బచ్‌పన్ లాంగ్వేజ్
భాష ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే బలమైన సాధనం. నాలుగు భాషలు వస్తే చాలు... ప్రపంచంలో ఏ మూలైనా బతికేయొచ్చు. ఈ సూత్రం ఆధారంగానే పని చేస్తున్నాయి ప్రస్తుతం నగరంలోని పాఠశాలలు. మాతృభాషకు తోడు ఏదో ఒక సెకండ్ లాంగ్వేజ్‌తో సరిపెట్టకుండా విదేశీ భాషలనూ నేర్పిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఉన్న ఈ పద్ధతిని ఇప్పుడిప్పుడే స్టేట్ స్కూల్స్ సైతం ప్రవేశపెట్టాయి. పిల్లల భవిష్యత్‌ని మించిన ది ఇంకేమీ లేదంటున్న తల్లిదండ్రులు కూడా మల్టీ లింగ్యువల్ స్కూల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు!
..:: కోట కృష్ణారావు, సనత్‌నగర్
ఉన్నత చదువుల కోసం ప్రతి ఏటా నగరం నుంచి విదేశాలకు పయనమవుతున్న వాళ్లు లెక్కకుమించి. అక్కడ అందరూ ఎదుర్కొనేది భాషా సమస్య. ఆయా దేశాల భాషలు రాకపోవడం, ఇంగ్లిష్ తెలిసినా... ఇక్కడ మాట్లాడే పద్ధతి, అక్కడి విధానానికి చాలా వ్యత్యాసం ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వివిధ దేశాలకు చెందిన భాషలను నేర్పేందుకు ప్రత్యేక లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు నగరంలో వెలిశాయి. అక్కడికి వెళ్లాక ఇబ్బంది పడటంకంటే ముందుగానే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం బెటరని భావించి నగరంలోని విదేశీ లాంగ్వేజ్ సెంటర్లలో వేలకు వేలు పోసి చిన్ననాటే శిక్షణ తీసుకుంటున్నారు.
బాల్యంలోనే బహుళ భాషలు...
చిన్నతనంలోనే విదేశీ భాషలు నేర్పించడం వల్ల ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నాయి పాఠశాలలు. అదీగాక చిన్న పిల్లల్లో గ్రాహకశక్తి ఎక్కువ. బాల్యంలో నేర్చుకున్న భాషను ఎన్నటికీ మరిచిపోలేరు. అందుకే పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే విదేశీ భాషలకు బీజం వేస్తున్నారు. నగరంలోని ఓక్రిడ్జ్, కేంద్రీయ విద్యాలయం, చిరెక్, బచ్‌పన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటివి ఎప్పటి నుంచో ఫారిన్ లాంగ్వేజెస్‌ను సహ పాఠ్యాంశాలుగా చేర్చాయి. దాదాపు అన్ని సీబీఎస్‌ఈ పాఠశాలలు సెకండ్ లాంగ్వేజ్‌గా విదేశీ భాషలను ప్రవేశపెట్టాయి.
ఒక్కో పాఠశాలలో ఒకటి లేదా రెండు విదేశీభాషల బోధనను తప్పనిసరి చేస్తున్నాయి. ఇందుకోసం ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులను సైతం నియమిస్తున్నాయి. ఈ ఫారిన్ లాంగ్వేజెస్ సంస్కృతి ఇప్పుడిప్పుడే స్టేట్ పాఠశాలలకు విస్తరిస్తోంది. కొన్ని స్కూళ్లు సెకండ్ లాంగ్వేజ్‌గా ఏదో ఒక విదేశీ భాషను తప్పనిసరి చేయగా, మరికొన్ని స్కూళ్ళలో విద్యార్థుల ఆసక్తిని బట్టి ప్రత్యేక తరగతుల ద్వారా ఆయా భాషలను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ తరువాత జర్మన్ భాషను సిటీ చిన్నారులు ఎక్కువగా నేర్చుకుంటున్నారు.
‘ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఈ క్రమంలో విదేశీ భాషలు సైతం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ముఖ్యంగా జర్మన్ టెక్నాలజీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలు కూడా బాగా పెరిగిపోయాయి. దాంతో తమ పిల్లలకు జర్మన్ లాంగ్వేజ్‌ను నేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. చిన్నతనం నుంచే భాష నేర్చుకుంటే ఎంతో సులువుగా ఉంటుంది’ అంటున్నారు కేంద్రీయ విద్యాలయంలో జర్మన్ లాంగ్వేజ్ టీచర్‌గా పని చేస్తున్న ప్రీతమ్.
కష్టమైనా... ఇష్టమే...
అదనంగా ఒక భాష తెలిసిందంటే... అవకాశాలు మరిన్ని పెరిగిన ట్టే. మంచి ఎప్పుడైనా ఆహ్వానించదగిందే... విదేశీ భాషలున్న స్కూల్స్ తెలుసుకుని మరీ పంపుతున్నామంటున్నారు తల్లిదండ్రులు. ఇష్టపూర్వకంగా చదువుతున్న సబ్జెక్ట్ కావడంతో విద్యార్థులు కూడా అంత భారంగా భావించడం లేదు సరికదా ఆసక్తిగా నేర్చుకుంటున్నారని చెబుతున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుతం నగరంలోని స్కూళ్లలో ఎక్కువగా జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలు నేర్పిస్తున్నారు.
భవిష్యత్ కోసం...
మా పాఠశాలలో విద్యార్థులకు స్పానిష్, ఫ్రెంచ్ నేర్పిస్తున్నాం. ఫ్రెంచ్ భాషకు ఆ దేశానికి చెందిన ప్రావీణ్యుడినే నియమించాం. అకడమిక్‌లో ఆ భాషలపై శిక్షణ కోసం ప్రత్యేక తరగతులు కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఉపయోగపడుతుంది. విదేశీ భాషల పట్ల తల్లిదండ్రులూ మక్కువ చూపుతున్నారు. తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు.
- హేమ చెన్నుపాటి, వైస్ ప్రిన్సిపాల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, గచ్చిబౌలి
కొత్తగా ఉంది...
నేను జర్మన్ నేర్చుకుంటున్నా. అక్కడక్కడ ఇంగ్లిష్ పదాలు ఉన్నా జర్మన్ లాంగ్వేజ్ డిఫరెంట్. పాఠశాలలో నేర్చుకున్న జర్మన్ గురించి మా సోదరులకు చెబుతూ ఎంజాయ్ చేస్తాను. నిత్యం మాట్లాడుకునే విషయాలను ఆ భాషలో ఏమంటారో తెలుసుకోవడం కొత్తగా ఉంది. జర్మన్ నేర్చుకోవడం చాలా ఈజీ కూడా!.
- నిహిత, నాల్గో తరగతి, బచ్‌పన్ స్కూల్