upcoming career
-
ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం!
అప్‌కమింగ్ కెరీర్ ఒక భాషలో ఉన్న ప్రాచీన సాహిత్యాన్ని, విలువైన గ్రంథాలను చదవాలంటే ఆ భాషను స్వయంగా నేర్చుకోవాల్సిన పనిలేదు. మాతృభాషలోకి తర్జుమా చేసిన పుస్తకాలను చదివితే సరిపోతుంది. అనువాదం ద్వారా ప్రపంచ సాహిత్యం అన్ని భాషల ప్రజలకు చేరువవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనువాదానికి గిరాకీ పెరుగుతోంది. గ్రంథాలు ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనువాదకులకు(ట్రాన్స్‌లేటర్స్) డిమాండ్ నానాటికీ విస్తృతమవుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారికి దేశవిదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ట్రాన్స్లేషన్ కోర్సుల్లో చేరే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. అవకాశాలు.. పుష్కలం ప్రపంచీకరణతో అన్నిదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. కార్పొరేట్, బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో అడుగుపెడుతున్నాయి. అక్కడ కార్యకలాపాల నిర్వహణకు స్థానిక భాషలు తెలిసినవారిని నియమించుకుంటున్నాయి. రవాణా, పర్యాటక రంగాల్లో అనువాదకులకు భారీ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్, రిలీజియన్ వంటి వాటిలో అవకాశాలకు కొదవే లేదు. విదేశీ భాషలను నేర్చుకొనేవారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రాన్స్లేటర్లకు ఫారిన్ లాంగ్వేజ్ టీచర్లుగా ఉపాధి లభిస్తోంది. బోధన, శిక్షణపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా స్థిరపడేందుకు వీలుంది. ట్రాన్స్లేషన్ కోర్సును పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సులువుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆంగ్లంతోపాటు జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఆయా భాషలను నేర్చుకున్నవారికి ఎన్నో రంగాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. అనువాదాన్ని కెరీర్‌గా మార్చుకున్నవారికి ఉద్యోగాలు, ఉపాధి పరంగా ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. కావాల్సిన లక్షణాలు: అనువాదం అనేది ఒక సృజనాత్మక కళ. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతోనే పాఠకులు మెచ్చే అనువాదం సాధ్యమవుతుంది. ఈ రంగంలో పనిచేయాలంటే భాషలపై అనురక్తి ఉండాలి. అందులో లోటుపాట్లను తెలుసుకోవాలి. ఒక గ్రంథంలోని భావం మారిపోకుండా దాన్ని మరో భాషలోకి తర్జుమా చేసే నేర్పు సాధించాలంటే నిత్యం నేర్చుకొనే తత్వం ఉండాలి. వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్రాన్స్‌లేషన్‌లో అవి ప్రతిఫలించాలి. అర్హతలు: మనదేశంలో పలు విద్యాసంస్థలు ట్రాన్స్లేషన్ స్టడీస్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దూర విద్యా విధానంలోనూ కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉన్నత విద్యనభ్యసించినవారికి మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: అనువాదకులకు అనుభవం, పనితీరును బట్టి వేతనాలు లభిస్తాయి. ఇంటర్ప్రిటేటర్స్కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ. 50 వేలకుపైగానే పొందొచ్చు. ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్లకు డాక్యుమెంట్ ఆధారంగా ఆదాయం ఉంటుంది. ఫుల్‌టైమ్ ట్రాన్స్‌లేటర్లు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగా అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in ద్రవిడియన్ యూనివర్సిటీ. వెబ్సైట్: www.dravidianuniversity.ac.in ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్. వెబ్సైట్: www.ntm.org.in యూనివర్సిటీ ఆఫ్ లక్నో. వెబ్సైట్: www.lkouniv.ac.in యూనివర్సిటీ ఆఫ్ పుణె. వెబ్సైట్: www.unipune.ac.in అన్ని భాషల్లో అవకాశాలు ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ భాషల అనువాద నిపుణులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం సాహిత్య రంగంలో పుస్తకాల అనువాదానికే పరిమితం కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ వీరి అవసరం పెరుగుతోంది. ఇంటర్ప్రిటేటర్స్గా కూడా పనిచేయొచ్చు. ఒక వ్యక్తి సంభాషణను అప్పటికప్పుడు అనువాదం చే సేవారే ఇంటర్‌ప్రిటేటర్స్. వీరికి అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలున్నాయి. దాదాపు అన్ని భాషల్లో ట్రాన్స్లేటర్స అవసరం ఉంటుంది. ప్రధానంగా ఇంగ్లిష్‌తోపాటు యూరోపియన్ భాషలు నేర్చుకున్న వారికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ తదితర భాషల నుంచి తొలుత ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేస్తుండడమే దీనికి కారణం. తర్వాతే ఇంగ్లిష్ నుంచి మాతృభాషల్లోకి అనువదిస్తున్నారు’’ - డా. కె. వెంకట్‌రెడ్డి, రిజిస్ట్రార్, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్ -
చక్కటి చిక్కటి కెరీర్‌కు... టీ టేస్టర్!
