
బీజేపీ అగ్రశ్రేణి మంత్రులైన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌తో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా తాము సనాతన ధర్మాన్ని పరి రక్షిస్తున్నామని ప్రకటించారు. సనాతన ధర్మం బ్రాహ్మణిజా నికి చెందిన పురాతన తత్వశాస్త్రం. దాని మూలాలు ఋగ్వేదంలో ఉన్నాయి. ఇది ఇతర సంస్కృత గ్రంథాల ద్వారా ఉద్భవించింది. మనుధర్మాన్ని రచించిన బ్రాహ్మణ రచయితలు దాని రచనా సమయానికి.. అభ్యాసం, ఆధ్యాత్మిక సిద్ధాంతాలనే సనాతన ధర్మంగా సంశ్లేషించారు.
ఇది ఉత్పాదక శ్రమకు, ఉత్పత్తిలో పాల్గొనే సామాజిక ప్రజారాశు (శూద్ర, ‘ఛండాల’, వనవాసు)లకు వ్యతి రేకంగా నిలిచింది. ఆ తత్వాన్ని బీజేపీ అగ్రశ్రేణి మంత్రులు, నేతలు ఇప్పుడు తమ సొంతం చేసు కున్నారు. ఇటీవలే ఈ అంశంపై విలేఖరుల సమావేశంలో ప్రసంగించిన బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్, ‘సనాతన ధర్మం ప్రతి ఒక్కరికీ శాశ్వ తమైన చట్టం’ అని నిర్వచించారు. ఆయన అభి ప్రాయం ప్రకారం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ ఈ సనాతన ధర్మాన్ని ఎలా అంగీకరించగలరు? చివరగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ‘దీనికి సరైన సమాధానం కావాలి’ అని చెప్పారు. ఇప్పుడు అసలు రహస్యం బయటపడింది. సనాతన ధర్మం పక్షాన వీరంతా నిలిచారు. సనాతన ధర్మంలోనే ఉత్పత్తి కాలుష్యం అనే సిద్ధాంతానికి మూలాలు ఉన్నాయి. తాజాగా, 45 ఏళ్ల యువకుడైన ఉదయనిధి స్టాలిన్‌పై కేంద్రప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్లు కనిపించింది. నిజానికి ఇది శూద్ర దళితులకు, ఆది వాసీలందరికీ వ్యతిరేకంగా సాగిన సంప్రదాయ యుద్ధ పద్ధతి మాత్రమే.
కొత్తగా పునరుద్ధరించిన ఈ పురాతన సనాతన భావజాలం... ఉదయనిధి స్టాలిన్‌పై, ‘ఇండియా’ కూటమిపై దాడి చేయడానికి బీజేపీకి ఒక ఆయుధ మయ్యింది. కరుణానిధి మనవడూ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడూ అయిన ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అకస్మాత్తుగా అఖిల భారత ద్రవిడ సైద్ధాంతిక హీరో అయిపోయాడు. ఈ క్రమంలో ఉదయనిధి తలకి ఒక ఆలయ పూజారి వెల కట్టారు. దీనిపై బీజేపీ మౌనంగా ఉంది.
2023 సెప్టెంబరు 2న ‘సనాతన నిర్మూలన’ అనే అంశంపై ‘తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ చెన్నైలో ఏర్పాటు చేసిన సదస్సులో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ‘కొన్ని విష యాలను కేవలం వ్యతిరేకించలేము, వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. మనం డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనా వైరస్‌ని వ్యతిరేకించి ఊరు కోలేం. వాటిని మనం నిర్మూలించాలి. సనాతనాన్ని వ్యతిరేకించే బదులు దానిని నిర్మూలించాల్సి ఉంది.’ సనాతన ధర్మాన్ని కుల అసమానతతో కూడిన, సామా జిక వ్యతిరేక భావజాలంగా ఉదయనిధి నిర్వచించారు. బీజేపీ మంత్రులు సనాతన ధర్మాన్ని ఒక శాశ్వత చట్టంగా నిర్వచిస్తున్నారు.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ హయాంలో గానీ, ఇప్పుడు బీజేపీ హయాంలో గానీ సనాతన ధర్మం అనే భావన భారత దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీలకు వ్యతిరేకమనే అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మంలో అంటరానితనం, శ్రమ వ్యతిరేకత, స్త్రీల అసమానత వంటి వాటికి లోతైన మూలాలు ఉన్నాయి. వేద గ్రంథాల తరువాత, మనుధర్మం సనాతన ధర్మ భావ జాలాన్ని సంశ్లేషించింది. డా‘‘ అంబేడ్కర్, పెరియార్ రామసామి నాయకర్ ఆ మొత్తం ప్రక్రియపై లోతైన విశ్లేషణ చేశారు. దాంట్లో భాగంగానే పెరియార్ మను ధర్మంపై దాడి చేశారు. సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేశారు.
వ్యవసాయ చట్టాల ద్వారా శూద్ర వ్యవ సాయ దారుల చేతులు కట్టేయాలని బీజేపీ భావించింది, కాని వారు పోరాడారు. ఇప్పుడు బీజేపీ శక్తులు సనాతన ధర్మ వ్యతిరేకమైన, శక్తిమంతమైన ద్రావిడ స్థావరంపై దాడి చేయాలనుకుంటున్నాయి. అందుకే సనాతన ధర్మంపై ఓ యువకుడి విమర్శను ఢిల్లీలో ద్విజ శక్తులు నరహంతకంగా వక్రీకరించి, దానిపై తీవ్రంగా దాడి చేశాయి. కేంద్రప్రభుత్వం మొత్తం దీనిపై దృష్టి సారించింది.
అధికార బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఉద్దేశపూర్వకంగానే ఉదయనిధి ప్రసంగాన్ని, 80 శాతం మంది ప్రజలపై మారణహోమంగా వక్రీకరించారనేది సుస్పష్టం. శూద్ర, దళిత, ఆదివాసీలు కూడా వీరిలో భాగమనే అర్థంలో ఆయన వక్రీకరించారు. ధర్మం అనే భావనను న్యాయం అనే అర్థంలో మలుచుకుంటున్నారు. ఇది ప్రాచీన గ్రీకు లేదా యూరోపియన్ కోణంలో చెప్పిన న్యాయానికి సమానం కాదు.
అంటే వేదాలు పేర్కొన్న ఈ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు రూపొందించిన కుల నియమాలను శూద్రులు తప్పక పాటించి బానిసలుగా, వ్యవసాయ పనివాళ్లుగా బతకాలి. ద్విజులు కలుషితమైనదిగా భావించే వ్యవసాయం చేయకూడదు. శూద్ర, దళిత, ఆదివాసీలను వదిలేయండి... సనాతన ధర్మంలో అన్ని కులాల మహిళలకు స్థానం లేదు. పైగా వారు సనాతన ధర్మం విధించిన అనాగరిక దోపిడీ, మూఢనమ్మకాల బంధితులు. జాతీయ పాలకులు బహిరంగంగా ఇలాంటి భావజాలాన్ని కలిగి ఉండి, ఆదిమ భావ జాలంపై విమర్శ చేసేవారిపై దాడి చేస్తే దేశం అంధ కారంలోకి జారిపోతుంది.
బీజేపీ/ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న శూద్ర, ఓబీసీ, దళిత ఆదివాసీలు ఈ కొత్త పరిణామాన్ని చాలా నిశితంగా పరిశీలించవలసి ఉంటుంది. సనాతన ధర్మాన్ని అంగీకరించడం ద్వారా వ్యవస్థపై ఎలాంటి సైద్ధాంతిక నియంత్రణ లేకుండానే అధికార స్థానాలను కొద్దిమంది అనుభవించవచ్చుగాక. కానీ ఉత్పాదక అత్యధిక ఉత్పా దక శక్తులతోపాటూ దేశం మొత్తం చీకటి యుగాల్లోకి నెట్టివేయబడుతుంది.
కంచ ఐలయ్య షెపర్డ్
(వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త)