషమైన ప్రశంసలందాయామెకి. ‘ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు’తో గౌరవించిందా సదస్సు. ఆ తర్వాత ఏడాది మన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో కమలా పూజారిని ‘కృషి విశారద’ బిరుదును ప్రదానం చేసింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ‘ఒడిషా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ’ 2004లో కమలాపూజారిని ‘ఉత్తమ మహిళా రైతు’ పురస్కారంతో గౌరవించింది. కమలా పూజారి గౌరవార్థం ఆ యూనివర్శిటీలో గాళ్స్ హాస్టల్‌కు ఆమె పేరు పెట్టింది. అంతే కాదు... ఆ హాస్టల్ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగా చేయించింది ప్రభుత్వం. అలాగే జేపూర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఉచితంగా ఆహారం పెట్టే ‘రాత్రి ఆహార్ కేంద్ర’ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగానే జరిగింది. గౌరవాలున్నాయి.. గూడే లేదు ఒడిషాలో ప్రభుత్వం రైతు సదస్సు నిర్వహిస్తే, ఆ సదస్సులో పాల్గొనవలసిందిగా కమలా పూజారికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. సన్మానమూ ఉంటుంది. మహిళాదినోత్సవం రోజున కూడా పురస్కరించుకోవడానికి స్థానిక అధికారులకు మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి కమలా పూజారి. అయితే ఆమెకు నిలవ నీడ కల్పిద్దామనే ఆలోచన మాత్రం ఏ అధికారికీ రాలేదు. ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు అందుకోవడానికి అవసరమైన ప్రధాన అర్హత పేదరికం. ఆమెను చూస్తే పేదరికంలో మగ్గుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విఆర్వో ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదు. పేదరికం ఆమె ఒంటి మీద తాండవిస్తోంది. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వమని ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చారామె. ఇవ్వగా ఇవ్వగా ఆఖరుకి ఆమెకి గవర్నమెంట్ కట్టించి ఇచ్చిన ఇంటికి కరెంటు లేదు, కనీసం కిటికీ కూడా లేదు. ఏ మాత్రం ఆవాసయోగ్యంగా లేని ఇంట్లో ఉంటోందామె. గవర్నర్ ఆహ్వానం గత ఏడాది ఒడిషా ప్రభుత్వం కమలాపూజారిని స్టేట్ ప్లానింగ్ బోర్డు మెంబరుగా నియమించింది. ఈ బోర్డులో ఒక ఆదివాసీ మహిళకు స్థానం లభించడం మొదటిసారి. ప్లానింగ్ బోర్డు మెంబరు హోదాలో వచ్చిందా, ఆదర్శ రైతు మహిళగా ఆహ్వానం వచ్చిందో ఆమెకు తెలియదు... కానీ, స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి గత ఏడాది ఆమెకు ఆహ్వానం వచ్చింది. అది నిజానికి అత్యంత గౌరవపూర్వకమైన ఆహ్వానం. విశిష్ఠ వ్యక్తులకు మాత్రమే అందే ఆహ్వానం. అయితే తన ఊరి నుంచి రాజధానికి వెళ్లడానికి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో హాజరుకాలేకపోయారు కమల. అప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి పరిశీలన చేయనేలేదు. పత్రాపుట్ వాసులైతే ‘ఆమెను ప్లానింగ్ బోర్డులో నియమించడం అంటే ఆమెను గౌరవించడం కాదు, ఆమె పేదరికాన్ని పరిహసించడమే’ అని ప్రభుత్వ తీరును నిరసించారు. ఆమె మాత్రం ‘ప్లానింగ్ బోర్డు మీటింగ్ ఎప్పుడు జరిగినా వెళ్లి మా ఊరికి తాగు నీటి సౌకర్యం కోసం మాట్లాడతాను’ అని చెప్పారు తప్ప తనకోసం ఏదైనా అడుగుతానని అనలేదు. పరమానందం కమలా పూజారిలో గొప్పదనం ఏమిటంటే... ఆమె పేదరికం గురించి ఊరంతా ఆవేదన చెందుతున్నప్పటికీ ఆమె మాత్రం తన పేదరికాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దేశం తనను ఇంత పెద్ద పురస్కారానికి ఎంపిక చేసినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేశారామె. ఊరి వాళ్లు మాత్రం... ‘‘అత్యంత పేదరికాన్ని అనుభవిస్తోంది. అత్యంత ఉన్నతమైన వేదికల మీద పురస్కారాలను అందుకుంటోంది. పురస్కారం అందుకుని వచ్చిన మరుసటి రోజు నుంచి తిరిగి పొలం పనులకు పోతుంది ఎప్పటిలా’’... అని ఆమెను సగౌరవంగా తలుచుకున్నారు. ఆమె సేవలను ప్రభుత్వం సగర్వంగా చాటుకుంటోంది. అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించుకుంటోంది. అంతటి విలువైన సేవలందించిన కమలాపూజారికి పద్మశ్రీ ప్రదానం చేయడం వల్ల పెరిగింది ఆమె గౌరవం కాదు... దేశ గౌరవమే. – వాకా మంజులారెడ్డి రీసెర్చ్ బ్యాంక్ భవిష్యత్తు వ్యవసాయరంగానికి మార్గదర్శనం చేస్తున్న మహిళ కమలా పూజారి. సుస్థిరమైన, నిరంతరాయమైన అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవ వ్యవసాయ రంగానికే మార్గదర్శనం. మనదేశీయ పంటల నిధిని భావితరాల కోసం భద్రపరిచిన ముందు చూపున్న తల్లి కమలా పూజారి అని దేశం ఆమెను ప్రశంసలతో ముంచెత్తింది. వరిలో రకాలు, పసుపు, నువ్వులు, నల్ల జీలకర్ర, రకరకాల చిరుధాన్యాలు, మహాకంత, ఫూలా వంటి ఆరతడి పంటల విత్తనాలు, నీటి పంటలు గింజలు ఆమె సేకరణలో ఉన్నాయి. ఆమె సేకరించిన సీడ్ బ్యాంకులో అంతరించిపోతున్న అనేక రకాల ధాన్యం గింజలున్నాయి. ఆ గింజలను మొలక కట్టి, నారు పోసి ఆ మొక్కలు, పంటల దిగుబడి మీద పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మనుమడి ఆవేదన కమలా పూజారికి చాలా కాలం కిందటే భర్త పోయాడు, ఇద్దరు కొడుకులు, కోడళ్లు, మనుమలతో జీవిస్తోంది. ఆమెకు ఒక్కో పురస్కారం రావడం, మీడియా ప్రతినిధులు వచ్చి కామెంట్ తీసుకోవడం ఆ ఇంటికి పరిపాటి అయిపోయింది. ప్లానింగ్ బోర్డు మెంబరు అయినప్పుడు ‘ఈ పదవి కంటే ఆమెకు గట్టి ఇల్లు ఇవ్వవచ్చు కదా’ అని వాపోయాడు 12వ తరగతి చదువుతున్న ఆమె మనుమడు సుదామ్ పూజారి. పోయినేడాది వరకు కూడా నాలుగు మట్టి గోడలు, తాటాకు పైకప్పు ఆమె ఇల్లు. ‘‘మా నానమ్మను పెద్ద పెద్ద బిల్డింగులను ప్రారంభించడానికి పిలుస్తారు. ఆమెకు చిన్న ఇల్లు కూడా ఇవ్వాలనుకోవడం లేదు ప్రభుత్వం. ఆమె ఇందిరా ఆవాస యోజన కింద పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు అధికారులకు అప్లికేషన్లు ఇచ్చింది. అయినా ఇల్లు శాంక్షన్ కాలేదు. ఎండాకాలంలో నేల మీద నీళ్లు చల్లుకుని పడుకుంటోంది’’ అని గత ఏడాది మీడియా ముందు ఆవేదన చెందాడతడు. ప్రభుత్వం ఆమెకు కిటికీ కూడా లేని గూడునైనా ఇచ్చింది మనుమడి మాట మీడియాలో వచ్చిన తరవాతనే. -
ఆదివాసీ మహిళపై లైంగిక దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ సమీపంలోని దేవగుంపునకు చెందిన ఆదివాసీ వివాహితపై లైంగికదాడి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. దేవగుంపునకు చెందిన ఓ వివాహిత అడవిలో కట్టెలు తెచ్చుకునేందుకు బుధవారం మధ్యాహ్నం ఒంటరిగా వెళ్లింది. ఆమెను కృష్ణసాగర్‌కు చెందిన ఓ వ్యక్తి వెంబడించాడు. జనసంచారం లేని ప్రాంతంలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ప్రతిఘటించిన మహిళను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపుతానని బెదిరించాడు. నిస్సహాయురాలైన ఆమె రెండు గంటలపాటు అడవిలోనే రోదించింది. సాయంత్రం ఏడుస్తూ ఇంటికి చేరింది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి చెప్పులు అక్కడ వదిలేసి పారిపోవటంతో ఆమె వాటిని ఇంటికి తీసుకొచ్చింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలసి కృష్ణసాగర్ గ్రామానికి వచ్చి స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. స్థానికులు అంబులెన్స్ సహాయంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమారు ఇరవై ఐదేళ్ల వయసున్న బాధితురాలికి ఇద్దరు చిన్నపిల్లలు, భర్త ఉన్నారు. కాగా, దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
రేప్ చేయబోయాడు.. కోసిపారేసింది!
తనపై, తన కూతురిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఓ యువకుడిపై ఆదివాసి మహిళ గొడ్డలితో తిరగబడింది. అతడి పురుషాంగాన్ని కోసేసి.. గొడ్డలితో నరికి చంపింది. గుట్టుచప్పుడు కాకుండా అతడి మృతదేహాన్ని తన స్నేహితురాళ్ల సహాయంతో స్థానిక శ్మశానంలో పూడ్చిపెట్టింది. ఈశాన్య అసోంలోని భారాజులి గ్రామంలో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నేరానికి పాల్పడిన రితా ఓరంగ్, ఆమె భర్తను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చనిపోయిన యువకుడిని కృష్ణ భూంజీగా గుర్తించారు. కృష్ణ భూంజీ కనిపించకపోవడంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. 'కృష్ణ అదృశ్యమైన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతుండగా అతడు చనిపోయినట్టు మా దృష్టికి వచ్చింది. మంగళవారం రాత్రి అతడి మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం పంపించాం' అని బిశ్వానాథ్ చారియాలి జిల్లా ఎస్పీ అంజుర్ జైన్ తెలిపారు. కృష్ణ నేరగాడని, రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 4న కృష్ణ తనపై, తన కూతురిపై అత్యాచారం చేయబోయాడని, దీంతో ఆత్మరక్షణ కోసం అతడిని గొడ్డలితో ప్రతిఘటించానని ఆమె పోలీసులకు తెలిపింది. 'వెనుక నుంచి నరికిన తర్వాత అతడి ప్రైవేటు అంగాలను నరికేశాను. అతడు ఒకవేళ బతికితే తమపై ప్రతీకారం తీర్చుకుంటాడేమోనన్న భయంతో ఇలా చేశాను' అని ఆమె వివరించింది. అయితే ఈ గొడ్డలి దెబ్బలకు అతడు వెంటనే చనిపోయాడు. దీంతో తన మిత్రులైన ఏడుగురు స్థానిక మహిళల సహాయం తీసుకొని అతడి మృతదేహాన్ని స్థానిక శ్మశానంలో పూడ్చిపెట్టింది. ఈ కేసులో అవసరమైతే ఆమె మిత్రుల పాత్రపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు చెప్తున్నారు. -
సమాచారమిచ్చినా రాని 108
- కడుపులోనే శిశువు మృతి - తల్లి క్షేమం - ఆస్పత్రిలో సేవలపై ఆరోపణలు పెదబయలు: ఫోన్‌చేసి రెండు గంటలయినా 108 అంబులెన్స్ రాకపోవడంతో ఆదివాసీ మహిళ మృతశిశువుకు జన్మనిచ్చింది. పెదబయలు పీహెచ్సీ పరిధి సీకరి గ్రామానికి చెందిన సీకరి తౌడమ్మకు మంగళవారం ఉదయం నుంచి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఉదయం 8.15గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి అంబులెన్స్‌ను పంపుతున్నట్టు కాల్‌సెంటర్ నుంచి సమాధానమొచ్చింది. 9 గంటలకు మళ్లీ ఫోన్ చేశారు. ఎంతకి రాకపోవడంతో 10 గంటలకు ఆటోలో పెదబయలు పీహెచ్‌సీకి తౌడమ్మను తరలించారు. అప్పటికి అందుబాటులో ఉన్న ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ పరిశీలించారు. తౌడమ్మ మృతశిశువుకు జన్మనిచ్చింది. స్టాఫ్‌నర్స్ లేదని, 108 వాహనం సకాలంలో వస్తే మెరుగైన వైద్యం అంది శిశువు బతికి ఉండేదని భర్త మత్యలింగం వాపోయారు. కాన్పు తేదీకి వారం రోజుల ముందుగానే పీహెచ్‌సీకి ఆమెను తరలించకపోవడం ఇక్కడ శోచనీయం. శిశువు కడుపులోనే చనిపోయింది: కడుపులోనే శిశువు చనిపోయిందని, ఇలా తక్కువ మందిలో మాత్రమే చనిపోయిన శిశువు ప్రసవం అవుతుందని, తల్లిని మాత్రం కాపాడగలిగామని ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.