అప్‌కమింగ్ కెరీర్: ద్రవ పదార్థాల రంగు, రుచి, వాసన, చిక్కదనాన్ని కచ్చితంగా గుర్తించగల సామర్థ్యం మీ సొంతమా? అయితే, మీలాంటి వారికి సరిగ్గా సరిపోయే అద్భుతమైన నయా కెరీర్.. టీ టేస్టింగ్. తేనీరు లేనిదే తెల్లవారని వారెందరో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తేనీటి ప్రియులకు కొదవే లేదు. ప్రజల అభిరుచులను గుర్తించి, వారికి నచ్చే టీ రుచులను అందించే టీ టేస్టర్‌కు ప్రస్తుతం దేశవిదేశా ల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారికి భారీ వేతనాలు, మంచి జీవితం సొంతమవుతున్నాయి. ఇటీవలి కాలంలో హాస్పిటాలిటీ రంగంలో గుర్తింపు పొందుతున్న ట్రెండ్.. టీ టెస్టింగ్. పార్టటైమ్, ఫుల్‌టైమ్‌గా అవకాశాలు టీ అనేది అన్ని దేశాల సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. పొద్దున తేనీరు సేవిస్తే రోజంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. ప్రాచీన కాలం నుంచే వాడుకలో ఉన్న టీకి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. తోటలో టీ ఆకు ఉత్పత్తి నుంచి అది పొడిగా మారి వినియోగదారుడికి చేరే వరకు మధ్యలో ఎన్నో దశలు ఉంటాయి. ఇందులో కీలకపాత్ర టీ టేస్టర్దే. ఆకు నాణ్యతను, అది టీగా మారిన తర్వాత రంగును, రుచిని పరీక్షించి సంతృప్తిచెందిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేయాలి. ప్రాంతాలను బట్టి జనం అలవాట్లు, అభిరుచులు మారుతుంటాయి. వాటిని బట్టి టీని ఉత్పత్తి చేయాలి. ప్రపంచంలో టీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో శ్రీలంక, చైనాలతోపాటు భారత్ కూడా ఉంది. మనదేశంలో అస్సాం, కేరళ రాష్ట్రాల్లో టీ తోటలు అధికంగా ఉన్నాయి. టీ టేస్టర్లకు టీ ఎస్టేట్లలో, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ టేస్టర్లుగా పనిచేసుకోవచ్చు. వీరు టీ బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి, దిగుమతి వంటి కార్యకలాపాలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. గార్డెనర్లతో, పరిశోధకులతో కలిసి పని చేయాలి. కావాల్సిన లక్షణాలు: టీ టేస్టర్లకు టీ చరిత్ర, టీ ప్లాంటేషన్, టీలో రకాలు, గ్రేడ్లు వంటి వాటిపై పరిజ్ఞానం ఉండాలి. టీ ప్రాసెసింగ్, ప్రిపరేషన్‌పై తగిన అనుభవం అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకొనే లక్షణం ఉండాలి. టీ రంగు, రుచిని కచ్చితంగా గుర్తించే నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల టీల మధ్య తేడాలను విడమరిచి చెప్పగల సామర్థ్యం పెంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా టీ మార్కెట్లో వస్తున్న మార్పులను పసిగడుతూ తదనుగుణంగా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అర్హతలు: టీ టేస్టింగ్‌పై మనదేశంలో డిగ్రీ కోర్సులు లేకపోయినా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైనవారు వీటిలో చేరొచ్చు. టీ టేస్టింగ్ను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్నవారు ఫుడ్ సెన్సైస్, హార్టికల్చర్, అగ్రికల్చరల్ సైన్స్ వంటి సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. వృక్షశాస్త్రం చదివినవారు ఈ రంగంలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. వేతనాలు: టీ టేస్టర్లకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. ఫైవ్‌స్టార్ హోటళ్లలో ప్రారంభంలో నెలకు రూ.30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు రూ.50 వేలకు పైగానే పొందొచ్చు. టీ ఎస్టేట్లలో ఇంకా ఎక్కువ వేతనాలు ఉంటాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: డార్జిలింగ్ టీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వెబ్సైట్: www.nitm.in ఉపాసీ టీ రీసెర్చ్ ఫౌండేషన్ వెబ్సైట్: www.upasitearesearch.org బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ స్టడీస్ వెబ్సైట్: www.bifsmgmt.org ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.iipmb.edu.in లిప్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీ వెబ్సైట్: www.lipton.com.au స్పెషాలిటీ టీ ఇన్స్టిట్యూట్-యూఎస్ఏ వెబ్సైట్: www.teausa.com కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల్లో ‘ఆమ్లాలు - క్షారాలు’ పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి? - జి.శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జనరల్ స్టడీస్-2013 ప్రశ్నపత్రంలో రసాయన శాస్త్రం నుంచి 12 ప్రశ్నలు అడిగారు. వీటిలో ఎక్కువ శాతం మానవ జీవితంతో ముడిపడి ఉన్న వివిధ అంశాలకు సంబంధించినవే. వీటిలో ప్రధానమైన అంశం ఆమ్లాలు- క్షారాలు. నిత్యజీవితంలో ఆమ్లాలు-క్షారాల ప్రస్తావన లేని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని క్షుణ్నంగా చదివి వివిధ అంశాలపై పట్టు సాధించాలి. ఉదాహరణకు మానవ ఉదరంలో ఉండేది బలమైన హైడ్రోక్లోరికామ్లం. ఎర్రచీమలు కుడితే శరీరంలోకి ప్రవేశించేది ఫార్మికామ్లం. సోడానీటిలో ఉండేది కార్బోనికామ్లం. బ్యాటరీలో సల్య్ఫూరికామ్లం ఉంటుంది. రుచి కోసం ఉపయోగించే టేబుల్ సాల్ట్ ఆమ్ల-క్షార తటస్థీకరణ చర్య ద్వారా వచ్చే లవణం. అలాగే పులుపు పదార్థాల్లో ఉండే ఆమ్లాల గురించి కూడా తెలుసుకోవాలి. చిన్న పిల్లలు ఏడిస్తే తాగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియాతో మొదలుకొని వివిధ యాంటాసిడ్లలో క్షారాలను ఉపయోగిస్తారు. నేలల ఆమ్లత్వం ఎక్కువై క్షారాలు తగ్గిపోయినప్పుడు చౌడు భూములుగా మారతాయి. కాబట్టి క్షారమయమైన సున్నం వంటి పదార్థాలను నేలలో చల్లుతారు. పోటీ పరీక్షల కోణంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 7 నుంచి 10వ తరగతుల పాఠ్యపుస్తకాలను చదవాలి. ఇన్పుట్స్: డా.బి.రమేశ్, సీనియర్ ఫ్యాకల్టీ బీపీసీఎల్‌లో జనరల్ వర్క్మెన్లు కొచ్చిన్‌లోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) జనరల్ వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ వర్క్‌మెన్ - బి విభాగాలు: కెమికల్:30, మెకానికల్:30 అర్హతలు: 60 మార్కులతో శాతం కెమికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు జనరల్ వర్క్‌మెన్-బి(ట్రైనీ) విభాగాలు: టర్నర్: 3, వెల్డర్:3, ఫిట్టర్:2 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కులతో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. హెచ్వీడీ డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి. వయసు: ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్: www.bpclcareers.in స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీనియర్ మైనింగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. డిప్యూటీ జనరల్ మేనేజర్(మైనింగ్) : 6 విభాగం: రా మెటీరియల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్(మైనింగ్) : 3 విభాగం: కాలరీస్ అర్హతలు: 65 శాతం మార్కులతో మైనింగ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మొదటి శ్రేణి మైన్స్ మేనేజర్ సర్టిఫికెట్ ఉండాలి. 20 ఏళ్ల అనుభవం అవసరం. వయసు: 48 ఏళ్లకు మించకూడదు. చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.sail.co.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా విధానంలో కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ, విభాగాలు: జ్యోతిషం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, టూరిజం అండ్ మేనేజ్మెంట్. ఎంసీజే, అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఏ, విభాగాలు: కర్ణాటక సంగీతం, స్పెషల్ తెలుగు. అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత. పీజీ డిప్లొమా, విభాగాలు: జ్యోతిషం, టీవీ జర్నలిజం. అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. డిప్లొమా ప్రోగ్రామ్, విభాగాలు: జ్యోతిషం, మోడ్రన్ తెలుగు. సంగీత విశారద. అర్హత: పన్నెండేళ్లు నిండి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31 వెబ్సైట్: http://teluguuniversity.ac.in పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్ అర్హతలు: 50 శాతం మార్కులతో బీఎస్సీ/బీ ఫార్మసీ/ బీఎస్సీ(అగ్రి)/బీవీఎస్సీ/బీడీఎస్/బీహెచ్ఎంఎస్/బీఏఎంస్/ బీయూఎంఎస్/బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంసీఏ/ పీహెచ్డీ ఉత్తీర్ణత. చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.osmania.ac.in -
పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్
అప్‌కమింగ్ కెరీర్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరచిపోలేని మధురమైన ఘట్టం. ఇద్దరి మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తుంటారు. ఆధునిక జీవితాలు తీరికలేకుండా బిజీబిజీగా మారిపోయా యి. పెళ్లి వేడుకల కోసం ఎక్కువ సమయం వెచ్చించలేని పరిస్థితి. మారుతున్న కాలానికి తగ్గట్టు వెడ్డింగ్ ప్లానర్లు పుట్టుకొచ్చారు. సంతృప్తికి, ప్రశంసలకు, ఆదాయానికి లోటులేని కెరీర్.. వెడ్డింగ్ ప్లానింగ్. నేటి కార్పొరేట్ యుగంలో వెడ్డింగ్ ప్లానర్లకు డిమాండ్ పెరిగింది. వీరికి మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ప్రారం భంలో ఏదైనా వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థలో పనిచేసి తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. వివాహాల నిర్వాహకులు ఎన్నో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్లయింట్ల అభిరుచులు, అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వివాహ వేడుక జరిపించాలి. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి, పెళ్లి జరిగి, అప్పగింతలయ్యేదాకా అన్ని దశలు విజయవంతంగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షించాలి. వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అధిక శ్రమతో కూడుకున్న వృత్తి. ఇందులో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ముందే నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా చూసుకోవాలి. టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అర్హతలు: వెడ్డింగ్ ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ప్రత్యేకంగా విద్యార్హతలు లేవు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో నిలదొక్కుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు చదవాలి. ఈ కోర్సుల్లో భాగంగా వెడ్డింగ్ ప్లానింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ రంగానికి సంబంధించి ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా వెడ్డింగ్ ప్లానర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారెందరో ఉన్నారు. వేతనాలు: వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అనేక విభాగాల కలబోత. సాధారణంగా కో-ఆర్డినేటర్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. మూడేళ్లపాటు పనిచేసి అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు అందుకోవచ్చు. ఆపరేషన్స్ మేనేజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు లక్ష రూపాయల దాకా పొందొచ్చు. ఇక సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్న వెడ్డింగ్ ప్లానర్ వివాహాల సీజన్లో లక్షలాది రూపాయల ఆదాయం ఆర్జించొచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై వెబ్సైట్: www.niemindia.com - తానియా-తాపెల్ వెడ్డింగ్ ప్లానర్ ట్రైనింగ్ అకాడమీ-ముంబై వెబ్సైట్: www.tania-tapel.com - ఈవెంట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్-ముంబై వెబ్సైట్: www.emdiworld.com ఓర్పు, మాటతీరే.. పెట్టుబడి శ్రీ వివాహ మహోత్సవ వేడుక అత్యంత ప్రధానమైంది. ఎక్కడో దూరంగా ఉన్న ఆత్మీయులు పెళ్లి కార్యక్రమానికి తోడ్పాటును అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని పనులను ఒక్కరే చేసుకోలేరు. కాబట్టి వెడ్డింగ్ ప్లానర్లపై ఆధారపడుతున్నారు. అందమైన వేడుకను ఆహ్లాదభరితంగా నిర్వహించే వెడ్డింగ్ ప్లానర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. శ్రమ ఎక్కువైనా ఓర్పు వహించడం, అతిథులను ఆత్మీయంగా పలకరించడం వంటి లక్షణాలుంటే ఈ రంగంలో రాణించొచ్చు. విద్యార్ధులు, నిరుద్యోగులకు ఇది ఆర్థికంగా వెసులుబాటును ఇచ్చే కెరీర్. వెడ్డింగ్ ప్లానింగ్ రంగంలో అనుభవాన్ని బట్టి భారీ వేతనాలుంటాయి - అజ్మత్, ఈవెంట్ మేనేజర్ -
సమాజ సేవకు.. మైక్రో బయాలజిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: సూక్ష్మ జీవశాస్త్రం(మైక్రో బయాలజీ)... మహా సముద్రం లాంటి జీవశాస్త్రంలో ఒక భాగం. మనిషి కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవుల అధ్యయనమే.. సూక్ష్మ జీవశాస్త్రం. భూగోళంపై లెక్కలేనన్ని సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. వాటిలో మనిషికి శత్రువులు, మిత్రులు.. ఉపయోగపడేవి, అప కారం చేసేవి.. రెండూ ఉన్నాయి. శత్రు జీవు లను నిర్మూలించాలి. మిత్ర జీవులను కాపా డుకోవాలి. వాటిని అనుకూలంగా మార్చు కొని, జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించు కోవాలి. ఇవన్నీ చేసేవారే.. మైక్రో బయాల జిస్ట్‌లు. మంచి వేతనంతోపాటు పరిశోధనల ద్వారా సమాజానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించే కెరీర్.. మైక్రో బయాలజిస్ట్. ఐటీ ఇంజనీర్లకంటే అధిక వేతనాలు మైక్రో బయాలజీలో అగ్రికల్చరల్, సాయిల్, మెడికల్, ఎన్విరాన్మెంటల్, ఇండస్ట్రియల్, ఫుడ్ మైక్రోబయాలజీ తదితర ఉప విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో మైక్రో బయాలజిస్ట్‌లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. పర్యావరణం, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, పేపర్, టెక్స్టైల్, లెదర్, ఆహారం.. తదితర పరిశ్రమల్లో వీరికి డిమాండ్ పెరుగు తోంది. పరిశోధనల్లో మంచి అనుభవం సంపా దించి, నైపుణ్యాలు పెంచుకున్న మైక్రో బయాల జిస్ట్‌లకు ఐటీ ఇంజనీర్ల కంటే అధిక వేతనాలు అందుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం మైక్రో బయాలజీ కోర్సును పూర్తిచేస్తే.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, హెల్త్‌కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు. ఫుడ్ క్వాలిటీ ఆఫీసర్, పొల్యూషన్ కంట్రోలర్, ప్రొడక్ట్ ఇంజనీర్, ఫుడ్ టెక్నాలజిస్ట్, ఇండస్ట్రియల్ మైక్రో బయాలజిస్ట్, పాథాలజీ ల్యాబ్‌ల్లో సైంటిస్ట్, పేటెంట్ అటార్నీ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర కొలువులు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ స్థిరపడొచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు మైక్రో బయాలజీలో పరిశోధనలు చేపట్టేందుకు యువ సైంటిస్ట్‌ల కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్ట్‌లను ప్రవేశపెడుతున్నాయి. ప్రత్యేకంగా నిధులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత మైక్రో బయాలజీలో గ్రాడ్యుయేషన్ చదవొచ్చు. ఎంఎస్సీ, పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే ఉద్యోగార్హతలు పెరుగుతాయి. వేతనాలు మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. నైపుణ్యాలు పెంచుకుంటే కార్పొరేట్ సంస్థల్లో ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు భారీ వేతన ప్యాకేజీ పొందొచ్చు. మైక్రో బయాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in నాగార్జునా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in మైక్రోబయోటెక్నాలజీతో ఆల్‌రౌండ్ ప్రతిభ ‘‘గత 15-20 ఏళ్లుగా రీసెర్స్, టెక్నాలజీ పరంగా ప్రాచుర్యంలోకి వచ్చింది మైక్రో బయోటెక్నాలజీ. కోర్సులో ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టులు ఉండటంతో విద్యార్థులు ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. దక్షిణాదిన మొదటిసారి ఈ కోర్సును ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ప్రవేశపెట్టారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు విస్తరించింది. విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బోధన, పరిశోధనలకు అవకాశాలున్నాయి. ప్రతిభ గలవారికి ప్రభుత్వ సంస్థల్లో పరిశోధనలతోపాటు ఫెలోషిప్‌లు అందుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకూ ఫెలోషిప్ లభిస్తుంది. పీహెచ్డీ పూర్తిచేసి సమర్థత నిరూపించుకోగలిగితే ప్రారంభ వేతనమే రూ.40 వేల వరకూ లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పలు దేశాల పరిశోధన సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి’’. - డాక్టర్ ఎం.గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ మైక్రోబయాలజీ విభాగం, ఓయూ -
గృహస్థుకు శుభాలనిచ్చే.. వాస్తుశాస్త్రం
అప్‌కమింగ్ కెరీర్ మానవుడి జీవితంపై పంచ భూతాల, ప్రకృతి శక్తుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని భారతీయులు ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నివాస గృహం అనేది ప్రకృతి శక్తులను స్వేచ్ఛగా ఆహ్వానించేదిగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని జీవితం ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతుంది. పంచభూతాల గమనం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం అందరికీ తెలియదు. దానికొక శాస్త్రం ఉంది. అదే వాస్తు శాస్త్రం. గృహ నిర్మాణానికి సలహాలు, ఇంటిలో మార్పులు చేర్పులపై సూచనలు ఇచ్చేవారే వాస్తు నిపుణులు. దీనిపై ప్రజల్లో అవగాహన అధికమవుతుండడంతో డిమాండ్ ఉన్న కెరీర్... వాస్తుశాస్త్రం. పెట్టుబడి లేకుండానే కెరీర్ ప్రారంభం వ్యక్తిగత నివాస గృహాలతోపాటు కార్పొరేట్ కార్యాలయాలను కూడా వాస్తుప్రకారం నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు వాస్తు ప్లానర్లను తప్పనిసరిగా నియమించుకుంటు న్నాయి. ప్రజలు తమ ఇంటిలో వాస్తు దోషాలను సరిచేసుకొనేందుకు నిపుణులను సంప్రదిస్తున్నారు. ఇక పత్రికలు, టీవీ ఛానళ్ల వంటి ప్రసార మాధ్య మాలు వాస్తును విస్తృతంగా ప్రచారం చేస్తుండడం తో ప్రజల్లో దీనిపై అవగాహన పెరుగుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని అందరూ భావిస్తున్నారు. వీటన్నింటి వల్ల వాస్తు ప్లానర్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదు. కచ్చితమైన పనివేళలు లేకపోవడం దీనిలో ఉన్న వెసులుబాటు. నచ్చిన సమయాల్లోనే పనిచేసుకోవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే కెరీర్ ప్రారంభించొచ్చు. వాస్తు నిపుణులుగా మంచి పేరు, తద్వారా మరిన్ని అవకాశాలు తెచ్చుకోవాలంటే ఈ శాస్త్రంపై గట్టి పట్టు, తగిన అనుభవం ఉండాలి. మిడిమిడి జ్ఞానంతో ముందుకెళితే కెరీర్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రకరకాల మనస్తత్వాలు ఉన్న క్లయింట్లతో వ్యవహరించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వృత్తిలో భాగంగా దూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంసిద్ధంగా ఉండాలి. వాస్తు శాస్త్రంలో పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. అర్హతలు: వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ప్రత్యేకంగా విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై నమ్మకం, ఆసక్తి, అభిరుచి ఉన్నవారెవరైనా ఇందులోకి ప్రవేశించొచ్చు. ఈ శాస్త్రంపై ప్రొఫెషనల్ కోర్సు పూర్తిచేస్తే మంచి అవకాశాలుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పలు కోర్సులు ఉన్నాయి. కోర్సు చదివిన తర్వాత పేరు ప్రఖ్యాతలున్న వాస్తు గురువు వద్ద కొన్నాళ్లు శిష్యరికం చేసి, అనుభవం సంపాదించాలి. తర్వాత సొంతంగా పనిచేసుకోవచ్చు. వేతనాలు: వాస్తు నిపుణులు ప్రారంభంలో నెలకు రూ.20 వేలు సంపాదించుకోవచ్చు. తర్వాత అనుభవం, నైపుణ్యాలను పెంచుకుంటే నెలకు దాదాపు రూ.60 వేల ఆదాయం లభిస్తుంది. డిమాండ్‌ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. లక్షల్లో ఆర్జించే సీనియర్ వాస్తు నిపుణులు ఎందరో ఉన్నారు. వాస్తుశాస్త్రాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.osmania.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://teluguuniversity.ac.in ఆర్జన, విజ్ఞాన సముపార్జన ‘‘భారతదేశంలో ఆచరించే ప్రతి అంశంలో మానవాళి శ్రేయస్సు దాగుంది. వాస్తుశాస్త్రం కూడా దానిలో భాగమే. నివాస యోగ్యమైన గృహం, వ్యాపార, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఎలా ఉండాలనే నిర్దిష్టమైన అంశాలే ఇందులో ఉంటాయి. జ్యోతిష్యం, వాస్తు రెండూ ఒకదానికొకటి విడదీయలేనివి. అందుకే ఆ రెండింటికీ కలిపి కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాస్తు, ఇంటీరియర్ కోర్సు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నాం. వాస్తుపై అపోహలను పోగొట్టి, విజ్ఙానం పెంపొందించేందుకు వాస్తు విజ్ఙాన సంస్థ ఏడాదికి రెండుసార్లు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాస్తు శాస్త్రం అనేది ఎప్పటికీ వన్నెతగ్గని కెరీర్ అనే చెప్పొచ్చు.ఈ కోర్సులను పూర్తిచేసిన వారు కన్సల్టెన్సీలు, మీడియా, ఆన్లైన్ మార్గాల ద్వారా అవకాశాలను పొందొచ్చు. వాస్తు ప్లానర్లకు సంఘంలో గౌరవం, హోదా పెరిగాయి. ప్రస్తుతం వాస్తు నిపుణుడి స్థాయిని బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదన గ్యారంటీ’’ -ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, వైదిక్ ఆస్ట్రో విభాగం, ఓయూ