అభిప్రాయం
‘ఒకే దేశం – ఒకే సంస్కృతి – ఒకే పన్ను’ అంటూ నిరంతరం ప్రచారం చేసే అధికార బీజేపీ ఇప్పుడు ‘జమిలి ఎన్నికల’కు సన్నద్ధమవు తోంది. కేంద్ర మంత్రి వర్గం ఇటీవల జమిలి ఎన్నికలకు ఆమోదాన్ని తెలిపింది. దేశంలో సవివరమైన చర్చ జరగకుండానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలను పూర్తిగా సమర్థించేవారే కమిటీలో ఉన్నప్పుడు అది నిపుణుల కమిటీ ఎలా అవుతుంది? జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యంకాదనీ, ఇది అధికార కేంద్రీ కరణకు మార్గాన్ని సుగమం చేయడమేననీ, మన దేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మౌలిక సూత్రా లపైన దాడి చేయడమేననీ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
దేశంలో తరచూ ఏదో ఒక ఎన్నిక జరుగు తున్నందు వల్ల అభివృద్ధికి ఆటంకమేర్పడుతుందనేది ఒక అభిప్రాయం. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందనీ, దీనికి మన జీడీపీ గణాంకాలే రుజువనీ ప్రభుత్వ పెద్దలు చెబు తున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజంగా సరైనవనుకుంటే అభివృద్ధికి తరుచూ జరిగే ఎన్నికలు ఎలా ఆటంకమవుతాయి? దేశం ముందున్న మౌలిక సవాళ్ళ నుండి జనం దృష్టిని ప్రక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారనేది ఒక విమర్శ.
జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనేది సమర్థకుల మరో వాదన. ఈ వాదనను సరిగ్గా విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2023–24 సంవత్సరానికి ఎన్నికల కోసం కేంద్రం కేటాయించింది కేవలం రూ. 466 కోట్లు మాత్రమే. పైగా అది ఎన్నికల సంవత్సరం కాబట్టి. అదే 2022–23 సంవత్సరానికి కేటాయించినది రూ. 320 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు కూడా ఎన్నికల ఖర్చును భరిస్తాయి. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న కేంద్రానికి ఈ ఎన్నికల ఖర్చు నిజంగా పట్టించుకోవలసినది కాదు. నిజానికి జమిలి ఎన్నికలు జరిపితేనే ఖర్చు పెరుగుతుంది. ఈ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో ఈవీఎమ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని, రక్షణసిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి.
ఎన్నికలు తరచూ జరగడం వల్ల ఇప్పటి వరకూ విధానపర నిర్ణయాలు చేయడంలో ఏనాడూ ఆటంకమేర్పడలేదు. ప్రజల ప్రయోజనాలకు, వారి స్వేచ్ఛకు జమిలి ఎన్నికలు విఘాతమే. ప్రభుత్వాల దూకుడుకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కళ్ళెం వేసేది ప్రజలు మాత్రమే.
జమిలి ఎన్నికల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధి వెంటనే మరణిస్తే ఏం చేస్తారు? అధికార పార్టీ మధ్యలో మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయమేమిటి? అటువంటి ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యయుతం అవుతుందా?
చదవండి: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?
అందుకే జమిలి ఎన్నికలకు బదులు, ఎన్నికల సంస్కరణలను తక్షణమే చేపట్టి దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలి. పార్టీల మ్యానిఫెస్టోలను, వారి విధానాలను సమగ్రంగా విశ్లేషించుకుని రాజకీయ పార్టీలకు ప్రజలు ఓటు వేయడం న్యాయసమ్మతమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రస్తుత పద్ధతిలో రాజకీయ పార్టీలకు లభించిన ఓట్ల శాతం, ఆయా పార్టీలు గెలిచిన సీట్లకు ఉన్న తేడా అసంబద్ధంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రక్రియను అమలు చేసే ఆలోచనను విరమించి ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పరిరక్షణకు అవసరమైన అన్ని మార్పులను మన రాజకీయ వ్యవస్థ చేపట్టాలి. అధికార బీజేపీ దీనికి ముందుగా చొరవ చూపాలి.
- వి.వి.కె. సురేష్
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment