భారతదేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించాలని చాలా రోజుల నుంచి కొంత మంది కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా ఈ కులగణనకు జెండా ఊపడంతో, కులగణన వలన జరిగే ప్రయోజనాలు, సమస్యలు అనే విషయంపై చర్చ మొదలైంది. కులగణన అనే తేనె తుట్టెను నితీష్ కుమార్ కదిలించడం వెనక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని విమర్శకుల వాదన. కులాల వారీ జనాభా లెక్కల సేకరణ డిమాండ్ వెనక సామాజిక అభివృద్ధి కోణం ఉంటే సమర్థనీయమే. అభిలషణీయమే.
ఇక స్వాతంత్య్రానంతరం కొంత మంది మాత్రమే ఈ దేశాన్ని పాలించడంలో, దేశ వనరులను అను భవించడంలో ముందంజలో ఉన్నారు. ఆ పనిలో తాము కూడా ముందు ఉండాలని దూరాలోచన కులగణన సమర్థకుల మనసుల్లో ఉంటే... ఈ విషయంలో వాదాలూ, ప్రతి వాదాలూ, సమస్యలు అనేకం ఉత్పన్నం కావచ్చు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశంలోని అనేక వర్గాలు వెనుకబడి ఉన్న మాట నిజమే. స్వాతంత్య్రానంతరం ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక దృష్టి కోణంతోనే పాలనను సాగించి, నిమ్న వర్గాల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రజల సమగ్ర అభివృద్ధికి బాటలు పరిచిందనేది కాదనలేని నిజం. అయితే ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉన్నాయనీ, అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారికి అందాలంటే కులగణనే మార్గమనీ కొందరంటున్నారు.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రజా సంక్షేమానికి ఇవ్వడం లేదనేది కొంతమంది విజ్ఞుల అభిప్రాయం. ఏ కులం వారు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారు అనే విషయం తెలిస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయపరమైన పదవులు ఏయే కులాల వారికి ఎన్ని దక్కాలి అనే విషయంపై లెక్కలు తేలుతాయని కుల గణనను సమర్థించే నాయకులు చెప్పే మాటలు వాస్తవ విషయంలో నిజం కాకపోవచ్చు. దేశంలో ఇప్పటికే కొన్ని బీసీ కులాల వాళ్ళు తమ కులాలను ఎస్సీలో చేర్చండి అనీ, ఎస్టీల్లో చేర్చండి అనే డిమాండ్లను మొదలుపెట్టారు. కొన్ని ఆధిపత్య కులాలవారు తమను బీసీ వర్గాల్లో చేర్చండి అనే డిమాండు లేవదీస్తున్నారు. ఈ కులగణన చేపడితే ఇటువంటి అనేక డిమాండ్లూ, సమస్యలూ చుట్టు ముట్టవచ్చు.
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులాల వారీగా భారతదేశాన్ని విభజించి చూసే ప్రణాళిక అల్లింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. భారతీయుల్లో జాతీయాభిమానం పెరిగి, భారతదేశంలో తమ పెత్తనం చేజారిపోతుందని ఊహించిన బ్రిటిష్ పాలకులు భారతీయ సమాజాన్ని కులాల వారీగా, మతాల వారీగా విభజించడానికే ఈ కులాల వారీ గణనను ప్రారంభించారనేది వాస్తవం.
ఈ దేశ సమగ్రత, సమైక్యత, శక్తి మంతమైన భారత్ నిర్మాణం ఇత్యాది విషయాల్లో దేశంలోని మిగతా పార్టీల కంటే భారతీయ జనతా పార్టీది భిన్నమైన దృక్పథం. కులాల వారీగా భారతీయ సమాజాన్ని విభజిస్తే– భారతీయ సంస్కృతికి తాను వారసుణ్ణి అనే భావన లుప్తమై, ప్రజల్లో అసంఘటిత భావాలు ప్రబలి, జాతి వ్యతిరేక శక్తులు బలపడతాయని ఆ పార్టీ భావించే... ఇంతవరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది.
నిజంగా కులగణన అవసరమేనా? ఓట్లను అమ్ముకోకుండా ప్రజలు నీతి, నిజాయతీ, దేశ అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన నాయకులను ఎన్నుకుంటే సరిపోదా? కులాల లెక్కల వల్ల దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొంటుందా? కుల గణనను సమర్థించే వారందరూ ఈ విషయాలను గమనంలో ఉంచుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. (క్లిక్ చేయండి: స్తబ్ధత నుంచి చైతన్యంలోకి...)
- ఉల్లి బాలరంగయ్య
రాజకీయ సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment