సర్వ మతాలకు సమ ప్రాధాన్యం | Mosques Temple Church In New Secretariat: KCR | Sakshi
Sakshi News home page

సర్వ మతాలకు సమ ప్రాధాన్యం

Published Sun, Sep 6 2020 1:12 AM | Last Updated on Sun, Sep 6 2020 8:09 AM

Mosques Temple Church In New Secretariat: KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా నిర్మించే సచివాలయంలో మందిరం, మసీదులు, చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థన మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కొత్త సచివాలయంలో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ఎంఐ ఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌  ఒవైసీ నేతృత్వంలో వివిధ ముస్లిం సంస్థల ప్రతినిధులతో కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి  పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. కేసీఆర్‌ మాట్లా డుతూ.. పాత సచివాలయం భవనాలు కూల్చివేస్తున్న సందర్భంలో అక్కడున్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందని.. వాటిని ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామ న్నారు. ఒక్కొక్కటి 750 చదరపు గజాల విస్తీర్ణంలో ఇమామ్‌ క్వార్టర్‌తో సహా రెండు మసీదులు (మొత్తం 1,500 చ.గ.) ప్రభు త్వం నిర్మిస్తుందని చెప్పారు. పాత సచివాల యంలో ఉన్న స్థలంలోనే వీటి నిర్మాణం జరుగుతుందని, నిర్మాణం పూర్తయ్యాక వక్ఫ్‌ బోర్డుకు అప్పగిస్తామన్నారు. అలాగే, 1,500 చ.గ. విస్తీర్ణంలో మందిర నిర్మాణాన్ని ప్రభు త్వం చేపడుతుందని, నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు అప్పగిస్తుందని వెల్లడిం చారు. కొత్త సచివాలయంలో తమకూ ప్రార్థన మందిరం కావాలన్న క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వమే నిర్మిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మతాలకు సమ ఆదరణ...
రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరి స్తుందని.. అందుకే కొత్త సచివాలయంలో అన్ని మతాల ప్రార్థన మందిరాలు నిర్మిస్తా మని కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నింటికీ ఒకేరోజు శంకుస్థాపన చేస్తామన్నారు. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్‌–ఉల్‌–గుర్భా నిర్మాణం 80 శాతం పూర్తయిందని, మిగతా నిర్మాణం కోసం అవసరమైన మరో రూ.18 కోట్లు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్‌ సెంటర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. స్థలం కేటాయించినా కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. వెంటనే ఈ సెంటర్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

నగరం చుట్టూ ఖబ్రస్థాన్‌లు..
 హైదరాబాద్‌ చుట్టూ ఖబ్రస్థాన్‌ లు రావాల్సిన అవసరం ఉందని, స్థలాల గుర్తింపు జరుగుతోందని ముఖ్యంంత్రి అన్నారు. నగరంలోని వివిధ చోట్ల 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే నారాయణపేటలో రోడ్ల వెడల్పుతో పీరీల చావడి అయిన అసుర్‌ ఖానాకు నష్టం వాటిల్లిందని అన్నారు. దీనికి స్థలం కేటాయించి, నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించామని చెప్పారు. రాష్ట్రంలో ఉర్ధూను రెండవ అధికార భాషగా గుర్తిస్తున్నామని, దీని పరిరక్షణ, అభివృద్ధికి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అధికార భాష సంఘంలో ఉర్ధూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తామని సీఎం కేసీఆర్‌ వివరించారు.  ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  ఓవైసీ, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ మెంబర్‌ మౌలానా ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌ సాహెబ్, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ సెక్రటరీ మౌలానా ఖలీద్‌ సైఫుల్లా రహ్మానీ, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ మెంబర్, మజ్లిస్‌ ఉలేమా ఇ డెక్కన్‌  ప్రెసిడెంట్‌ మౌలానా సయ్యద్‌ కుబూల్‌ బాద్‌ షా షట్టారి, మౌతమీమ్‌ దారుల్‌ ఉలూమ్‌ రహ్మానియా, ప్రెసిడెంట్‌ జామియత్‌ ఉలేమా ఇ హింద్‌ మౌలానా ముఫ్తీ ఘ్యాసుద్దీన్‌  రహ్మానీ, అమీర్‌ ఈ జామియా నిజాయా మౌలానా సయ్యద్‌ అక్బర్‌ నిజాముద్దీన్‌  హుస్సేనీ, అమీర్‌ ఇ జమాత్‌ ఈ ఇస్లామియా మౌలానా హమీద్‌ మొహమ్మీద్‌ ఖాన్‌  సాహబ్, తామీర్‌ ఇ మిల్లత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మౌలానా జియాఉద్దీన్‌  నాయ్యర్, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ మెంబర్, హైదరాబాద్‌ నాజిమ్‌ దారుల్‌ ఉలూమ్‌ మౌలానా రహీముద్దీన్‌  అన్సారీ తదితరులు పాల్గొన్నారు.


శనివారం ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌. చిత్రంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు 

సీఎం హామీ ఇచ్చారు
మసీదుల పునర్నిర్మాణంపై ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు వెల్లడి 
సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా నిర్మించే సచివాలయంలో రెండు మసీదులతో పాటు చర్చి నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌ దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఐఎంఐ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలసి వారు మాట్లాడారు. వచ్చే నెలలో గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని సీఎం వెల్లడించారన్నారు. మసీదులను ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, ఆ తర్వాత వక్ఫ్‌ బోర్డుకు అప్పగిస్తామని చెప్పారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ నగరంలో తలపెట్టిన ఇస్లామిక్‌ సెంటర్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. హైదరాబాద్‌ నగరం చుట్టూ వివిధ చోట్ల ముస్లిం శ్మశాన వాటికల కోసం 150 నుంచి 200 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకరించారని వారు వెల్లడించారు. రోడ్ల వెడల్పులో ప్రార్థనా మందిరాలకు నష్టం వాటిల్లకుండా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారన్నారు. అలాగే క్రిస్టియన్ల కోరిక మేరకు సచివాలయంలో ప్రార్థనా మందిరం కూడా నిర్మిస్తామని చెప్పారన్నారు.  

మీరు సమాధానాలివ్వరు.. కానీ వారిని రాయమంటారు.. 
వచ్చే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తి వేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ధ్వజమెత్తారు. ‘పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేస్తారు.. కానీ జేఈఈ, నీట్‌ పరీక్షల్లో మాత్రం విద్యార్థులను సమాధానాలు రాయమంటారు. ఇదే మోదీ పాలన’అని విమర్శించారు. క్వొశ్చన్‌ అవర్‌ ఎత్తి వేయడంతో దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌పై తాము ప్రశ్నలు అడగగలమా.. తూర్పు లడఖ్‌లో ఏమీ జరుగుతుందో చర్చించగలమా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా ప్రశ్నోత్తరాల సమయం ఉండాలన్నారు. పలు దేశాల ప్రధానులు కరోనా వైరస్‌ ప్రభావం, సమస్యలపై విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారని, అయితే మోదీ మాత్రం వీడియో సందేశాలు ఇస్తున్నారని విమర్శించారు.    
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement