
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సీఎం కేసీఆర్, అసద్‌లు మూడు గంటల పాటు జరిపిన చర్చ దేనికి సంకేతమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు ఓటు వేశారు. కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టులంతా వ్యతిరేకిస్తున్నారు. ఆ కోవలోకే టీఆర్‌ఎస్ వచ్చిందని’ తెలిపారు. దేశంలో అలజడులు, అల్లర్లు సృష్టించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎందుకు భయపడుతున్నారు..
పూర్వికుల వివరాలు చెప్పాలంటే అసద్ ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎందుకు అభ్యంతరమో కేసీఆర్ కూడా సమాధానం చెప్పాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వివరాలు తీసుకున్నారని.. అవి ఎందుకు బహిర్గతం చేయలేదో చెప్పాలన్నారు. తమ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియలో స్వలాభం కోసమే సమగ్ర సర్వే చేశారని విమర్శించారు. అసద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల కోసం కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ గురించి ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment