ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు అనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో రేవంత్ పాత్ర అంతా ఇంతా కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక దూకుడుగా ఉంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్లు, జూనియర్లనే భేదం లేకుండా అందరినీ కలుపుకు పోయారు. కేసీఆర్‌ను గద్దెదించుతానని శపథం చేసి నిజంగానే ఆయన్నిఇంటికి పంపారు. 2023, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ పదవీ ప్రమాణం స్వీకారం చేసి ప్రజా పాలనను ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) వంగూర్ మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ అయ్యారు. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.
మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ జన తర్వాత... అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా అత్యుత్తమ పని తీరును కనబరిచారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో 2021లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.
అన్నీతానై 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. వారి అవినీతిని బయట పెట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద వైద్య చికిత్సకు పది లక్షల వరకు సాయం పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. గత 11 నెలల్లో తెలంగాణలో మహిళలు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ ఉపయోగించు కున్నారు. దీని వల్ల మహిళలకు 3,433 కోట్ల రూపా యలు ఆదా అయ్యాయి.
రుణమాఫీని బీఆర్‌ఎస్ పదేళ్లలో సక్రమంగా అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కేవలం 8 నెలల్లోనే అమలు చేసింది కాంగ్రెస్. 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. పేద లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తోంది.
చదవండి: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?
కేవలం 11 నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వేల కొలది ఉద్యోగాలను భర్తీ చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు. 11 నెలల కాలంలోనే బీఆర్‌ఎస్ పాలనలోని చీకట్లను రేవంత్ రెడ్డి పారదోలి తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ప్రియ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
- వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Rao)
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి
(నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం)
Comments
Please login to add a commentAdd a comment