గుజరాత్‌లో మళ్లీ కమల వికాసం? | Sakshi Guest Column On Gujarat Assembly Election 2022 | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో మళ్లీ కమల వికాసం?

Published Fri, Dec 2 2022 2:29 AM | Last Updated on Fri, Dec 2 2022 2:29 AM

Sakshi Guest Column On Gujarat Assembly Election 2022

రెండు విడతలుగా జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ముగిసింది. భారతీయ జనతా పార్టీ 27 ఏళ్లుగా ఓటమి అన్నది లేకుండా ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది. అయితే మోర్బీ వంతెన దుర్ఘటన ఆ పార్టీని దెబ్బకొట్టింది. అయినా కాంగ్రెస్‌ దీన్నుంచి లాభపడే సూచనలు లేవు. త్రిముఖ పోటీకి కారణమైన ఆమ్‌ ఆద్మీ పార్టీకి పడే ఓట్లు కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్ల నుంచే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో బీజేపీకి జరిగే నష్టం పూడుతుందని అంచనా. పైగా గుజరాత్‌ అస్తిత్వాన్ని బీజేపీ లేవనెత్తుతోంది. వీటన్నింటినీ కలిపి చూస్తే ఈసారి కూడా గుజరాత్‌లో బీజేపీకి ఢోకా లేదనే చెప్పాలి. రెండో స్థానంలో ఏ పార్టీ నిలుస్తుందన్నది మాత్రం అప్పుడే చెప్పలేం.

గుజరాత్‌ ఎన్నికలంటే సహజంగానే సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఒకప్పటి ముఖ్య మంత్రిగా నరేంద్ర మోదీ అభివృద్ధి మోడల్‌కు కేంద్రబిందువు కావడం దీనికి ఒక కారణం. అయితే మోర్బీలో ఇటీవలే ఓ తీగల వంతెన కూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బే వేసింది.

కాషాయ పార్టీ విజయపరంపరకు అడ్డుకట్ట వేయగలిగిన స్థాయి ప్రమాదం ఇది. అయినప్పటికీ మోర్బీ ఘటన సహాయక చర్యల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కనిపించకుండా పోవడం, పార్టీ అధినాయకత్వం రాహుల్‌గాంధీ తాలూకూ ‘భారత్‌ జోడో యాత్ర’పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం... ఆ పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో ఎన్నికలు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే జరుగు తున్నాయి. ప్రధాన పార్టీలు వీడి కొందరు కొత్త పార్టీలను ఏర్పాటు చేసినప్పటికీ వారు తమ సత్తాను నిరూపించుకోలేక మళ్లీ మాతృ పార్టీల్లో విలీనమైపోయారు. అయితే ఈసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృ త్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మాత్రం కొంత భిన్నంగా కనిపి స్తోంది.

2021 నాటి గుజరాత్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తమదైన ముద్ర వేసిన ఆప్‌ ఇప్పుడు అసెంబ్లీకి పోటీ పడుతోంది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యమవుతోంది. అందుకే ఈసారి ఎన్నికలకు మరింత  ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్‌ 2017లో సాధించిన ఓట్లు, ఆప్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతులను కూడా పరిగణన లోకి తీసుకుని ఈ ఎన్నికలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 


2017 అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ...
2017లో గుజరాత్‌ అసెంబ్లీకి బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరి పోరే జరిగింది. పాటీదార్ల రిజర్వేషన్లపై భారతీయ జనతా పార్టీ తీవ్ర వ్యతి రేకతను ఎదుర్కోవడం, చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ అంతగా రుచిం చకపోవడం కూడా బీజేపీకి ఏమాత్రం అనుకూలించని పరిణామ మైంది. దాంతో మెజారిటీకి కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ సాధించి బీజేపీ గట్టెక్కింది.

2012 నాటి ఎన్నికలతో పోలిస్తే 16 సీట్లు తక్కువ కావడం గమనార్హం. అయినప్పటికీ ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఒక శాతం పెరిగాయి. బీజేపీ గెలిచిన సీట్లలో దాదాపు ముప్పై వేల మెజారిటీ సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ గెలిచిన సీట్లలో మార్జిన్‌ 13 వేలు మాత్రమే. 

అయితే బీజేపీకి లాభించిన అంశం ఒకటుంది. అన్ని స్థాయులు, వర్గాలు, ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ కంటే ఎక్కువ సీట్లు సాధించ గలి గింది. నగర ప్రాంతాల్లోని మొత్తం 56 స్థానాల్లో బీజేపీకి 58 శాతం ఓట్లతో 46 స్థానాలు దక్కాయి. మొత్తం 182 స్థానాల్లో కాంగ్రెస్‌ 2012 నాటి ఎన్నికల కంటే 12 సీట్లు అదనంగా 77 స్థానాలు సాధించగలిగింది. భౌగోళిక ప్రాంతాల ఆధారంగా విశ్లేషిస్తే బీజేపీ ఉత్తర, దక్షిణ గుజరాత్, కచ్‌ ప్రాంతాల్లో ఒక్కో స్థానాన్ని కోల్పోగా... మధ్య గుజ రాత్‌లో రెండుస్థానాలు కోల్పోయింది.

కానీ తనకు బాగా పట్టున్న సౌరాష్ట్రలో ఏకంగా 11 స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. సౌరాష్ట్ర లోనే కాంగ్రెస్‌ గత ఎన్నికల కంటే 13 స్థానాలు ఎక్కువ సాధించడం గమనార్హం. అలాగే పాటీదార్ల ఓట్లు 20 శాతం కంటే ఎక్కువున్న నియోజకవర్గాలు యాభై రెండింటిలో కాంగ్రెస్‌ 23 స్థానాలు గెలుచు కుంది. తద్వారా గిరిజన వర్గాలకు ప్రధాన పార్టీగా మారింది. గిరిజను లకు కేటాయించిన 27 స్థానాల్లో 17 కాంగ్రెస్‌ పార్టీనే దక్కించుకోవడం ఇందుకు నిదర్శనం. 

బీజేపీ విషయానికి వస్తే... 2017 ఎన్నికల్లో ఈ పార్టీ కాంగ్రెస్‌ కంటే ఎనిమిది శాతం ఎక్కువ ఓట్లు సాధించడం ద్వారా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న 26 పార్లమెంట్‌ స్థానాలన్నింటినీ గెలుచుకోవడం ఇంకో విశేషం. ఈసారి కూడా ఇదే రకంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించ వచ్చు. కాకపోతే నాలుగు నుంచి ఆరు శాతం ఓట్లు కోల్పోయే అవ కాశం మాత్రం సుస్పష్టం. పాతికేళ్లకుపైగా అధికారంలో ఉండటం, రాజకీయ స్తబ్ధత తదితరాలు ఇందుకు కారణాలవుతాయి.

అయితే ఓట్ల శాతం తగ్గినా సీట్లు మాత్రం పెద్దగా నష్టపోయే అవకాశం లేదు. ఆప్‌ సాధించే ఓట్ల కారణంగా బీజేపీకి జరిగిన నష్టం పూడుతుందని అంచనా. ఎన్నికల ముందు నాటి అంచనాల ప్రకారం ఆప్‌ పార్టీకి సుమారు పది శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. ఈ పార్టీకి పడే ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి పడాల్సిన ఓట్ల నుంచే ఎక్కువగా ఉంటాయని అంచనా. అంతిమంగా ఇది బీజేపీకి లాభిస్తుంది.

బీజేపీని ఇబ్బంది పెట్టే అంశాలు...
గుజరాత్‌లో పార్టీల మధ్య పోటీ ఈసారి వినూత్నంగా ఉంది. ఎన్నికల ప్రచార వ్యూహాలు, ఓటర్లను భారీ ఎత్తున తరలించడాల్లోనూ మార్పు స్పష్టం. ఆప్‌ రాక ఓటర్లకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పార్టీలకు పడే ఓట్ల తీరులో మార్పులకు ఇది కారణమవుతోంది. ఫలి తంగా ఓట్లు సీట్లుగా మార్చుకోవడమెలా అన్న లెక్కలు సంక్లిష్టమవు తాయి.

మెగా ర్యాలీలు, మోదీ తదితర అగ్రనేతల రోడ్‌ షోలతో బీజేపీ సంప్రదాయ శైలిలో ప్రచారం చేస్తూంటే... స్థానిక నేతలు ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆర్థిక వనరుల లేమి కారణంగా కాంగ్రెస్, ఆప్‌ ఎక్కడికక్కడ చిన్న స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు అడుగుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా ఆర్భాటమైన ప్రచారానికి బదులుగా నిశ్శబ్దంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 

బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, ఆప్‌ లేవనెత్తిన అంశాల్లో మోర్బీ తీగల వంతెన ప్రమాదం ఒకటి. దీంతోపాటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్‌ కావడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామ కాలు వాయిదా పడుతూండటం, బిల్కిస్‌ బానో కేసులో దోషుల శిక్ష తగ్గింపు వంటివి ఉన్నాయి. రైతుల సమస్యలు, భూసేకరణ అంశాలు, విద్యుత్తు ధరల మోత, విద్య, ఆరోగ్య సౌకర్యాల లేమి, అధ్వాన్నమైన రోడ్లు వంటివి కూడా ప్రతి పక్షాల అస్త్రాలుగా మారాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ అమలును ఆప్‌ తన ఎన్నికల వాగ్దా నాల్లో చేర్చింది. విద్యుత్తు బిల్లుల్లో రాయితీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను మెరుగు పరచడం వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ప్రభావం ఓటర్లపై ఎంత ఉంటుందన్నది చూడాల్సిన అంశం. ‘ఈ గుజరాత్‌ను మేము సాధించాం’ అన్న స్లోగన్‌తో నరేంద్ర మోదీ ప్రచారం చేస్తూం డటం, గుజరాత్‌ అస్తిత్వాన్ని ప్రస్తావించడం బీజేపీకి అనుకూలంగా మారనున్నాయి.

గత 30 ఏళ్లలో కాషాయ పార్టీ గుజరాత్‌లో చేపట్టిన కార్యక్రమాలను మోదీ ఏకరవు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విస్తరించిన తీరును, తద్వారా పౌరులకు జరుగుతున్న లాభాలను ప్రస్తావిస్తున్నారు. నర్మద రిజర్వాయర్‌ ప్రాజెక్టును ఆలస్యం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందన్న ఆరోపణనూ ఆయన గుర్తు చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రతిపక్షాల పాలనలో ఉగ్రవాద దాడులు పెరగడం వంటివీ ప్రస్తావిస్తున్నారు. 

మొత్తమ్మీద చూస్తే... గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల కంటే బీజేపీ ఎన్నో మైళ్ల ముందంజలో ఉందని చెప్పాలి. మోదీ కరిష్మా, ఆయన సొంత రాష్ట్రం కావడం, దేశ రాజకీయ నేతల్లో అత్యంత ప్రభావశీలి కావడం బీజేపీకి సానుకూలంగా మారను న్నాయి. రాజకీయ కప్పదాట్ల పుణ్యమా అని కాంగ్రెస్‌ పార్టీపై ఓటర్లకు నమ్మకం పోయింది.

గత ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన స్టార్‌ ప్రచారకర్త రాహుల్‌గాంధీ ఈసారి పరిమిత స్థాయి ప్రచారం మాత్రమే నిర్వహించడం స్థానిక కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తిని మిగిల్చింది. త్రిముఖ పోటీతో బీజేపీయేతర పార్టీల ఓట్లు నిలువుగా చీలను న్నాయి. కేజ్రీవాల్‌ వ్యూహాత్మక ప్రచారం కాంగ్రెస్‌ ఓట్లకు గండికొట్ట నుంది. వీటన్నింటినీ కలిపి చూస్తే ఈసారి కూడా గుజరాత్‌లో భార తీయ జనతా పార్టీకి ఢోకా లేదనే చెప్పాలి. రెండో స్థానంలో ఏ పార్టీ నిలుస్తుందన్న అంశాన్ని మాత్రం ప్రస్తుతానికి లెక్క వేయలేము.

​​​​​​​ప్రవీణ్‌ రాయ్‌ 
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, ఢిల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement