- టెన్త్‌లో గణితం తర్వాత మాతృభాషలోనే ఎక్కువ మంది ఫెయిల్
- కేవలం 15 వేల మందికే ఇంగ్లీష్‌లో ఏ1 గ్రేడ్
సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థుల కొంప ముంచింది గణితమే. లెక్కలు రావడం లేదు సరే అనుకున్నా మాతృభాషలో గట్టెక్కలేక చతికిల పడ్డ విద్యార్థులూ ఎక్కువగానే ఉన్నారు. లెక్కలు తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు తప్పింది తెలుగులోనే. పదో తరగతి ప్రథమ భాషలో తెలుగు/హిందీ/ఉర్దూ తీసుకోవడానికి అవకాశం ఉం ది. రాష్ట్రంలో ప్రథమభాషగా తెలుగు తీసుకున్న వి ద్యార్థుల సంఖ్య ఎక్కువ. తర్వాత స్థానం ఉర్దూ తీసుకున్న వారిది.
గణితంలో గరిష్టంగా 6.17 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కాగా 4 శాతం మంది ప్రథమ భాషలో గట్టెక్కలేకపోయారు. మాతృభాషలో ఫెయిల్ అయిన వారి శాతం గతేడాది కంటే 0.65 శాతం ఎక్కువగా ఉంది. మాతృభాష కాని ద్వితీయ భాష(తెలుగు/హిందీ)లో కనిష్టంగా 1.73 శాతం మంది విద్యార్థులే ఫెయిల్ అయ్యారు. ద్వితీయభాష ఉత్తీర్ణత మార్కులు 18 కావడం కూడా ఉత్తీర్ణత శాతం పెరగడానికి కారణమని భావిస్తున్నారు.
ఇంగ్లిష్ మహాకష్టం
మన విద్యార్థులకు ఇప్పటీకీ మింగుడుపడని సబ్జెక్టు ఇంగ్లిషే. ఆంగ్లంలో 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పాసయితే.. అందులే 1.44 శాతం మంది అంటే కేవలం 15,328 మందికే ఏ1 గ్రేడ్ వచ్చింది. లెక్కల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయి ల్ అయినా ఆంగ్లంతో పోలిస్తే లెక్కల్లో ఏ1 గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.