ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్‌కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.
వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్‌లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్‌లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.
చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీ
ఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.
– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment