తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్‌ శకం.. | Dr. B.R.Ambedkar Era In Telugu Literature | Sakshi
Sakshi News home page

తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్‌ శకం..

Published Fri, Jan 19 2024 11:54 AM | Last Updated on Fri, Jan 19 2024 12:19 PM

Dr.B.R.Ambedkar Era In Telugu Literature - Sakshi

అంబేడ్కర్ కోట్లాది భారతీయ దళితుల దాస్య విమోచకుడు మాత్రమే కాదు; భారతీయ దళిత సాహిత్యానికి ఆద్యుడు, ఆఢ్యడు కూడా. అంబేడ్కర్ తన గురుత్రయంగా ప్రకటించుకున్న గౌతమబుద్ధుడు, సంత్ కబీర్, మహాత్మాజ్యోతిబా పూలేల తాత్త్విక ఆలోచనా విధానమే అటు అంబేడ్కరిజానికీ, ఇటు భారతీయ దళిత సాహిత్యానికీ సిద్ధాంత భూమిక అయింది.

తెలుగు దళిత సాహిత్యానికి అంబేడ్కర్ ఆంధ్రదేశ్‌ పర్యటన ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ గొప్ప ప్రేరణ ఇచ్చింది. నందనార్ హరిశ్చంద్రుడి పట్టువదలని పూనికతో అంబేడ్కర్ 1942 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో అడుగుపెట్టారు. అప్పటికి దళిత నాయకులుగా ఉన్న ఈలివాడపల్లి, పాము రామ్మూర్తి, కుసుమ ధర్మన్న, బొజ్జా అప్పలస్వామి వంటి వారు ఆ పర్యటనలో పాల్గొన్నారు.

అంబేడ్కర్ మరణించిన దశాబ్దాలకు గానీ ఆయన జీవితం, రచనలు చదివే అవకాశం తెలుగు దళితులకు దక్కలేదు. 1968లో మొదటిసారి యెండ్లూరి చిన్నయ్య రాసిన డా.అంబేడ్కర్ జీవిత చరిత్ర గ్రంథ రూపంలో వచ్చింది. ఆ కాలంలోనే అంబేడ్కర్ రచించిన ‘ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథానికి యెండ్లూరి చిన్నయ్య, బోయి భీమన్నల అనువాదాలు వచ్చాయి. ఆ తర్వాత అంబేడ్కర్ జీవితచరిత్రను గ్రంథస్థం చేసినవారిలో బి. విజయభారతి, అమూల్యశ్రీ, బోయ జంగయ్య, పి.అబ్బాయి, ఉదయకీర్తి, బొనిగెల రామారావు, బూతం స్వామి వంటి వారున్నారు.

తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘కలడంబేడ్కరుండు నా సహోదరుడు’ పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు తీసుకోమంటారు, పద్యకావ్యాలు, శతకాలు, గేయాలు, వచన కవితలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు ఒకటేమిటి అన్ని ప్రక్రియల్లోనూ అంబేడ్కర్ ఆవిష్కరించబడ్డారు. బోయి భీమన్న ‘నమస్సుల్, డాక్టరంబేడ్కరా?’ మకుటంతో సుప్రభాతం, రాపాక ఏకాంబరం ‘అంబేడ్కరో! సమరసింహా!’, చోడగిరి చంద్రరావు ‘భీమరాయ శతకం’ వెలువరించారు. దళిత ఉపాధ్యాయ కవులు మల్లవరపు జాను, జల్లి రాజగోపాలరావు, మల్లవరపు వెంకటరావు, బుంగా ఆడమ​్‌బాబు, రాచమల్లు దేవయ్య, తోటకూర జార్జి, పలివెల సుదర్శనరావు, గుర్రం ధర్మోజి, నక్కాఅమ్మయ్య, మద్దా సత్యనారాయణ వంటి వారు అంబేడ్కర్‌కు పద్యనీరాజనాలు పలికారు.

భీమన్న ‘జయ జయ జయ అంబేడ్కర! జయ దళిత జనస్వర!’ గేయం దళితుల జాతీయగీతంగా ప్రసిద్ధికెక్కింది. నీల్ సలామ్ కావ్యంలో ‘వ్రాయుటబ్బిన నీ పేరె వ్రాయవలయు’ అన్నారు కందిపాటి గోపాలరావు. మాష్టార్జీ గేయం ‘అందుకో దండాలు బాబా అంబేడ్కరా! / అంబరాన ఉన్నట్టి సుక్కలు పాడవంగో’ ఆల్‌టైమ్‌ రికార్డు. గోరటి వెంకన్న ‘వైతాళికా! ఈ యుగము నీదిరా! బొద్ధాళికా! ఈ జగము నీదిరా!’ అని ఆలాపిస్తే, జయరాజు ‘జాగోరే జాగో అంబేడ్కర్/ జగజ్జన నేత అంబేడ్కర్’ అని తమ బతుకు ఆశగా వర్ణిస్తారు. పావన ప్రసాద్ ‘దేశానికి రక్షణ కవచం / అంబేడ్కర్ తత్త్వం కాదా’ అని ప్రశ్నిస్తే, బోయి భీమన్న ‘పాటలలో అంబేడ్కరు’ పేరుతో ప్రత్యేకంగా ఒక గ్రంథాన్నే ప్రచురించారు.

దళిత సామాజిక సాహిత్యోద్యమాలలో భాగంగా ఎందరో కవులు వేలాది గేయాలను ఆలపించారు. సవేరా, శ్రమశ్రీ, భీమసేన, రాంచందర్, శుక్తి, భీమసేన, లెల్లె సురేశ్, ఉదయ భాస్కర్, నాగబత్తుల గోపాలకృష్ణ వంటి కవులు పదుల సంఖ్యలో అంబేడ్కర్‌కు గేయ హారతిపట్టారు. నగేష్ బాబు, ఖాజా సంపాదకత్వంలో వెలువడిన ‘విడి ఆకాశం’ కవితా సంకలనానికి ‘అంబేడ్కరిస్టు ప్రేమ కవిత్వం’ అని ఉపశీర్షిక పెట్టారు, ‘అతడు జాతిబువ్వ, అతడు వెలుగుతోవ్వ, అతడు పాలబువ్వ, అతడు నిప్పురవ్వ' అని అంబేడ్కర్ ఏమిటో తెలియజేస్తాడు ఎండ్లూరి సుధాకర్. శిఖామణి అంబేడ్కర్ విగ్రహాన్ని ‘శతాబ్దాలుగా ఘనీభవించిన దళితాగ్రహం’గా భావిస్తాడు. అంటే డ్కర్‌ను దళితుల అన్నంగిన్నెతో పోలుస్తారు నేతల ప్రతాప్ కుమార్. ‘నీ పురుటి నొప్పులతో రాజ్యాంగాన్ని కాదు / తరాల స్వప్నాల్ని ప్రసవించావు / నువ్వు మాకు తండ్రివా! తల్లివా’ అని అంబేడ్కర్‌లో అమ్మతనాన్ని దర్శిస్తారు కలేకూరి ప్రసాద్. చల్లపల్లి స్వరూప రాణి ‘ఇప్పుడు మనువు / అగ్రహారం వీడి / అంబేడ్కర్ కాలనీకొచ్చాడు / బాబా! నాకు పాలను నీళ్ళను వేరు చేసే జ్ఞానాన్నివ్వ’మని వేడుకొంటారు. సతీష్ చందర్, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్, బన్న అయిలయ్య, జి.వి.రత్నాకర్, పైడి తెరేష్‌బాబు, విరియాల లక్ష్మీపతి, కొలకలూరి ఇనాక్... అంబేడ్కర్‌ను కవిత్వంలో ఆవిష్కరించారు.

అంబేడ్కర్ భావజాలంపై అనేక గ్రంథాలు వెలువడ్డాయి. కత్తి పద్మారావు అంబేడ్కర్ జీవిత చరిత్ర పేరుతో బహత్ గ్రంథాన్ని వెలువరించారు. కె.జి. సత్య మూర్తి ‘అంబేడ్కర్ సూర్యుడు’ రాశారు. అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్టు మూడు దశాబ్దాలకు పైగా అంబేడ్కర్ వర్ధంతి అయిన డిసెంబరు 6న స్మారకోపన్యాసాలు ఏర్పాటుచేసి, వాటిని గ్రంథరూపంలో తెస్తోంది. హైద రాబాద్ బుక్ ట్రస్టు వంటి సంస్థలు అంబేడ్కర్ భావజాలాన్ని అనువాదాల రూపంలో తెలుగులో అందించడం అభినందనీయం. అంబేడ్కర్ జీవిత చరిత్రను తెలుగులో చలనచిత్రంగా రూపొందించిన డాక్టర్ పద్మావతి దళితులకు గొప్ప ఉపకారం చేశారు. ఆ సినిమాకు సి. నారాయణరెడ్డి అంబేడ్కర్ జీవితాన్ని ప్రతిఫలించే భావస్పోరకమైన గీతాల్ని అందించారు. సౌదా అరుణల ‘జాతిపిత అంబేడ్కర్’, పాటిబండ్ల ఆనందరావు ‘రాజగృహ ప్రవేశం’ నాటకాలు రంగస్థలం మీద అటు ప్రయోగానికీ, ఇటు ప్రయోజనానికీ పెద్దపీట వేశాయి. జయభేరి, ప్రజాబంధు, రిపబ్లికన్ జ్యోతి, గబ్బిలం, ఏకలవ్య, నీలిజెండా, బహుజన కెరటాలు, దళిత కిరణాలు, సమాంతర వంటి దళిత పత్రికలు అవి బతికినంతకాలం అంబేడ్కర్ భావజాలాన్ని ప్రచారం చేశాయి. ఈ వ్యాసకర్త 15 సంవత్సరాల క్రితమే ‘అంబేడ్కర్ శకం’ పేరుతో సేకరించి సంకలించిన దాదాపు 500 పుటల అంబేడ్కర్ పద్య, గేయ, వచన కవితా సంపుటి అముద్రితంగా ఉండి పోయింది. ఒక్కో ప్రక్రియలో ఇలాంటి ఒక్కో బృహత్తర సంపుటి రావలసిన అవసరం ఉంది.


విశ్లేషణ: డాక్టర్ శిఖామణి
తేది: 14/4/2023

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement