న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఏకంగా 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచెయ్యి చూపడం గమనార్హం. వీరిలో ఐదుగురు మంత్రులు సైతం ఉన్నారు. తీగల వంతెన దుర్ఘటన జరిగిన మోర్బీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేశ్ మెర్జాకు టికెట్ నిరాకరించారు. మరో నలుగురు మంత్రులు.. రాజేంద్ర త్రివేది, ప్రదీప్ పర్మార్, అరవింద్ రైయానీ, ఆర్.సి.మక్వానాకు తొలి జాబితాలో స్థానం దక్కలేదు. శాసనసభ స్పీకర్ నీమాబెన్ ఆచార్యకు కూడా నిరాశే ఎదురయ్యింది.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన సొంత నియోజకవర్గం ఘాట్లోడియా నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారు. పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తొలి జాబితాలో స్థానం దక్కించుకున్నారు. విరామ్‌గామ్ స్థానం నుంచి హార్దిక్ పటేల్, జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి రివాబా జడేజా అధికార పార్టీ టికెట్లపై వారు పోటీ చేయబోతున్నారు. 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. వారి అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తొలి జాబితాలో 69 మంది సిట్టింగ్‌లు
గుజరాత్‌లో తొలి దశలో డిసెంబర్ 1న 89 స్థానాలకు, రెండో దశలో 5న 93 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. తొలి దశ ఎన్నికలకుగాను 84 స్థానాల్లో, రెండో దశ ఎన్నికలకు గాను 76 స్థానాల్లో తమ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం ఖరారు చేసింది. 160 మందిలో ఓబీసీలు 49 మంది, పటేళ్లు 40 మంది, క్షత్రియులు 19, బ్రాహ్మణులు 13 మంది ఉన్నారు. జైన వర్గానికి చెందిన మరో ఇద్దరు చోటు సంపాదించారు. తొలి జాబితాలోని మొత్తం అభ్యర్థుల్లో 35 మంది 50 ఏళ్లలోపువారే కావడం విశేషం.
తొలి జాబితాలో 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి పోటీచేసే అవకాశం కల్పిస్తున్నామని, వీరిలో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారని భూపేంద్ర యాదవ్ తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌తోపాటు మరికొందరు సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో పోటీపడొద్దని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని పార్టీకి లిఖితపూర్వకంగా తెలియజేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించబోతున్నామని, గత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ 1995 నుంచి మధ్యలో రెండేళ్లు మినహా అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment