బెంగళూరు: డిమాండ్లను పరిష్కరించేంతవరకూ పీయూసీ (ఇంటర్‌మీడియట్) పరీక్షల సమాధానపత్రాలు రీవాల్యువేషన్ చేసేది లేదని నిరసన చేపట్టిన పీయూసీ కళాశాల అధ్యాపకులతో ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెనరత్నాకర్ జరిపిన ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని డిమాండ్లను పరిష్కరించేంతవరకూ రీ వాల్యువేషన్ చేసేది లేదని అధ్యాపకులు తేల్చిచెప్పారు. వేతన తారతమ్యం పరిష్కారించడానికి వీలుగా కుమార్‌నాయక్ నివేదిక అమలు, రీవాల్యువేషన్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచడం తదితర డిమాండ్లతో గత నవంబర్ నుంచి పీయూసీ కళాశాల అధ్యాపకుల సంఘం నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలో కిమ్మెనరత్నాకర్, పీయూసీ బోర్డు ఉన్నతాధికులు సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. అయితే డిమాండ్లను పరిష్కరించడానికి ప్రస్తుతానికి పరిష్కరించడానికి వీలుకాదని అయితే భవిష్యత్తులో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని సంఘం ప్రతినిధులతో కిమ్మెన రత్నాకర్ పేర్కొన్నారు.
ఇందుకోసం తాత్కాలికంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు విడుదల చేయనుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుని రీవాల్యువేషన్‌కు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఇందుకు సంఘం సభ్యులు ససేమిరా అన్నారు. కుమార్‌నాయక్ నివేదిక అమలు డిమాండ్ చాలా ఏళ్లుగా అలానే ఉందని, రీ వాల్యువేషన్ బహిష్కరణ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని వారు తెలిపారు. నవంబర్ నుంచి తాము నిరసన చేపట్టగా పీయూసీ పరీక్షలు ముగియనున్న తరుణంలో ఇప్పుడు హడావుడిగా చర్చలకు పిలవడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కిమ్మెన రత్నాకర్ ఈ విషయమై మరోసారి ఈనెల 13న కుర్చొని మాట్లాడుకుందామని సంఘం ప్రతినిధులకు సూచించారు. దీంతో వారు చర్చల నుంచి బయటికి వచ్చేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు తిమ్మయ్య మాట్లాడుతూ డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకూ రీ వాల్యువేషన్‌కు హాజరయ్యేది లేదన్నారు. ఈనెల 13న జరిగే చర్చలకు మరోసారి వస్తామన్నారు.