పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్ | Wedding planner courses to be Increased in Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్

Published Wed, Jul 23 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్

పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్

అప్‌కమింగ్ కెరీర్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరచిపోలేని మధురమైన ఘట్టం. ఇద్దరి మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తుంటారు. ఆధునిక జీవితాలు తీరికలేకుండా బిజీబిజీగా మారిపోయా యి. పెళ్లి వేడుకల కోసం ఎక్కువ సమయం వెచ్చించలేని పరిస్థితి. మారుతున్న కాలానికి తగ్గట్టు వెడ్డింగ్ ప్లానర్లు పుట్టుకొచ్చారు. సంతృప్తికి, ప్రశంసలకు, ఆదాయానికి లోటులేని కెరీర్.. వెడ్డింగ్ ప్లానింగ్. నేటి కార్పొరేట్ యుగంలో వెడ్డింగ్ ప్లానర్లకు డిమాండ్ పెరిగింది.
 
 వీరికి మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ప్రారం భంలో ఏదైనా వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థలో పనిచేసి తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.   వివాహాల నిర్వాహకులు ఎన్నో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్లయింట్ల అభిరుచులు, అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వివాహ వేడుక జరిపించాలి. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి, పెళ్లి జరిగి, అప్పగింతలయ్యేదాకా అన్ని దశలు విజయవంతంగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షించాలి. వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అధిక శ్రమతో కూడుకున్న వృత్తి. ఇందులో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ముందే నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా చూసుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ తప్పనిసరి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
 
అర్హతలు: వెడ్డింగ్ ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ప్రత్యేకంగా విద్యార్హతలు లేవు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో నిలదొక్కుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు చదవాలి. ఈ కోర్సుల్లో భాగంగా వెడ్డింగ్ ప్లానింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ రంగానికి సంబంధించి ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా వెడ్డింగ్ ప్లానర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారెందరో ఉన్నారు.
 
 వేతనాలు: వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అనేక విభాగాల కలబోత. సాధారణంగా కో-ఆర్డినేటర్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. మూడేళ్లపాటు పనిచేసి అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు అందుకోవచ్చు. ఆపరేషన్స్ మేనేజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు లక్ష రూపాయల దాకా పొందొచ్చు. ఇక సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్న వెడ్డింగ్ ప్లానర్ వివాహాల సీజన్‌లో లక్షలాది రూపాయల ఆదాయం ఆర్జించొచ్చు.  
 
 ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 -    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్-ముంబై
 వెబ్‌సైట్: www.niemindia.com
 -    తానియా-తాపెల్ వెడ్డింగ్ ప్లానర్ ట్రైనింగ్ అకాడమీ-ముంబై
 వెబ్‌సైట్: www.tania-tapel.com
 -    ఈవెంట్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-ముంబై
 వెబ్‌సైట్: www.emdiworld.com
 
 ఓర్పు, మాటతీరే.. పెట్టుబడి  

 శ్రీ వివాహ మహోత్సవ వేడుక అత్యంత ప్రధానమైంది. ఎక్కడో దూరంగా ఉన్న ఆత్మీయులు పెళ్లి కార్యక్రమానికి తోడ్పాటును అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని పనులను ఒక్కరే చేసుకోలేరు. కాబట్టి వెడ్డింగ్ ప్లానర్లపై ఆధారపడుతున్నారు. అందమైన వేడుకను ఆహ్లాదభరితంగా నిర్వహించే వెడ్డింగ్ ప్లానర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. శ్రమ ఎక్కువైనా ఓర్పు వహించడం, అతిథులను ఆత్మీయంగా పలకరించడం వంటి లక్షణాలుంటే ఈ రంగంలో రాణించొచ్చు. విద్యార్ధులు, నిరుద్యోగులకు ఇది ఆర్థికంగా వెసులుబాటును ఇచ్చే కెరీర్. వెడ్డింగ్ ప్లానింగ్ రంగంలో అనుభవాన్ని బట్టి భారీ వేతనాలుంటాయి
 - అజ్మత్, ఈవెంట్ మేనేజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement