గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తొలిసారిగా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతూ ఉండడంతో ప్రతీ అంశమూ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అధికార బీజేపీ ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం దగ్గర్నుంచి ఇటీవల జరిగిన మోర్బీ కేబుల్ వంతెన దుర్ఘటన వరకు ఎన్నో అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించనున్నాయి. అవేంటో చూద్దాం..
అధికార వ్యతిరేకత
రాష్ట్రంలో 1998 నుంచి అంటే 24 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వంపై వివిధ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, తడిసిమోపెడైన జీవన వ్యయం, నాసిరకమైన రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం వంటివన్నీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లపై పడనున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి.
మోదీ ఇమేజ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ ఈ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం కానుంది. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మా తగ్గలేదు. 2001 నుంచి 2014 వరకు ఆయన రాష్ట్రాన్ని నడిపించిన తీరు, అంతర్జాతీయంగా మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు గుజరాత్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గుజరాత్ మనం తయారు చేసుకున్నదే అంటూ మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ మోడల్‌నే అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతూ ఉండడం గమనార్హం.
బిల్కిస్ బానో దోషుల విడుదల
గుజరాత్ మత ఘర్షణల సమయంలో జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను శిక్షా కాలం కంటే ముందుగానే విడిచిపెట్టడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ముస్లిం వర్గంపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. 6.5 కోట్లున్న గుజరాత్ జనాభాలో ముస్లింలు 11% ఉన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో వీరు ప్రభావం చూపించగలరు. బిల్కిస్ బానోకి న్యాయం జరగాలని వీరు చేస్తున్న ఆందోళనలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న చర్చ జరుగుతోంది.
కరెంట్ కష్టాలు
దేశంలో కరెంట్ చార్జీలు అత్యంత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నెల తిరిగేసరికల్లా వచ్చే బిల్లుని చూసి సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. ఇక కమర్షియల్ విద్యుత్ టారిఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంట్ చార్జీలు ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కి రూ.4 ఉంటే గుజరాత్‌లో ఏకంగా రూ.7.50గా ఉండడంతో వాణిజ్యవేత్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఆప్, కాంగ్రెస్ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలు ఇచ్చారు.
రైతు సమస్యలు
గుజరాత్ రాష్ట్రాన్ని గత రెండేళ్లుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పంట నీటిపాలై రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. అయినప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఇక అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం భారీగా భూముల్ని సేకరించింది. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వడోదర, ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం చేసిన భూ సేకరణ వివాదాస్పదమైంది.
పేపర్ లీక్స్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష పేపర్ల లీకేజీ యువతలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. తరచుగా పేపర్స్ లీక్ కావడం పరీక్షలు వాయిదా పడడం నిరుద్యోగుల ఆశల్ని
అడియాసలు చేస్తోంది. గత ఏడేళ్ల కాలంలో ఎనిమిది సార్లు వివిధ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకయ్యాయి.
మోర్బీ వంతెన దుర్ఘటన
సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ 30న కుప్పకూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాంట్రాక్టులు, స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి బదులుగా ప్రమాద సమయంలో నదిలోకి దూకి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే కాంతి అమృతియకు టికెట్ ఇవ్వడం చూస్తేనే దీని ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Gujarat Assembly Election 2022: మోదీ నుంచి మోర్బీ వరకు...
Published Sat, Nov 19 2022 4:45 AM | Last Updated on Sat, Nov 19 2022 9:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment