ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం! | Flexible way of income .. translation! | Sakshi
Sakshi News home page

ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం!

Published Wed, Sep 3 2014 11:49 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం! - Sakshi

ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం!

అప్‌కమింగ్ కెరీర్
ఒక భాషలో ఉన్న  ప్రాచీన సాహిత్యాన్ని, విలువైన గ్రంథాలను చదవాలంటే ఆ భాషను స్వయంగా నేర్చుకోవాల్సిన పనిలేదు. మాతృభాషలోకి తర్జుమా చేసిన పుస్తకాలను చదివితే సరిపోతుంది. అనువాదం ద్వారా ప్రపంచ సాహిత్యం అన్ని భాషల ప్రజలకు చేరువవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనువాదానికి గిరాకీ పెరుగుతోంది. గ్రంథాలు ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనువాదకులకు(ట్రాన్స్‌లేటర్స్) డిమాండ్ నానాటికీ విస్తృతమవుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారికి దేశవిదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ట్రాన్స్‌లేషన్ కోర్సుల్లో చేరే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది.  
 
అవకాశాలు.. పుష్కలం
ప్రపంచీకరణతో అన్నిదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. కార్పొరేట్, బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో అడుగుపెడుతున్నాయి. అక్కడ కార్యకలాపాల నిర్వహణకు స్థానిక భాషలు తెలిసినవారిని నియమించుకుంటున్నాయి. రవాణా, పర్యాటక రంగాల్లో అనువాదకులకు భారీ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్, రిలీజియన్ వంటి వాటిలో అవకాశాలకు కొదవే లేదు. విదేశీ భాషలను నేర్చుకొనేవారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రాన్స్‌లేటర్లకు ఫారిన్ లాంగ్వేజ్ టీచర్లుగా ఉపాధి లభిస్తోంది.

బోధన, శిక్షణపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా స్థిరపడేందుకు వీలుంది. ట్రాన్స్‌లేషన్ కోర్సును పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సులువుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆంగ్లంతోపాటు జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఆయా భాషలను నేర్చుకున్నవారికి  ఎన్నో రంగాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. అనువాదాన్ని కెరీర్‌గా మార్చుకున్నవారికి ఉద్యోగాలు, ఉపాధి పరంగా ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు.
    
కావాల్సిన లక్షణాలు:
అనువాదం అనేది ఒక సృజనాత్మక కళ. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతోనే పాఠకులు మెచ్చే అనువాదం సాధ్యమవుతుంది. ఈ రంగంలో పనిచేయాలంటే భాషలపై అనురక్తి ఉండాలి. అందులో లోటుపాట్లను తెలుసుకోవాలి. ఒక గ్రంథంలోని భావం మారిపోకుండా దాన్ని మరో భాషలోకి తర్జుమా చేసే నేర్పు సాధించాలంటే నిత్యం నేర్చుకొనే తత్వం ఉండాలి. వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్రాన్స్‌లేషన్‌లో అవి ప్రతిఫలించాలి.
 
అర్హతలు:
మనదేశంలో పలు విద్యాసంస్థలు ట్రాన్స్‌లేషన్ స్టడీస్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దూర విద్యా విధానంలోనూ కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉన్నత విద్యనభ్యసించినవారికి మంచి అవకాశాలుంటాయి.
 
వేతనాలు:
అనువాదకులకు అనుభవం, పనితీరును బట్టి వేతనాలు లభిస్తాయి. ఇంటర్‌ప్రిటేటర్స్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ. 50 వేలకుపైగానే పొందొచ్చు. ఫ్రీలాన్స్ ట్రాన్స్‌లేటర్లకు డాక్యుమెంట్ ఆధారంగా ఆదాయం ఉంటుంది. ఫుల్‌టైమ్ ట్రాన్స్‌లేటర్లు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగా అందుకోవచ్చు.
 
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.efluniversity.ac.in
ద్రవిడియన్ యూనివర్సిటీ.   వెబ్‌సైట్: www.dravidianuniversity.ac.in
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.ignou.ac.in
నేషనల్ ట్రాన్స్‌లేషన్ మిషన్.  వెబ్‌సైట్: www.ntm.org.in
యూనివర్సిటీ ఆఫ్ లక్నో.     వెబ్‌సైట్: www.lkouniv.ac.in
యూనివర్సిటీ ఆఫ్ పుణె.      వెబ్‌సైట్: www.unipune.ac.in
 
అన్ని భాషల్లో అవకాశాలు
‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ భాషల అనువాద నిపుణులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం సాహిత్య రంగంలో పుస్తకాల అనువాదానికే పరిమితం కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ వీరి అవసరం పెరుగుతోంది. ఇంటర్‌ప్రిటేటర్స్‌గా కూడా పనిచేయొచ్చు. ఒక వ్యక్తి సంభాషణను అప్పటికప్పుడు అనువాదం చే సేవారే ఇంటర్‌ప్రిటేటర్స్. వీరికి అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలున్నాయి. దాదాపు అన్ని భాషల్లో ట్రాన్స్‌లేటర్‌‌స అవసరం ఉంటుంది. ప్రధానంగా ఇంగ్లిష్‌తోపాటు యూరోపియన్ భాషలు నేర్చుకున్న వారికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ తదితర భాషల నుంచి తొలుత ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేస్తుండడమే దీనికి కారణం. తర్వాతే ఇంగ్లిష్ నుంచి మాతృభాషల్లోకి అనువదిస్తున్నారు’’    
 - డా. కె. వెంకట్‌రెడ్డి, రిజిస్ట్రార్, ఈఎఫ్‌ఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement