గాంధీనగర్: గుజరాత్ శాసనసభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారంతో దూసుకెళ్లిన రాజకీయ పార్టీలు.. తొలిదశ ప్రచారానికి ముగింపు చెప్పాయి. మొదటి విడతలో భాగంగా 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. మరో 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా.. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
27 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న తమ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే, 2017లో ఒక్కసీటు కూడా సాధించని ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ గెలుపు ఉత్సాహంతో గుజరాత్‌లోనూ పాగా వేయాలని భావిస్తోంది. 90 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి పి భారతి.. ఓటింగ్‌పై పలు వివరాలను వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ‘డిసెంబర్ 1న ఓటింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 50 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ ఉంటుంది. తొలి దశలో 2,39,76,760 మంది ఓటర్లు తమ ఓట హక్కును వినియోగించుకోనున్నారు. ’ అని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు చెప్పారు.
బీజేపీ తరఫున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు భావ్‌నగర్, కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. తొలిదశలో ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ బరిలో ఉన్నారు. ద్వారకా జిల్లాలోని ఖాంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కున్వార్‌జీ బవాలియా, మోర్బీ హీరో కాంతీలాల్ అమృతీయ, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా వంటి ముఖ్య వ్యక్తులు తొలిదశ పోటీలో ఉన్నారు.
ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
Comments
Please login to add a commentAdd a comment