India Tour Of Bangladesh 2022: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. జడేజా మోకాలి గాయం పూర్తిగా నయం కాలేదన్న కారణంగా బీసీసీఐ అతన్ని త్వరలో జరుగనున్న బంగ్లాదేశ్ టూర్ (వన్డే సిరీస్) నుంచి అర్ధంతరంగా తప్పించింది. ఇదే అంశం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. జడేజా తొలుత ఫిట్‌గా ఉన్నాడని వన్డే, టెస్ట్ సిరీస్‌లకు ఎంపిక చేసిన సెలెక్టర్లు.. తీరా పర్యటనకు సమయం దగ్గర పడిన సమయంలో గాయం తీవ్రత తగ్గలేదని వన్డే జట్టును నుంచి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
వివరాల్లోకి వెళితే.. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన డిసెంబర్ 4న మొదలవుతుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా అదే రోజు తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 7, 10 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్, 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, సరిగ్గా టీమిండియా.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడాల్సిన సమయంలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో అక్కడ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా పోటీ చేస్తుంది. బీజేపీ నుంచి ఆమె నార్త్ జామ్‌నగర్ నుంచి బరిలో దిగనుంది.
కాగా, భార్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నందునే జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌కు డుమ్మా కొట్టాడని కొందరు నెట్టింట ఆధారాల్లేని దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. బీసీసీఐ కార్యదర్శి జై షా బీజేపీ నంబర్ టూ అమిత్ షా తనయుడే కాబట్టి.. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు జడేజాకు దగ్గరుండి మరీ పర్మిషన్ ఇప్పించి ఉంటాడని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
దేశం కోసం ఆడే అవకాశం ఉన్నా జడేజా ఇలా చేయడం ఘోర తప్పిదమని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి జడేజా మోకాలి గాయం తీవ్రత తగ్గలేదని ఎన్‌సీఏ మెడికల్ టీమే సర్టిఫికెట్ ఇచ్చింది. పూర్తిగా కోలుకోకుండా బరిలోకి దిగితే గాయం తీవ్ర మరింత పెరగవచ్చని బీసీసీఐకి నివేదిక అందించింది. ఇది తెలుసుకోని కొందరు ఆకతాయిలు జడేజాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment