సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు? | Chirravuri Siva Rama Krishna Sharma Views on Rishi Rajpopat Cracking an Ancient Code | Sakshi
Sakshi News home page

సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు?

Published Mon, Dec 26 2022 12:35 PM | Last Updated on Mon, Dec 26 2022 1:00 PM

Chirravuri Siva Rama Krishna Sharma Views on Rishi Rajpopat Cracking an Ancient Code - Sakshi

పత్రికలలో ‘‘2500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అనే వార్త చదివి తెల్లబోయాను. రిషిరాజ్‌ పోపట్‌  అనే 27 ఏళ్ల యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెడీ చేస్తున్నారట. అతడు చేసిన ప్రతిపాదన ఇది. సంస్కృత వ్యాకరణం పన్నెండు సంవత్సరాలు చద వాలని ప్రసిద్ధి. పూర్వం అలా చదివేవారు. ఇరవై ఏడేళ్ల యువకుడు ఇంగ్లీషులో చదివి ఇలా చెప్పడం ఒక వింత.

తమ జీవితాలను విద్యాతపస్సులకు అంకితం చేసిన మునులు వరరుచి, పతంజలి. వారు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను రచించిన వారు. పతంజలి ముని యోగ శాస్త్రాన్ని రచించిన వారు. ప్రపంచంలో చాలా యోగాలకు ఆయన యోగశాస్త్రం మూలం. ‘మహా భాష్యం వా పాఠయేత్, మహా రాజ్యం వా పాలయేత్‌’ అని ఆర్యోక్తి. పతంజలి ముని వ్యాకరణ మహా భాష్యాన్ని పాఠం చెప్పడం ఒక పెద్ద రాజ్యాన్ని పాలించడంతో సమానం. మహా భాష్యమైనా పాఠం చెప్పాలి. మహా రాజ్యమైనా ఏలాలని పై సంస్కృత సూక్తికి అర్థం. తరువాత కైయటుడు, భట్టోజి దీక్షితులు, నాగేశ భట్టు మొదలైన వారు బహుశాస్త్ర పండితులు. వీరు వ్రాసిన గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. వీరందరినీ కించపరిచే ఇతడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలి.

ఒక పదం తయారు చేయడంలో రెండు సూత్రాలు ఒకేసారి ప్రవర్తిస్తూంటే వానిలో ఏ సూత్రం ప్రవర్తింప చేయాలనే విష యంలో పాణిని ముని ‘విప్రతిషేధే పరం కార్యమ్‌’ అనే సూత్రం చెప్పారు. సమానమైన బలం కలిగిన రెండు సూత్రాలకు వైరుధ్యం కలిగినపుడు వరుస క్రమంలో తరువాత ఉన్న సూత్రం ఎంచు కోవాలి అని పాణిని మునిని అనుసరించిన గ్రంథకర్తలు తెలిపారు.

‘‘ఈ పద్ధతి వ్యాకరణం ద్వారా అనేకమైన తప్పు రూపాలను తయారు చేస్తుంది’’ అని ఇతడి ప్రతిపాదన. కాబట్టి ఇతడు ఈ సూత్రానికి వేరే అర్థం చెబుతున్నారు. ఒక పదం తయారు చేసే క్రమంలో ఒకచోట రెండు సూత్రాలు ప్రవర్తించవలసినపుడు వాటికి వైరుధ్యం వస్తే ఆ పదంలో రెండో భాగంలో ప్రవర్తించ వలసిన సూత్రాన్నే ప్రవర్తింప చేయాలి. ఈ పద్ధతిని అవలంబిస్తే సుమారు అన్ని పదాల తయారీలో సరైన సమాధానం లభిస్తుందని ఇతడి ప్రతిపాదన సారాంశం.

ఉదాహరణానికి మంత్ర + భిస్‌ అని ఉన్నపుడు 7 అ – 3 పా – 103 సంఖ్యగల సూత్రంచే మంత్రంలోని త్ర వర్ణమందు గల అకారానికి ఏ కారం వస్తుంది. దీనివల్ల మంత్రేభిః అనే అసాధు రూపం ఏర్పడుతుంది.  

7 అ – 1 పా – 9 సంఖ్యగల సూత్రంచే భిస్‌ కు ఐస్‌ వస్తుంది. మంత్ర + ఐస్‌ = మంత్రైః అని తయారవుతుంది. ఇది సరి అయిన రూపం. కాబట్టి రెండు సూత్రాలకు విప్రతిషేధం వస్తే వరుస క్రమంలో తరువాతి సూత్రం అని చెప్పకూడదు.

మంత్ర + భిస్‌ అనే చోట తరువాత ఉన్న ఐస్‌ కి భిస్‌ వస్తోంది. ఇది పదంలో కుడివైపున జరిగే కార్యం. దానిని విధించే సూత్రాన్ని ఎంచుకోవాలని పాణిని అభిప్రాయం. దీనివలన మంత్రైః అనే సరి అయిన రూపం ఏర్పడుతుందని రిషి రాజ్‌ ప్రతిపాదనం. 

సూత్ర గ్రంథాలలో అల్పాక్షరాలలో అనల్పమయిన అర్థాన్ని ఇముడ్చుతారు. దానిలో సారం చాలా ఉంటుంది. దోషం ఉండదు. ఇలాంటి సూత్రాలు విద్యను కంఠస్థం చేయడానికి ఉపయోగిస్తాయి. కాని విద్యార్థికి సూత్రంలో భావం ఎలా తెలుస్తుంది? గురువుల వల్ల, సూత్ర గ్రంథాల అధ్యయనం వల్ల, సూత్రాలపై రాసిన వ్యాఖ్యల వల్ల   తెలుస్తుంది. సూత్ర గ్రంథాలకు గురుశిష్య పరంపరగా వచ్చిన అర్థమే గ్రంథకర్త అభిప్రాయం అయ్యే అవకాశాలు అధికం. అలాగే గురు శిష్య పరంపరగా ఈ సూత్రాల అధ్యయనం సాగేది. ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి పూర్వ గ్రంథాలు చెప్పినది తప్పు అనడం సమంజసం కాదు. కాత్యాయనునికి వరరుచి అని మరో పేరు. ఆయన వార్తికాలన్నీ మహా భాష్యంలో ఉన్నాయి. విడిగా లేవు. పతంజలి యోగ శాస్త్రం వ్రాశారు. వీరి వ్యాకరణ భాష్యాన్ని మహా భాష్యం అంటారు.  

బహువచనే ఝల్యేత్‌   7 అ – 3  పా – 103 సూ. 
ఝలాదౌ బహు వచనే  సుపి పరే అతోఙ్గ స్యైకార స్సా్యత్‌ రామేభ్యః ఇది పతంజలి భాష్యం. 
పై సూత్రం మంత్ర + భిస్‌ అన్నచోట త్ర కారానికి ఏత్వం విధించగలదు. ఇది తరువాతి సూత్రం కనుక మంత్రే + భిస్‌ అని అయ్యే అవకాశం ఉంది. 
అతో భిస ఐస్‌   7 అ – 1  పా – 9 సూ.  
‘అకారాన్తా  దఙ్గా  ద్భి స ఐస్‌ స్యాత్, రామైః’ 
ఇది భాష్యంలోనిది. మంత్ర + భిస్‌ అని ఉన్నపుడు పై సూత్రం చే ఐస్‌ వచ్చి మంత్రైః అని అవుతుంది. 
విప్రతిషేధే పరం కార్యమ్‌ 
ఈ సూత్రం చేత సమాన బలం కలిగిన రెండు సూత్రాలు ఒక చోట ప్రవర్తించవలసి వస్తే తరువాత ఉన్న సూత్రం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ వరుసలో పూర్వం ఉన్న సూత్రం ప్రవర్తించిన రూపమే సరియైనది. కారణ మేమిటి ?   
అతో భిస ఐస్‌   7 అ – 1  పా – 9 సూ.  వృక్షైః, ఇహ పరత్వా దేత్వం ప్రాప్నోతి. 
... కృతైత్త్వే  భూత పూర్వ మకారం భవిష్యతి. ఐస్తు నిత్యమ్‌. 
... కృతే ప్యేత్వే ప్రాప్నోతి అకృతేపి ప్రాప్నోతి. నిత్యత్వా ధైత్వే  కృతే విహత నిమిత్తత్వాత్‌ ఏత్వం న భవిష్యతి. 
– వ్యాకరణ మహాభాష్యం (244 పు.) 
7 అ – 3  పా – 103 వ సూత్రం  పర సూత్రం కనుక దాని చేత మంత్ర + భిస్‌ అనే చోట త్ర కారంలో అకారానికి... ఏత్వం చేస్తే ఆ ఏకార స్థానంలో పూర్వం ఉన్నది అకారం కనుక అపుడు కూడా భిస్‌కు ఐస్‌ వస్తుంది. కావున ఐస్‌ నిత్యం. ఐస్‌ చేస్తే ఝలాది వర్ణం పరంగా లేదు కనుక ఏత్వం రాదు అని భాష్యకారులు చెప్పారు.

