మాతృభాషకు పరాభవం
♦ ఇంటర్ ఫలితాల తీరు..
♦ అధిక శాతం తెలుగు పరీక్ష ఫెయిల్
♦ ఆర్ట్స్ కంటే సైన్స్ గ్రూప్‌ల్లో ఉత్తీర్ణత మెరుగు
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు నేలపై మాతృభాషకు పరాభవం ఎదురైంది. అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలుగు భాషా పత్రంలో ఫెయిలయ్యారు. తెలుగు భాషా కంటే.. ఇంగ్లిష్, సంస్కృతం పేపర్లలోనే చాలా మెరుగ్గా విద్యార్థులు నెగ్గడం విశేషం. అంతేగాక సైన్స్ కంటే.. ఆర్ట్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులే అధికంగా ఫెయిలయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఫలితాల తీరు ఇదే రీతిలో ఉంది. శుక్రవారం ప్రకటించిన జంట జిల్లాల ఇంటర్ ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర అంశాలు స్పష్టమయ్యాయి. తెలుగు భాషా పేపర్‌లోనూ జంట జిల్లాల విద్యార్థులు చతికిలబడ్డారు.
ఆ భాష పట్ల ఉన్న చులకన భావమే వారి కొంప ముంచిందని విద్యావేత్తలు చెబుతున్నారు. మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, లేదంటే భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తెలుగు భాషా పేపర్‌లో 15.49 శాతం విద్యార్థులు తప్పారు. ఇంగ్లిష్‌లో 5.83 శాతం, సంస్కృతంలో 4.42 శాతం, హిందీలో 7.59 శాతమే ఫెయిలయ్యారు. రంగారెడ్డి జిల్లాలో తెలుగులో 11.90 శాతం, ఇంగ్లిష్‌లో 5.10, సంస్కృతంలో 4.08, హిందీలో 4.56 శాతం తప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థులు అమ్మభాషలో అధిక శాతం బోల్తా పడ్డారు. ఏకంగా 27.21 శాతం మంది ఫెయిలవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో సైతం 19 శాతం నమోదైంది.
ఆర్ట్స్‌లో వెనుకంజ..
ప్రకటించిన ఫలితాల్లో సైన్స్ గ్రూప్ విద్యార్థులతో ఆర్ట్స్ విద్యార్థులు పోటీ పడలేకపోయారు. చాలామంది గణితం, జీవశాస్త్రం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర సబ్జెక్టులంటే భయంతో.. ఆర్ట్స్ గ్రూప్‌లను ఆశ్రయిస్తున్నారు. తీరా ఫలితాల్లో బోల్తాపడుతున్నారు. సెకండియర్ ఫలితాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఫలితాల తీరు ఇలాగే ఉంది. సైన్స్ కంటే.. ఆర్ట్స్ విద్యార్థులు ఏడెమినిది రెట్లు అధికంగా ఫెయిలయ్యారు. హైదరాబాద్ జిల్లాలో సైన్స్ సబ్జెక్టుల్లోనూ అధిక శాతం ఫెయిలయ్యారు. అధికంగా గణితం 2బిలో 23 శాతానికి పైగా అనుత్తీర్ణత నమోదైంది.