నియంతృత్వ రాజకీయాలు అభివృద్ధికి గొడ్డలిపెట్టు | BJP OBC Morcha Leader Laxman Write on Family Politics in Telangana | Sakshi
Sakshi News home page

నియంతృత్వ రాజకీయాలు అభివృద్ధికి గొడ్డలిపెట్టు

Published Mon, Dec 5 2022 11:01 AM | Last Updated on Mon, Dec 5 2022 11:04 AM

BJP OBC Morcha Leader Laxman Write on Family Politics in Telangana - Sakshi

రాజకీయాలను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాల్సిన కొన్ని పార్టీలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి ‘ఆగర్భ శతృత్వం’తో పని చేస్తున్నాయి. అందులో ఎక్కువగా కుటుంబ పార్టీలు ఉండడం విశేషం. నిస్వార్థ రాజకీయాలు దేశంలోకి వస్తే తమ పీఠాలు కదిలిపోతాయన్న ఆందోళనతో ‘వ్యక్తిత్వ హననం’ చేస్తూ కుటిల రాజకీయా లకు తెరతీశాయి. ఇప్పుడు ఆ వరుసలోకి కేసీఆర్‌ సారథ్యం లోని టీఆర్‌ఎస్‌ అగ్రస్థానం తీసుకున్నది. గత నెల నుండి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండే వర్గాలకు కేసీఆర్‌ నియంతృత్వ, ధన రాజకీయాలు తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయి.

రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేసిన గవర్నర్‌ను ఒక మహిళ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమాన పరుస్తున్న కేసీఆర్‌ అండ్‌ కో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. రోజూ ప్రజాస్వామ్య పాఠాలు వల్లించే కమ్యూని స్టులకు కొత్తగా కేసీఆర్‌ స్నేహం దొరికింది. సీఎంను మెప్పించడం కొరకు ‘కోతికి కొబ్బరిచిప్ప’ దొరికినట్లుగా గవర్నర్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. అతి చిన్న వయసులో మంత్రిపదవి కూడా లెక్కపెట్టకుండా ‘న్యాయం కోసం’ రాజీనామా చేసిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌... అక్కడి కమ్యూనిస్టుల దురాగతాలు ఒక్కొక్కటి బయటపెడుతూంటే ఆ అక్కసును కమ్యూనిస్టులు ఇక్కడ వెళ్ళగక్కడం విచిత్రం. 

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు చదువుకొనే విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామక బిల్లు లోని లొసుగులతో ప్రభుత్వ పెద్దలు తప్పు చేసేందుకు అవ కాశం ఉంది. దానికి తగిన సవరణలు చేయాలని గవర్నర్‌ సూచిస్తే తమ వందిమాగధులలో దుష్ప్రచారం చేయిస్తూ కేసీఆర్‌ వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే అణ గారిన వర్గాలకు చెందిన యువత చదువులపై సమ్మెట దెబ్బలా ఎక్కడా లేనివిధంగా తన అస్మదీయులకు, తస్మదీ యులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టింది. ఎనిమిదేళ్ళలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసింది. కాబట్టి గవర్నర్‌ పేరు చెప్పి నియామకాలు జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన కామన్‌ రిక్రూట్‌ బోర్డు 1953లో పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రిజ ర్వేషన్ల విషయంలో విధిగా పాలించాల్సిన రోస్టర్‌ పాయింట్లు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బోర్డు ఏ రోస్టర్‌ విధానాన్ని పాటించి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది అనేది ప్రశ్న.

ఓవైపు పోడు భూములకు సంబంధించిన పట్టాలు గిరిజనులకు ఇస్తాం అంటూనే, మరోవైపు వాళ్ళపై నిఘా పెట్టండని అటవీ అధి కారులను ఉసిగొల్పి ఓ నిజాయితీ గల ఆఫీసర్‌ హత్యకు కేసీఆర్‌ ప్రభుత్వం కారణమైంది. ప్రభుత్వ భూములను అమ్ముతూ, అలా వచ్చిన ఆదా యాన్ని తమ సొంత నియోజకవర్గాలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు తరలించుకు పోతున్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, విద్య, వైద్య వ్యవస్థలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లు తయారయ్యాయి. గవర్నర్‌ దగ్గర ఎన్నో బిల్లులు ఆగా యని ఓ వైపు చెబుతున్నారు. ముఖ్యమంత్రి తప్పని సరిగా వెళ్ళాల్సిన చోటు రాజ్‌భవన్‌. కానీ ఆయన ప్రతి దానినీ రాజకీయ కోణంలో చూస్తూ గవర్నర్‌ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు.

గ్లోబరీనా టెండర్లను తనవారికి ఇప్పించి ఆ సంస్థ తప్పిదాలతో ఎందరో ఇంటర్‌ విద్యార్థులు మరణించినా కేసీఆర్‌ కనికరించలేదు. వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు కలి గించలేదు. అలాగే ధరణి పోర్టల్‌ అనే భూమాయను సృష్టించి రైతులు ఆత్మహత్యలు చేసుకొనేందుకు కారణం అవుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు ఎమ్మా ర్వోలపై పెట్రోల్‌ దాడులు చేయడం ఈ రాష్ట్రంలోనే చూశాం.  చివరికి ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు నిర్వహించే ఆరోగ్య శాఖ వైఫల్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు విక టించి మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ఎవరి పాపమో కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలి. 

గరీబులను వంచించే సరికొత్త ‘గడీ’గా కేసీఆర్‌ ప్రగతి భవన్‌ను నిర్మించుకొని కుట్రలకు, కుహకాలకు కేంద్రంగా దానిని తయారు చేశారు. బూర నర్సయ్యగౌడ్‌ లాంటి సీనియర్‌ నాయకుడు భాజపాలోకి రాగానే బెంబేలెత్తిన కేసీఆర్‌ మునుగోడులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సరిక్రొత్త కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ప్రగతి భవన్‌లో కూర్చొని ‘ఫాంహౌస్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా’కు స్క్రిప్ట్‌ రచించారు. అనామకులు ఎవరో ఏదో మాట్లాడుకున్న వీడి యోలకు లేని స్క్రిప్ట్‌ తయారుచేసి జనం మీదకు వదిలారు. నిఖార్సుగా, నిజాయితీగా రాజకీయం చేసే భాజపాపై బురద చల్లేందుకు సరిక్రొత్త ‘కపట నాటకం’ కేసీఆర్‌కు పనికివచ్చింది. తన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు తెలం గాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదిగిన భాజపాను బూచిగా చూపిస్తూ... సొంతపార్టీ వారిపైనే బ్లాక్‌ మెయి లింగ్‌కు పాల్పడుతున్నారు.

ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా భాజపాపై ఎదురుదాడికి దిగాలని ప్రగతి భవన్‌ మీటింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయడం తెలంగాణలో జరుగుతున్న దాడుల రాజకీయానికి నాందిగా కనిపిస్తుంది. టీఆర్‌ఎస్‌ వాళ్లు ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడికి దిగారు. ఇది రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ఇలాంటి అరాచకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే కిందిస్థాయి కార్యకర్తల మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ఆలోచించవచ్చు. రాష్ట్రంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలైన శర్మిళను మహిళ అని కూడా చూడకుండా కారుతో సహా అరెస్ట్‌ చేసిన పోలీసుల అత్యుత్సాహం చూస్తే కేసీఆర్‌ హయాంలో ఇక్కడి స్వేచ్ఛకున్న హద్దులు బహిర్గత మవుతున్నాయి. కేసీఆర్‌ నియంతృత్వ ధోరణిని ఈ సంఘ టన బహిర్గతం చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను మించిపోయారు. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు కరెంట్‌ మీటర్లు కేంద్రం పెట్టబోతోందనీ, అలాగే కేంద్రం రాష్ట్రానికి ‘నయా పైసా’ ఇవ్వలేదనీ రోజూ దుష్ప్రచారం చేశారు.

రాజకీయాలు ఎలా ఉన్నా దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎంలు వెళ్ళి ఆహ్వానిస్తారు. ఇప్పటికి మూడుసార్లకు పైగా ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్‌ ఆయనను ఆహ్వా నించకుండా ముఖం చాటేశారు. మునుగోడు ఎన్నికలలో దశాబ్దాలుగా కాంట్రాక్టులు చేస్తున్న రాజగోపాల్‌ రెడ్డిపై 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ అంటూ దుష్ట ప్రచారానికి తెరలేపారు. మరి మిషన్‌ భగీరథ, కాకతీయ, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టింది ఎవరు? అందులో కమిషన్‌ ఎంత ముట్టిందని మాత్రం వీళ్ళను ప్రశ్నించడం ‘సమాఖ్య వ్యవస్థ’పై దాడి అవుతుంది కాబోలు! రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థను ‘గాడిపసరం’లా కట్టేసి ఇలా ఏ ముఖ్యమంత్రీ వాడలేదు. కానీ రోజూ ‘ఈడీ, సీబీఐ దాడులు’ అని గింజు కుంటారు!  

ఈ రాష్ట్రంలో ‘జన్మకో శివరాత్రి’లా జరిగే ముఖ్యమంత్రి పర్యటన నాడు ప్రతిపక్షాల నాయకులను, కార్యకర్తలను ‘హౌస్‌ అరెస్టు’లు చేస్తున్నారు. ఏ సభ, పాదయాత్ర జరుపు కోవాలన్నా హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన దుఃస్థితి నెలకొన్న కేసీఆర్‌ పాలన కేసీఆర్‌ చేరదీసిన మేధా (తా)వులకు స్వర్గంలా ఉందట. ధర్నా చౌక్‌ కూడా లేకుండా చేసి, సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌ను గొప్ప ప్రజా స్వామ్య వాదిగా వీరు కీర్తిస్తున్నారు. అయితే వేయి శవాలను తిన్న రాబందు కూడా ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదు. కాలం ప్రతి దానికీ సమాధానం చెబుతుంది. చరిత్రలో కూలి పోయిన ఎందరో నియంతలు ఇందుకు ఉదాహరణ. (క్లిక్ చేయండి: ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?)


- డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ 
రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement