
ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అతి దీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందింది. దీని రచనను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రభుత్వ సంస్థల విధులను గుర్తించేలా నిర్దేశించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులనూ నిర్దేశించింది.
రాజ్యాంగమే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేది. అదే ప్రభుత్వం, పౌరుల మధ్య... నమ్మకం, సమన్వయాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం భారత పౌరుని ప్రాథమిక విధుల్లో ఒకటి. అప్పుడే సార్వభౌమ గణతంత్ర సభ్యునిగా, భారతదేశంలోని ప్రతి పౌరుడూ ప్రతిరోజూ వినియోగించుకోవలసిన రాజ్యాంగ హక్కులను పొందుతాడు. ప్రతి పౌరుడి అభివృద్ధి అతని హక్కులు, విధులపై అతనికి ఉన్న అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది.
ఏ దేశ రాజ్యాంగం అయినా దేశ ప్రగతి కోసం మంచి పాలన, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం జరిగిన ఈ 72 సంవత్సరాల పాలనా కాలంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాం. తయారీ రంగంలో 30వ ర్యాంకులో ఉన్నాం. ఇక వివిధ ఆహార ధాన్యాల, తృణధాన్యాల ఉత్పత్తిలో మనం మొదటి 5 స్థానాన్ని ఆక్రమించాం.
కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం 20 శాతం పేదరికంలోనే ఉన్నాం. 12 శాతం నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. విపరీతమైన ఆదాయ అసమానతలూ ఉన్నాయి. వివిధ ప్రపంచ సూచికలలో మనం ఆందోళనకరమైన స్థానాల్లో ఉన్నాం. ఉదాహరణకు ఉగ్రవాద సూచికలో 8వ స్థానం, అవినీతిలో 28వ ర్యాంక్, హ్యాపీ ఇండెక్స్‌లో 44 ర్యాంక్‌లో ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం – రెండింటి కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు చాలానే ఉన్నా ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే విధానాలు ఉత్తమమైనవే కానీ వాటి అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అధిగమించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు వంటి ఇటీవలి విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన సృష్టించాయి. అయితే ఈ సమస్యలన్నీ తగిన రాజ్యాంగ సవరణలతో పరిష్కరించబడతాయి. సానుకూల ఫలితాలను, సమాజ అభ్యున్నతికి హామీ ఇచ్చే విధానాలను సులభంగా స్థాపించగలిగే విధంగా మన చట్టాలను సవరించడం కొనసాగించాలి.
రాజ్యాంగాన్ని సముచితంగా అమలు చేయడానికి రాజకీయ రంగంలో, కార్యనిర్వాహక యంత్రాంగంలో నైతిక విలువలు ఉండాలి. ప్రజలు అవసరమైన చోట ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రతి పౌరుడూ ఇతరుల హక్కులను గౌరవించాలి. చట్టబద్ధంగా, నైతికంగా తన విధులను నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సారాన్ని ఆస్వాదించగలరు. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్)
– డాక్టర్ పి.ఎస్. చారి, మేనేజ్‌మెంట్ స్టడీస్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment