ప్లాన్‌ ఈమెదే! | Special story to Wedding Planner devika narain | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ ఈమెదే!

Published Wed, Aug 8 2018 12:36 AM | Last Updated on Wed, Aug 8 2018 12:36 AM

Special story to Wedding Planner devika narain - Sakshi

పెళ్లి జరగాలంటే ముగ్గురు ఉండాలి..అమ్మాయి.. అబ్బాయి.. వెడ్డింగ్‌ ప్లానర్‌మరి మండపం? అలంకరణ? బాజా? భజంత్రీ?విందు? వినోదం? వీటన్నిటినీ ఒకప్పుడు ఇంటి పెద్దలు చూసుకునేవాళ్లు!ఇప్పుడు అందరూ గెస్ట్సే!అవును మరి.. ఇప్పుడు పెళ్లికి కావల్సింది ముగ్గురే.అబ్బాయి.. అమ్మాయి..  వెడ్డింగ్‌ ప్లానర్‌!!

అనుష్కా శర్మ, విరాట్‌ కొహ్లీ పెళ్లి గురించి దేశమంతా చెవులు చేసుకుంది. ప్రతి ఆరాను ఆసక్తిగా విన్నది. ఆ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను చూడలేకపోయినా.. ఆ థీమ్‌.. ఫొటోగ్రాఫ్స్‌ ఇంకా కళ్లల్లో మెదులుతూనే ఉంటాయి. దానికి సంబంధించి ఏ చిన్న వార్తయినా ఇప్పటికీ ఇంట్రెస్టింగే. ఆ కుతూహలాన్ని రేకెత్తించడంలో దాని గురించి నేటికీ ఇలా మాట్లాడుకోవడంలో అసలు ఆ పరిణయం అలా కన్నుల పండుగలా జరగడం వెనక ఉన్న వ్యక్తి దేవిక నరైన్‌. వృత్తి వెడ్డింగ్‌ ప్లానర్‌. సెలబ్రిటీ వెడ్డింగ్‌ ప్లానర్‌. సెలబ్రిటీల మ్యారెజేస్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్లాన్‌ చేస్తూ తనూ ఓ సెలెబ్రెటీగా మారిపోయింది.  పెళ్లి... అమ్మాయి, అబ్బాయి కామన్‌ కల.. జానపద కథల్లోని హీరోలో వరుడిని.. హీరోయిన్‌లో వధువుని వెదుక్కుంటూ ఉంటారు.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట... నవరత్నాలే తలంబ్రాలు... అతిరథ మహారథులు అతిథులు.. పంచభూతాలు సాక్షులు.. వంటి రిచ్‌ ఎలిమెంట్స్, గ్రాండ్‌ ఎఫెక్ట్స్‌తో  మూడుముళ్లు.. ఏడడుగుల వేడుక ఊహకు భారీగా బడ్జెట్‌ కేటాయిస్తారు.  కాని  నిజం చేసుకోవడానికి కాసుల కారణంతో కామ్‌ అయిపోతుంటారు. అలాంటి నిరాశ వద్దు.. మీ బడ్జెట్‌ ఎంతైనా అందులోనే ఆనుకున్నట్టుగా పెళ్లి చేసుకోండి.. ఆనందంగా ఆ క్షణాలను ఆస్వాదించండి.. అందమైన జ్ఞాపకంగా మిగుల్చుకోండి అంటోంది దేవిక నరైన్‌.  ఆమె అనుష్కా పెళ్లి సందడితో పాపులర్‌ కాలేదు. అంతకుముందే దినేశ్‌ కార్తిక్, రాబిన్‌ ఉతప్పల వివాహాలనూ  ప్లాన్‌ చేసింది. అలా సెలెబ్రిటీల దృష్టిలో పడింది. 

ఏం చదువుకుంది? ఎందుకీ ప్లాన్‌ చేస్తోంది?
దేవిక నరైన్‌ సొంతూరు లక్నో.  వాళ్లింట్లో బిజినెస్‌ వాసనే లేదు. ఆమె తండ్రి  ప్రదీప్‌ నరైన్‌ ఉద్యోగస్తుడు. దేవికను, ఆమె తమ్ముడిని కూడా బాగా చదివించారు మంచి ఉద్యోగంలో   స్థిరపడాలని. ఇంటర్‌ అయిపోగానే డిగ్రీ కోసం ఢిల్లీకి వచ్చింది దేవిక. లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌లో ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో చేరింది. చదువు అయిపోయాక జర్నలిజమ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌లో ఇంటర్న్‌షిప్‌ మొదలుపెట్టింది.  రాయడం ఇష్టంగానే ఉంది.. కాని ఇంకేదో చేయాలన్న ఆరాటం నిలువనీయలేదు. ఇది కాదు చేయాల్సింది అంటూ మెదడు పెట్టే పోరును పట్టించుకుంది. ఓ నిర్ణయం తీసుకుంది. 

బ్యాండ్‌ బాజా బారాత్‌
ఇంట్లో వాళ్లకు చెప్పింది. తను ఉద్యోగం మానేస్తున్నట్టు. మరి ఏం చేస్తావ్‌? పెళ్లి చేసుకుంటావా? అని పెద్దవాళ్లు అడిగేలోపే ‘పెళ్లి చేయిస్తా’ అని చెప్పింది. వెడ్డింగ్‌ ప్లానర్‌గా మారాలనుంది అని వివరించింది. ముంబైలోని ఓ వెడ్డింగ్‌ ఈవెంట్‌ కంపెనీలో జాయిన్‌ అయింది. కొన్నాళ్లు పోయాక తనే సొంతంగా స్టార్ట్‌ చేస్తే బాగుంటుంది అనుకొని  ‘దేవిక నరైన్‌ అండ్‌ కంపెనీ’ ప్రారంభించింది.  ఇంట్లో వాళ్లు ఒకింత ఆందోళన పడ్తూనే ఉన్నారట ఆమె సక్సెస్‌ చూసేదాకా. ‘ఇప్పుడు ఎవ్రీబడీ హ్యాపీ’ అంటుంది దేవిక. ఆమె విజయం గురించి ఆమెనే చెప్పనిద్దాం.. 

సైకాలజీ...ప్లానింగ్‌ 
‘వెస్ట్రన్‌ సొసైటీలో పెళ్లంటే ఇద్దరు వ్యక్తులదే.  కాని మన దగ్గర అలా కాదు. రెండు కుటుంబాలకు సంబంధించింది. మన వాళ్లు  ఎక్కడైనా కాంప్రమైజ్‌ అవుతారు కాని పెళ్లి విషయంలో కారు.   ఇప్పుడు మ్యారేజ్‌ ఏర్పాట్లలో అమ్మాయి, అబ్బాయే  ఇన్‌వాల్వ్‌ అవుతున్నారు. ఉన్నదాంట్లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.  బడ్జెట్, అభిరుచికి తగ్గ థీమ్‌ ఇస్తాం.  వాళ్ల  ఇష్టాఇష్టాలు, సైకాలజీతోపాటు  రెండు కుటుంబాల మధ్య రిలేషన్స్, ఎమోషన్స్‌ తెలుసుకోవడం కోసం వాళ్లతో చాలాసార్లు మాట్లాడతాను. దానికి తగ్గట్టే ప్లాన్‌ చేసుకోవాలి కదా.  సిక్స్‌ మంత్స్‌ నుంచి ఫిఫ్టీన్‌ మంత్స్‌ టైమ్‌ అవసరం. కాన్సెప్ట్స్‌ రాసుకోవాలి. థీమ్స్‌ డెవలప్‌ చేసుకోవాలి. ఇదీ ఒకరకంగా జర్నలిజం అసైన్‌మెంట్‌ లాంటిదే (నవ్వుతూ). మన మీద మనకు ట్రస్ట్,  పరిస్థితులు, రీసోర్స్‌ మీద పట్టు ఉంటే సక్సెస్‌ ఖాయం. 

చాలెంజ్‌స్‌.. 
వెడ్డింగ్‌ ప్లానర్స్‌కి  ఎంత డిమాండ్‌ ఉందో చాలెంజెస్‌ అన్నే  ఉన్నాయి. పెళ్లి విషయంలో నార్త్‌దో స్టయిల్‌. సౌత్‌దో స్టయిల్‌. నార్త్‌ వాళ్లకు సెలబ్రేషన్‌ మీద దృష్టి ఎక్కువ. సౌత్‌ వాళ్లు అంతా సిస్టమేటిక్‌గా పర్టిక్యులర్‌గా జరగాలనుకుంటారు. ఏ పెళ్లికి ఆ పెళ్లి ఓ చాలెంజ్‌. ఇండోర్‌ అయితే పెద్ద సవాల్‌. చాలా ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దాలి.  డెస్టినేషన్‌ అయితే  అక్కడి మనుషులు, వాతావరణం, పరిస్థితులు, కల్చర్, రీసోర్సెస్, నేటివిటీ.. స్టడీ చేయాలి. వాటినే ఉపయోగించుకోవాలి. సేమ్‌ టైమ్‌ మన నేటివిటీ దెబ్బతినకుండా చూసుకోవాలి.  ఎగ్జాంపుల్‌ అనుష్కా, విరాట్‌ కొహ్లీ పెళ్లి తీసుకుంటే... నేను అప్పటిదాకా ఇటలీ వెళ్లలేదు. పైగా వాళ్ల పెళ్లి పనులను చాలా సీక్రెట్‌గా ఉంచాలనేది పెద్ద టాస్క్‌. వాళ్లు కోరుకున్నట్టు డిజైన్‌ చేయడానికి  ముందు ఆ డెస్టినేషన్‌ను అర్థం చేసుకోవాలి. అందుకోసం చాలాసార్లు ఇటలీ ట్రావెల్‌ చేయాల్సి వచ్చింది.  ఇంకో వెడ్డింగ్‌..సెల్వీ అనే తెలుగు అమ్మాయిది. ఆమె పుట్టి పెరిగిందంతా  అమెరికాలోనే. ఆరన్‌ అనే అమెరికన్‌తో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. వెతుకులాటలో  కేరళలోని కుమర్‌కోమ్‌ గురించి తెలిసింది. అక్కడ ప్లాన్‌ చేశా. ఇటు హిందూ సంప్రదాయం, అటు క్రిస్టియన్‌ సంప్రదాయంలో కాకుండా ఆ జంట తమదైన రీతిలో  పెళ్లి చేసుకున్నారు. ఇంకొకరి  పెళ్లి.. ఇండోర్‌ స్టేడియంలో ప్లాన్‌ చేశా. వచ్చిన వాళ్లంతా అది స్టేడియం అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఎవరూ నమ్మలేదు. అలా డెకరేట్‌ చేశా. అయితే ఇబ్బందులను ఎదుర్కోవడం ఇంకా పెద్ద చాలెంజ్‌. ఒక పెళ్లిని కేరళలోని ఒక ఐల్యాండ్‌లో ప్లాన్‌ చేశాం. అరెంజ్‌మెంట్స్‌ అన్నీ అయిపోయాయి. రాత్రికి రాత్రే తుఫాను వచ్చి తెల్లారేసరికల్లా అంతా కొట్టుకుపోయింది. ఆ టైమ్‌లో ధైర్యం కోల్పోతే అంతే సంగతి. మన మీద పెళ్లి వాళ్లు నమ్మకం కోల్పోవద్దు.  మళ్లీ 24 గంటల్లో అంతా రెడీ చేశాం. ఎక్సయిమెంట్‌ ఎంతుంటుందో.. నెర్వస్‌ కూడా అంతే ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడమే. ప్రతి ఎక్స్‌పీరియెన్స్‌ ఒక కాన్సెప్టే. ఇన్‌స్పైరింగే’’ అంటూ ముగించింది దేవిక నరైన్‌.    

తెలుగు వాళ్ల పెళ్లిళ్లు కూడా..
హైదరాబాద్‌లోని చాంద్, సృజనా గ్రూప్, గోల్కొండ హోటళ్ల కుటుంబానికి చెందిన వెడ్డింగ్స్‌నూ ప్లాన్‌ చేసింది దేవిక. తను కూడా తెలుగు అబ్బాయి జోసెఫ్‌ రాడిక్‌ను పెళ్లాడింది. జోసెఫ్‌ రాడిక్‌ కూడా సెలెబ్రిటీ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫరే. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ వెడ్డింగ్‌ ఫొటోస్‌ తీసింది ఆయనే. అనుష్కా, విరాట్‌ కొహ్లీ పెళ్లినీ క్లిక్‌మనిపించాడు. ‘పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో బ్యాండ్‌ బాజా బారాత్‌ను వందేళ్ల ఫ్రేమ్‌లో ముచ్చటైన గుర్తుగా ఫిక్స్‌ చేయొచ్చు’ అంటారు ఇద్దరూ!  
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement