ఓటింగ్‌పై ఎటూ తేల్చని బీఏసీ
సమావేశానికి సీఎం, చంద్రబాబు డుమ్మా
ఓటింగ్, తీర్మానం కోసం వైఎస్సార్ సీపీ పట్టు
ఓటింగ్‌పైనా రెండు కళ్ల సిద్ధాంతాన్ని విన్పించిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు
బీఏసీ ఆమోదం తెలిపాకే ఓటింగ్, తీర్మానం నిర్ణయాలు తీసుకోవాలన్న టీఆర్ఎస్.. సానుకూలంగా స్పందించిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉంటుందా? లేదా? అనే అంశంపై గురువారం సాయంత్రం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలోనూ స్పష్టత రాలేదు. ఓటింగ్‌పై స్పష్టతనివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా పలువురు నేతలు కోరినా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూటిగా ఏ విషయం తేల్చలేదు. గతంలో శాసనసభలో అనుసరించిన సంప్రదాయాలు, నిబంధనలను ఇప్పుడూ అనుసరిస్తానని, ఈ విషయంపై ఇటీవల తాను పంపిన నోట్‌ను చదువుకోవాలని సూచించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు రాష్ట్రపతి మరో వారం గడువు ఇచ్చిన నేపథ్యంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశంపైన చర్చ జరిగింది. 26వ తేదీ గణతంత్ర దినోత్సవం (ఆదివారం) మినహా మిగిలిన ఆరు రోజుల్లోనూ సభను కొనసాగించాలని బీఏసీలో తీర్మానించారు. వీలైనంత మేరకు సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని, అవసరమైతే వర్కింగ్ లంచ్‌ను ఏర్పాటు చేసి సాయంత్రం వరకు సభను కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశానికి కూడా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు హాజరు కాలేదు.
ఆ సమయంలో ఇరువురు నేతలు అసెంబ్లీ లాబీల్లోని తమ కార్యాలయాల్లో ఉన్నారు. అయితే, సమావేశానికి ఇరు ప్రాంతాల నాయకులను పంపి, ఎవరికి అనుకూలమైన వాదనలు వారు వినిపించాలని దిశానిర్దేశం చేయడం గమనార్హం. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి అధికార పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, అనిల్‌కుమార్, ద్రోణంరాజు శ్రీనివాస్, ఆరెపల్లి మోహన్ హాజరయ్యారు. విపక్షాల తరపున అశోక్‌గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొత్తకోట దయాకర్‌రావు(టీడీపీ), వైఎస్.విజయమ్మ, శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్ కాంగ్రెస్), ఈటెల రాజేందర్, హరీష్‌రావు(టీఆర్ఎస్), అక్బరుద్దీన్(ఎంఐఎం), గుండా మల్లేష్(సీపీఐ), లక్ష్మీనారాయణ(బీజేపీ), జూలకంటి(సీపీఎం), జయప్రకాష్ నారాయణ్(లోక్‌సత్తా) పాల్గొన్నారు.
ప్రతి సభ్యుడికీ మాట్లాడే అవకాశం
ముందుగా స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ.. బిల్లుపై ఇప్పటివరకు సభలో 43 గంటలు చర్చ జరిగిందని, 65 మంది సభ్యులు మాట్లాడారని వివరించారు. మరో ఆరు రోజులు ఉన్నందున అందరికీ మాట్లాడే అవకాశమివ్వాలని అన్ని పార్టీల సభ్యులు కోరారు. ఏ సభ్యుడు ఎంతసేపు మాట్లాడతారో పార్టీలవారీగా ఇవ్వాలని స్పీకర్ కోరారు. ప్రతి సభ్యుడికీ 3 నుంచి 5 నిమిషాల సమయమిస్తానని, ఆ తరువాత సమయాన్నిబట్టి ఎక్కువ సేపు మాట్లాడే వారికి ప్రాధాన్యతనిస్తానని వివరించారు.
బిల్లుపై ఓటింగ్ ఉంటుందో లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు విజయమ్మ, శోభానాగిరెడ్డి పట్టుపట్టారు. సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 77, 78 నిబంధన కింద గతంలోనే నోటీస్ ఇచ్చామని, దానికి అనుగుణంగానే సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలని కోరారు. మిగతా పార్టీలు ద్వంద్వ వాదనలు వినిపించాయి. ఓటింగ్ జరపాలని సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కోరగా, అవసరంలేదని తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు చెప్పారు. బిల్లుపై ఓటింగ్, తీర్మానం వంటి అంశాలను చేపట్టేముందు తప్పనిసరిగా బీఏసీ ఆమోదం తీసుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు కోరగా, స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన వారం గడువు సరిపోదని, మరింత సమయం కోరుతూ ఈసారి అసెంబ్లీయే తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. దీనిని ఆ పార్టీ తెలంగాణ సభ్యుడు ఎర్రబెల్లితోపాటు టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు తోసిపుచ్చారు. ఏ ప్రాంత నేతల అభిప్రాయాన్ని టీడీపీ అభిప్రాయంగా తీసుకుంటున్నారని హరీష్‌రావు అడిగారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. టీడీపీ అధినేత హాజరుకాకపోవడం వల్ల బీఏసీ సభ్యుడైన అశోక్‌గజపతిరాజు అభిప్రాయాన్నే ఆ పార్టీ అభిప్రాయంగా భావిస్తున్నానన్నారు. దీనికి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘అశోక్ మా నాయకుడు కాదు. బిల్లుపై ఓటింగ్ జరపాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
బీఏసీ సమావేశానికి సీఎం హాజరుకాకపోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రస్తావించారు. దీంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుంటూ ‘మీకు ఒక ప్రాంతంలో పార్టీనే లేదు’ అని అనడంతో శోభానాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ప్రాంతంలో నష్టపోతామని తెలిసీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము గట్టిగా పోరాడుతున్నామని, మీరు మాత్రం రాష్ట్రం సంగతి వదిలేసి పార్టీ బాగుండాలనే కోరుకుంటున్నారంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతిని అదనపు గడువు కోరుతూ ఎవరు లేఖ రాశారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ స్పీకర్‌ని ప్రశ్నించారు. సీఎం లేఖ రాశారని స్పీకర్ చెప్పారు. తననే లేఖ రాయమని సీఎం కోరినప్పటికీ, సభా నిబంధనల మేరకు రాయనని చెప్పడంతో ఆయనే రాశారని తెలిపారు.
చాంబర్‌కే పరిమితమైన బాబు..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో కీలకమైన చర్చ జరుగుతున్న క్రమం.. ఈ సమయంలో స్పీకర్ నిర్వహించిన బీఏసీ సమావేశాలు వేటికీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు. విభజన బిల్లుపై చర్చకు రాష్ట్రపతి గడువును మరో వారం రోజులు పెంచగా.. ఆ అంశంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ గురువారం బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనికి చంద్రబాబు హాజరుకాలేదు. బీఏసీ సమావేశం నిర్వహించిన హాలుకు నాలుగడుగుల దూరంలో ఉన్న తన చాంబర్లోనే నేతలతో గడిపారు. శాసనసభ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు చేయడానికి డిసెంబర్ 11న స్పీకర్ బీఏసీ నిర్వహించారు. ఆ తర్వాత విభజన బిల్లు, దానిపై తలెత్తిన వివిధ సందేహాలపై స్పీకర్ డిసెంబర్ 17న, ఆ తర్వాత జనవరి 6న మరోసారి బీఏసీ సమావేశాలు నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా వీటిలో దేనికీ చంద్రబాబు హాజరుకాలేదు.