మంత్రలోని త్ర కారంలో ఉన్న అకారానికి వచ్చిన ఏ కారం అకారం వంటిది ఎలా అవుతుందని ప్రశ్న. సంస్కృత వ్యాక రణంలో ‘యథోత్తరం మునీనాం ప్రామాణ్యమ్‌’ అని నియమము. పాణిని ముని సూత్రాలకు భాష్యం లేకపోతే అవి అర్థం కావు. పాణిని ముని సూత్రాలకంటే కాత్యాయన ముని వార్తికాలకు, అంతకంటె పతంజలి ముని భాష్యానికి ప్రామాణ్యం ఎక్కువ. వార్తికాలు, భాష్యం లేకపోతే పాణిని సూత్రాలు మొత్తం సంస్కృత పద సముద్రానికి లక్షణం చెప్పలేవు. పతంజలి ముని ఒక శ్లోకం ఉదాహరించారు.    

శ్లో. ఏత్వం భిసి పరత్వాచ్చే దత ఐస్క భవిష్యతి
కృత ఐత్వే భూత పూర్వా్య ధైస్తు నిత్య స్తథాసతి
ఇది కాత్యాయన ముని వార్తికం అయి ఉంటుంది. 
కాబట్టి ఈ కారిక, పతంజలి ముని వచనం ప్రమాణంగా తీసుకుని ఐస్‌ను విధించే సూత్రం నిత్యమని చెప్పడం సముచితమే. ‘త్రిముని వ్యాకరణమ్‌’ అని ఆర్యోక్తి. ముగ్గురూ వ్యాకరణ విషయంలో ప్రామాణికులే.

పరం కంటే నిత్యం బలమయినది. కనుక ఏత్వం రాకుండా ఐస్‌ వచ్చిందని భావం. పర సూత్రం కంటె నిత్యం బల మయినదని ‘పూర్వ పర నిత్యాన్తరఙ్గానా ముత్తరోత్తరం బలీయః’ అనే పరిభాష తెలుపుతుంది. కావున పర సూత్రమైన ‘బహువచనే ఝల్యేత్‌’ అనే సూత్రాన్ని నిత్య సూత్రమైన ‘అతో భిస ఐస్‌’ బాధించింది. మంత్ర + ఐస్‌ = మంత్రైః అయ్యింది. ‘అతో భిస ఐస్‌’ నిత్య సూత్రమెలా అవుతుంది? ఏత్వం ఒక వర్ణానికి చెందిన విధి కదా అని ప్రశ్న. ఒక వర్ణానికి చెందిన విధిలో ఆదేశం స్థానివంటిది కాదని నిషేధం ఉంది. అపుడు ఏకారం అకారం వంటిది కాదు. ఇక్కడ భాష్యం వార్తికం ఎలా సరిపడతాయని ఆక్షేపం వస్తుంది. ‘అచః పరస్మిన్‌ పూర్వవిధౌ’ అనే సూత్రానికి మహాభాష్యంలో ‘అజాదేశః పరనిమిత్తకః పూర్వస్య విధిం ప్రతి స్థానివద్‌ భవతి. కుతః పూర్వస్య ఆదేశాద్‌’ అనే వాక్యాలున్నాయి.  

మంత్ర + భిస్‌ అనే చోట ‘బహువచనే ఝల్యేత్‌’ అనే సూత్రంచే త్రకారంలో ఉన్న అకారానికి ఏత్వం వచ్చి మంత్రే + భిస్‌ అయ్యింది. ఇప్పుడు ‘అతో భిస ఐస్‌’ అనే సూత్రం చేత ‘భిస్‌’నకు ఐత్వం వస్తున్నపుడు ఆదేశం అయిన ఐస్‌ కంటే పూర్వ మందున్న ఏకారానికి స్థానివద్భావం చేస్తే భిస్‌ నకు ఐస్‌ ప్రాప్తించి మంత్రైః అవుతుంది.  
కాబట్టి పైన పతంజలి ముని, కాత్యాయన ముని పేర్కొన్నట్లు ‘అతో భిస ఐస్‌’ నిత్య సూత్రం అయ్యింది. పరం కంటె నిత్యం ప్రబలం కనుక మంత్రైః అనే రూపం సిద్ధిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు, సమస్య, గందర గోళం లేవు.  

రిషి రాజ్‌ పోపట్‌ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించ పరిచాడు. తాను విప్రతిషేధే అనే సూత్రానికి కొత్త అర్థం చెప్పడం వల్ల కొన్ని రూపాలు కుదరడం లేదు. ఇది అతడి ప్రసంగం చూసి చేసిన విమర్శ. అతడి సిద్ధాంత గ్రంథాన్ని విమర్శిస్తే అదో పెద్ద గ్రంథమవుతుందేమో! (క్లిక్ చేయండి: జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు)


- డాక్టర్‌ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ 
వ్యాసకర్త రీడర్‌ (విశ్రాంత) ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement