wedding planner
-
షాదీ స్క్వాడ్.. సెలబ్రిటీ పెళ్లిలకు ప్రత్యేకం!
ఆలియాభట్ రణ్‌బీర్ కపూర్ల పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సామాన్యుల ఇంట పెళ్లిలకే కనీసం నెల రోజుల ముందు నుంచి హడావుడి మొదలవుతుంది. కానీ ఆలియా రణ్‌బీర్ పెళ్లికి మూడు రోజుల ముందు వరకు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఆర్నెళ్ల ముందుగానే పెళ్లి పనులు మొదలయ్యాయి. అవి చేపట్టింది షాదీ స్క్వాడ్ అనే వెడ్డింగ్ ప్లానర్ సంస్థ. ముంబైలో ఉన్న బాలీవుడ్, బిజినెస్ సెలబ్రిటీ పెళ్లిలు చేయడంతో ఈ సంస్థ పేరొందింది. పెళ్లంటేనే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒకప్పుడు పెళ్లి పనులు చూసుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, ఇరుగుపొరుగు సాయం చేసేవాళ్లు. కానీ ఇప్పుడది వెడ్డింగ్ ప్లానర్ పేరుతో కొత్త తరహా వ్యాపారానికి కేంద్రమైంది. ఇప్పుడయితే ఏకంగా కార్పోరేట్ కల్చర్‌ను సంతరించుకుంది. పక్కా ప్లానింగ్‌తో ప్రొఫెషనల్స్‌తో పెళ్లిని డిజైన్ చేస్తున్నారు. ఇలాంటి సర్వీసెస్ అందిస్తున్న వాటిలో షాదీ స్క్వాడ్ ఒకటి. ఇండియాలో సెలబ్రిటీల పెళ్లిలంటే టక్కున గుర్తొచ్చే వెడ్డింగ్ ప్లానర్‌గా నిలిచింది. సౌరభ్ మల్హోత్రా, టీనా తివారీ, మనోజ్ మిత్రాలు సంయుక్తంగా షాదీ స్క్వాడ్‌ని స్థాపించారు. వీరిలో సౌరభ్ మల్హోత్రాకి గతంలో సినిమా నిర్మాణంలో బోలెడు అనుభవం ఉంది. సినిమా షూటింగ్‌ల సందర్భంగా సెట్లు వేయడం, నటీనటులను కోఆర్డినేట్ చేయడం వంటి పనులన్నీ దగ్గరుండి చూసుకునేవారు. దీంతో షాదీ స్క్వాడ్‌లో తెర వెనుక సౌరభ్‌ది కీలక పాత్ర. ఇక కల్యాణ వేడుకలకు సంబంధించి క్లంయిట్లతో మాట్లాడం, వారికి సంబంధించిన పనులు చక్కబెట్టడం టీనా తివారీ బాధ్యత. ఆర్థిక వ్యవహరాలు చక్కబెడుతూ.. చిన్న స్థాయి నుంచి దేశంలోనే సెలబ్రిటీల పెళ్లిలకు కేరాఫ్ అడ్రస్‌గా షాదీ స్క్వాడ్‌ను రూపుదిద్దడంలో మనోజ్ మిత్రాదే కీలక భూమిక. జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా గుర్తుంచుకునే వేడుక వివాహం. ఇందులో భాగమైన వధువరులు, వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ఎటువంటి ఒత్తిడి ఇవ్వకుండా కళ్యాణ వైభోగం ఫీలింగ్ ఇవ్వడం వెడ్డింగ్ ప్లానర్ కంపనీల ప్రధాన బాధ్యత. లాజిస్టిక్స్, ఎంటర్టైన్మెంట్స్, హాస్పిటాలిటీ, గెస్ట్మేనేజ్మెంట్, ఇన్విటేషన్లు, గిఫ్టులు, డెకరేషన్, ఫుడ్, బేవరేజెస్, డెస్టినేషన్స్, వెన్యూ మేనేజ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్ తదితర పనులన్నీ చూసుకుంటారు. టైమ్‌కి వచ్చి పెళ్లి వేడుకను తనివితీరా ఎంజాయ్ చేయమే మన పని. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫర్హాన్ అక్తర్ - శిబాని, కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ - నటాషా, అనుష్కా శర్మ - విరాట్ కోహ్లీ, నిక్‌జోనాస్ - ప్రియాంక చోప్రా వంటి ప్రముఖుల వివాహ వేడుకులు షాదీ స్క్వాడ్ చేపట్టింది. ముంబై, జైపూర్, జెస్మలేర్, కొచ్చి, గోవా, రతన్బోర్, మస్కట్, ఢిల్లీ, బెంగళూరు, థాయ్‌లాండ్, మస్కట్, ఇటలీ తదితర వేదికల్లో ఈ వేడుకలు నిర్వహించింది. పెళ్లి వేడుకులను బుక్ చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల ముందుగా మమ్మల్ని సంప్రదించడం మంచిదని షాదీ స్క్వాడ్ సూచిస్తోంది. అది కూడా పెళ్లి వేడుకలకు సంబంధించిన స్థలం మీరు ఎంపిక చేసుకుంటే. లేదంటే పెళ్లి థీమ్ మాత్రమే చెబితే కనీసం పది నెలల ముందుగా చెప్పాలంటోంది. ఒక్కసారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక... వివిధ అంశాలను బేరీజు వేసుకుని ఎప్పుడు, ఎక్కడ, ఏ థీమ్‌లో ఎంత బడ్జెట్లో వేడుకలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. వెడ్డింగ్ ప్లానర్లలో షాదీ స్క్వాడ్‌తో పాటు వివాహ్ కంపెనీ, మోత్వాని తన్వీ అండ్ కంపెనీ, దేవికా సఖూజా, డిజైనర్ ఈవెంట్స్ , ది డోలీ డైయిరీ, అభినవ్ భగత్ ఈవెంట్స్, డ్రీమ్క్రాఫ్ట్స్, ది వెడ్డింగ్ డిజైన్ కంపెనీ వంటి సంస్థలు ఉన్నాయి. మన దగ్గర హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో కార్పోరేట్ స్థాయిలో వెడ్డింగ్ ప్లానర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చదవండి: Ranbir Kapoor-Alia Bhatt Marriage: కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్! అదేంటో తెలుసా? -
ప్లాన్ ఈమెదే!
పెళ్లి జరగాలంటే ముగ్గురు ఉండాలి..అమ్మాయి.. అబ్బాయి.. వెడ్డింగ్ ప్లానర్మరి మండపం? అలంకరణ? బాజా? భజంత్రీ?విందు? వినోదం? వీటన్నిటినీ ఒకప్పుడు ఇంటి పెద్దలు చూసుకునేవాళ్లు!ఇప్పుడు అందరూ గెస్ట్సే!అవును మరి.. ఇప్పుడు పెళ్లికి కావల్సింది ముగ్గురే.అబ్బాయి.. అమ్మాయి.. వెడ్డింగ్ ప్లానర్!! అనుష్కా శర్మ, విరాట్ కొహ్లీ పెళ్లి గురించి దేశమంతా చెవులు చేసుకుంది. ప్రతి ఆరాను ఆసక్తిగా విన్నది. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను చూడలేకపోయినా.. ఆ థీమ్.. ఫొటోగ్రాఫ్స్ ఇంకా కళ్లల్లో మెదులుతూనే ఉంటాయి. దానికి సంబంధించి ఏ చిన్న వార్తయినా ఇప్పటికీ ఇంట్రెస్టింగే. ఆ కుతూహలాన్ని రేకెత్తించడంలో దాని గురించి నేటికీ ఇలా మాట్లాడుకోవడంలో అసలు ఆ పరిణయం అలా కన్నుల పండుగలా జరగడం వెనక ఉన్న వ్యక్తి దేవిక నరైన్. వృత్తి వెడ్డింగ్ ప్లానర్. సెలబ్రిటీ వెడ్డింగ్ ప్లానర్. సెలబ్రిటీల మ్యారెజేస్ను సక్సెస్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తూ తనూ ఓ సెలెబ్రెటీగా మారిపోయింది. పెళ్లి... అమ్మాయి, అబ్బాయి కామన్ కల.. జానపద కథల్లోని హీరోలో వరుడిని.. హీరోయిన్లో వధువుని వెదుక్కుంటూ ఉంటారు.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట... నవరత్నాలే తలంబ్రాలు... అతిరథ మహారథులు అతిథులు.. పంచభూతాలు సాక్షులు.. వంటి రిచ్ ఎలిమెంట్స్, గ్రాండ్ ఎఫెక్ట్స్‌తో మూడుముళ్లు.. ఏడడుగుల వేడుక ఊహకు భారీగా బడ్జెట్ కేటాయిస్తారు. కాని నిజం చేసుకోవడానికి కాసుల కారణంతో కామ్ అయిపోతుంటారు. అలాంటి నిరాశ వద్దు.. మీ బడ్జెట్ ఎంతైనా అందులోనే ఆనుకున్నట్టుగా పెళ్లి చేసుకోండి.. ఆనందంగా ఆ క్షణాలను ఆస్వాదించండి.. అందమైన జ్ఞాపకంగా మిగుల్చుకోండి అంటోంది దేవిక నరైన్. ఆమె అనుష్కా పెళ్లి సందడితో పాపులర్ కాలేదు. అంతకుముందే దినేశ్ కార్తిక్, రాబిన్ ఉతప్పల వివాహాలనూ ప్లాన్ చేసింది. అలా సెలెబ్రిటీల దృష్టిలో పడింది. ఏం చదువుకుంది? ఎందుకీ ప్లాన్ చేస్తోంది? దేవిక నరైన్ సొంతూరు లక్నో. వాళ్లింట్లో బిజినెస్ వాసనే లేదు. ఆమె తండ్రి ప్రదీప్ నరైన్ ఉద్యోగస్తుడు. దేవికను, ఆమె తమ్ముడిని కూడా బాగా చదివించారు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని. ఇంటర్ అయిపోగానే డిగ్రీ కోసం ఢిల్లీకి వచ్చింది దేవిక. లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో చేరింది. చదువు అయిపోయాక జర్నలిజమ్ను కెరీర్‌గా ఎంచుకుంది. సీఎన్ఎన్ ఐబీఎన్‌లో ఇంటర్న్‌షిప్ మొదలుపెట్టింది. రాయడం ఇష్టంగానే ఉంది.. కాని ఇంకేదో చేయాలన్న ఆరాటం నిలువనీయలేదు. ఇది కాదు చేయాల్సింది అంటూ మెదడు పెట్టే పోరును పట్టించుకుంది. ఓ నిర్ణయం తీసుకుంది. బ్యాండ్ బాజా బారాత్ ఇంట్లో వాళ్లకు చెప్పింది. తను ఉద్యోగం మానేస్తున్నట్టు. మరి ఏం చేస్తావ్? పెళ్లి చేసుకుంటావా? అని పెద్దవాళ్లు అడిగేలోపే ‘పెళ్లి చేయిస్తా’ అని చెప్పింది. వెడ్డింగ్ ప్లానర్‌గా మారాలనుంది అని వివరించింది. ముంబైలోని ఓ వెడ్డింగ్ ఈవెంట్ కంపెనీలో జాయిన్ అయింది. కొన్నాళ్లు పోయాక తనే సొంతంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకొని ‘దేవిక నరైన్ అండ్ కంపెనీ’ ప్రారంభించింది. ఇంట్లో వాళ్లు ఒకింత ఆందోళన పడ్తూనే ఉన్నారట ఆమె సక్సెస్ చూసేదాకా. ‘ఇప్పుడు ఎవ్రీబడీ హ్యాపీ’ అంటుంది దేవిక. ఆమె విజయం గురించి ఆమెనే చెప్పనిద్దాం.. సైకాలజీ...ప్లానింగ్ ‘వెస్ట్రన్ సొసైటీలో పెళ్లంటే ఇద్దరు వ్యక్తులదే. కాని మన దగ్గర అలా కాదు. రెండు కుటుంబాలకు సంబంధించింది. మన వాళ్లు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు కాని పెళ్లి విషయంలో కారు. ఇప్పుడు మ్యారేజ్ ఏర్పాట్లలో అమ్మాయి, అబ్బాయే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఉన్నదాంట్లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. బడ్జెట్, అభిరుచికి తగ్గ థీమ్ ఇస్తాం. వాళ్ల ఇష్టాఇష్టాలు, సైకాలజీతోపాటు రెండు కుటుంబాల మధ్య రిలేషన్స్, ఎమోషన్స్ తెలుసుకోవడం కోసం వాళ్లతో చాలాసార్లు మాట్లాడతాను. దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి కదా. సిక్స్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ మంత్స్ టైమ్ అవసరం. కాన్సెప్ట్స్ రాసుకోవాలి. థీమ్స్ డెవలప్ చేసుకోవాలి. ఇదీ ఒకరకంగా జర్నలిజం అసైన్మెంట్ లాంటిదే (నవ్వుతూ). మన మీద మనకు ట్రస్ట్, పరిస్థితులు, రీసోర్స్ మీద పట్టు ఉంటే సక్సెస్ ఖాయం. చాలెంజ్స్.. వెడ్డింగ్ ప్లానర్స్‌కి ఎంత డిమాండ్ ఉందో చాలెంజెస్ అన్నే ఉన్నాయి. పెళ్లి విషయంలో నార్త్దో స్టయిల్. సౌత్దో స్టయిల్. నార్త్ వాళ్లకు సెలబ్రేషన్ మీద దృష్టి ఎక్కువ. సౌత్ వాళ్లు అంతా సిస్టమేటిక్‌గా పర్టిక్యులర్‌గా జరగాలనుకుంటారు. ఏ పెళ్లికి ఆ పెళ్లి ఓ చాలెంజ్. ఇండోర్ అయితే పెద్ద సవాల్. చాలా ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దాలి. డెస్టినేషన్ అయితే అక్కడి మనుషులు, వాతావరణం, పరిస్థితులు, కల్చర్, రీసోర్సెస్, నేటివిటీ.. స్టడీ చేయాలి. వాటినే ఉపయోగించుకోవాలి. సేమ్ టైమ్ మన నేటివిటీ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ అనుష్కా, విరాట్ కొహ్లీ పెళ్లి తీసుకుంటే... నేను అప్పటిదాకా ఇటలీ వెళ్లలేదు. పైగా వాళ్ల పెళ్లి పనులను చాలా సీక్రెట్‌గా ఉంచాలనేది పెద్ద టాస్క్. వాళ్లు కోరుకున్నట్టు డిజైన్ చేయడానికి ముందు ఆ డెస్టినేషన్‌ను అర్థం చేసుకోవాలి. అందుకోసం చాలాసార్లు ఇటలీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇంకో వెడ్డింగ్..సెల్వీ అనే తెలుగు అమ్మాయిది. ఆమె పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. ఆరన్ అనే అమెరికన్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్. వెతుకులాటలో కేరళలోని కుమర్‌కోమ్ గురించి తెలిసింది. అక్కడ ప్లాన్ చేశా. ఇటు హిందూ సంప్రదాయం, అటు క్రిస్టియన్ సంప్రదాయంలో కాకుండా ఆ జంట తమదైన రీతిలో పెళ్లి చేసుకున్నారు. ఇంకొకరి పెళ్లి.. ఇండోర్ స్టేడియంలో ప్లాన్ చేశా. వచ్చిన వాళ్లంతా అది స్టేడియం అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఎవరూ నమ్మలేదు. అలా డెకరేట్ చేశా. అయితే ఇబ్బందులను ఎదుర్కోవడం ఇంకా పెద్ద చాలెంజ్. ఒక పెళ్లిని కేరళలోని ఒక ఐల్యాండ్‌లో ప్లాన్ చేశాం. అరెంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. రాత్రికి రాత్రే తుఫాను వచ్చి తెల్లారేసరికల్లా అంతా కొట్టుకుపోయింది. ఆ టైమ్‌లో ధైర్యం కోల్పోతే అంతే సంగతి. మన మీద పెళ్లి వాళ్లు నమ్మకం కోల్పోవద్దు. మళ్లీ 24 గంటల్లో అంతా రెడీ చేశాం. ఎక్సయిమెంట్ ఎంతుంటుందో.. నెర్వస్ కూడా అంతే ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడమే. ప్రతి ఎక్స్‌పీరియెన్స్ ఒక కాన్సెప్టే. ఇన్స్పైరింగే’’ అంటూ ముగించింది దేవిక నరైన్. తెలుగు వాళ్ల పెళ్లిళ్లు కూడా.. హైదరాబాద్‌లోని చాంద్, సృజనా గ్రూప్, గోల్కొండ హోటళ్ల కుటుంబానికి చెందిన వెడ్డింగ్స్నూ ప్లాన్ చేసింది దేవిక. తను కూడా తెలుగు అబ్బాయి జోసెఫ్ రాడిక్‌ను పెళ్లాడింది. జోసెఫ్ రాడిక్ కూడా సెలెబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫరే. అల్లు అర్జున్, రామ్‌చరణ్ వెడ్డింగ్ ఫొటోస్ తీసింది ఆయనే. అనుష్కా, విరాట్ కొహ్లీ పెళ్లినీ క్లిక్‌మనిపించాడు. ‘పర్ఫెక్ట్ ప్లాన్‌తో బ్యాండ్ బాజా బారాత్‌ను వందేళ్ల ఫ్రేమ్‌లో ముచ్చటైన గుర్తుగా ఫిక్స్ చేయొచ్చు’ అంటారు ఇద్దరూ! – శరాది -
రోల్స్ రాయిస్ వెడ్డింగ్ కారు
సాక్షి , భోపాల్: అంగరంగ వైభవంగా రాయల్‌లుక్‌లో పెళ్లి చేసుకోవాలనుకునే మధ్యతరగతి వారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్. అందమైన, ఖరీదైన కారులో ఊరేగాలన్న వధూవరుల కోరికను తీర్చేందుకు ఓ వెడ్డింగ్ ప్లానర్ కృషి ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఖరీదైన రోల్స్ రాయిస్ కారును అందంగా పెళ్లి పల్లకిలా రీమోడల్ చేశారు. మధ్య తరగతి జంటలకు వారి పెళ్లి రోజున రాయల్ ఫీలింగ్ కలిగించాలనే ఉద్దేశ్యంతో, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన హమీద్ ఖాన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్‌ను పెళ్లి ఊరేగింపునకు అనువుగా , అందంగా పునర్నిర్మించారు. పల్లకిని తలపించేలా సరికొత్తగా డిజైన్ చేశారు. మధ్యతరగతి వధూవరుల కలలకు ప్రాణం పోస్తూ కారును డిజైన్ చేసి..దానికి రాయల్స్ వెడ్డింగ్ కారుగా పేరు పెట్టారు. మధ్యతరగతి జంటలకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని రూపొంచినట్టు ఖాన్ తెలిపారు. ఇంకా ధర నిర్ణయించలేదన్నారు. -
హీరో, హీరోయిన్ వివాహం అక్కడే..!
ముంబై : బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్‌ల పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే చాలాసార్లు వినిపించాయి. అయితే పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జోడీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతునట్లు సమాచారం. పెద్దగా హడావిడి లేకుండా సమీప బంధువులు, కొద్ది మంది స్నేహితుల మధ్య వీరి వివాహం జరగనుందని ఒక జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మాదిరిగానే దీపికా-రణ్వీర్ జంట కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. రిసెప్షన్ మాత్రం ముంబైలో నిర్వహించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇరువురి కుటుంబాలు ఓ వెడ్డింగ్ ప్లానర్‌ని కూడా నియమించుకున్నారట. అతడితో కలిసి వివాహ వేదికను ఖరారు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. 2013లో ‘గలియోంకీ రాస్లీలా రామ్‌లీలా’ సినిమాలో కలిసి నటించిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ విషయం గురించి పలు సమావేశాల్లో దీపికా, రణ్‌వీర్‌లు చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. -
వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు
చత్తీస్ఘడ్: పెళ్లి ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పును వెలువరించింది. ఒప్పందం ప్రకారం చేయడంలో విఫలమైనందుకు గాను లక్షరూపాయలు, కోర్టు ఖర్చులకోసం మరో అయిదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఫోరం అధ్యక్షురాలు మైత్రి మాధుర్ ఈ తీర్పును వెలువరించారు. బిలాయ్ కి చెందిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ తమ కూతురి పెళ్లి విందుకోసం స్తానిక వెడ్డింగ్ ప్లానర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఎడ్వాన్స్ చెల్లించారు. ఈ పెళ్లికి మూడు రోజుల పాటు భోజన సదుపాయం కల్పించేట్టుగా మాట్లాడుకొని, మెనూని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే అనుకున్నట్టుగా మూడు రోజులు భోజనం ఏర్పాట్లు చేయడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మూడు రోజులు వడ్డించాల్సిన భోజనాలు కాస్తా ఒక రోజుతో ముగించేశారు. కనీసం ఆ ఒక్కరోజుఏర్పాట్లు కూడా సవ్యంగా చేయలేదు. భోజనం బెండకాయ వేపుడు, అప్పడం వడ్డించడం మర్చిపోయారు. వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకుల నిర్వాకం ఇంతటితో ఆగిపోలేదు. మరో ఘోరమైనపొరపాటు చేశారు. ఏకంగా పెళ్లివేదిక అలంకరణలో వధూవరుల పేర్లు రాయడం మర్చిపోయారు...ఆహూతులకోసం వేసిన కుర్చీలను అస్తవ్యస్తంగా అమర్చారు. దాదాపు 100 కుర్చీలను వైట్ క్లాత్ తో కవర్ చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో పెళ్లివారిమధ్య వివాదం రేగింది. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పాల్సిన సదరు కంపెనీ,అదనంగా డబ్బులు చెల్లించాలని వేధించడం మొదలు పెట్టింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కంపెనీ నిర్వాకంతో ఆడపెళ్లి వారుగా తాము అనేక అవమానాలను, అవహేళనను ఎదుర్కొన్నామని దీనికి వారు తగిన మూల్యం చెల్లించాలని కోరారు. దీంతో అత్యుత్సాహంగా ప్రవర్తించిన వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. -
ఎలాంటి వెడ్డింగ్ అయినా ఓకే!
‘‘మీ ఇంట్లో పెళ్లి చేయాలా? మీరెంత బడ్జెట్ లో అంటే అంతలో చేసేస్తా. గ్రాండ్‌గా మెరిపించాలా? సింప్లీ సుపర్బ్ అనిపించాలా?... ఏ వెడ్డింగ్ అయినా నాకు ఓకే. ఇట్టే చేసేస్తా’’ అంటున్నారు కథానాయిక తాప్సీ. అదేంటీ? తాప్సీ పెళ్లిళ్లు చేయడం ఏంటీ అనుకుంటున్నారా? తాప్సీ ఇటీవలే వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఒకవైపు సినిమాలను, మరోవైపు వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ‘‘ఈ వ్యాపారం ఆలోచన చాలాకాలం నుంచి ఉంది. కానీ దీన్ని ఆచరణలో పెట్టేలా చేసింది మాత్రం నేను కథానాయికగా చేస్తున్న ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రమే’’ అని తాప్సీ పేర్కొన్నారు. ఇంకా వివరంగా చెబుతూ - ‘‘వెడ్డింగ్ ప్లానింగ్‌కి మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. అది ఎవర్ గ్రీన్ వ్యాపారం. నేను ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పటి రోజుల నుంచే నా ఫ్రెండ్‌తో కలిసి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకున్నా. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని, వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ మొదలుపెట్టింది. నేనేమో సినిమాల్లో బిజీ అయిపోయా. ఇలా అయితే బిజినెస్ చేయాలనే నా కోరిక ఎప్పటికీ తీరదనిపించింది. అందుకే ఇప్పుడు నా స్నేహితురాలితో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ మొదలుపెట్టాను. ఇందులో ఏ మాత్రం తప్పు జరిగినా, అది నా ఇమేజ్ మీద చాలా ప్రభావం చూపుతుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని తాప్సీ తెలిపారు. -
తాప్సీ సరికొత్త బిజినెస్!
‘సన్నాఫ్ సత్యమూరి’్తలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా నటించారు. కానీ అందాల కథానాయిక తాప్సీ మాత్రం తన నిజజీవితంలోనే వెడ్డింగ్ ప్లానర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే తన స్నేహితులతో కలిసి ‘ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు తాప్సీ. ఆ సంస్థ పక్షాన మొదటి వేడుకను కూడా ఇటీవలే నిర్వహించారు. హీరోయిన్గా ఒకవైపు, వెడ్డింగ్ ప్లానర్‌గా మరో వైపు రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న తాప్సీ ఆ విశేషాలు చెబుతూ - ‘‘సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యాపార రంగంలోకి దిగడం చాలా ఆనందంగా ఉంది. నటిగానే కాకుండా వేరే రంగంలో కూడా నాకంటూ గుర్తింపు తెచ్చు కోవాలనుకున్నాను. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఇలా వ్యాపారం లోకి అడుగు పెట్టానని చాలామంది అనుకుంటు న్నారు. కానీ, అందులో వాస్తవం లేదు. నాకిప్పుడు అవకాశాలకు కొదవ లేదు. కేవలం నా సృజనాత్మకతను మరో రంగంలో చూపించాలనేదే నా ప్రయత్నం’’ అన్నారు. -
పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్
అప్‌కమింగ్ కెరీర్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరచిపోలేని మధురమైన ఘట్టం. ఇద్దరి మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తుంటారు. ఆధునిక జీవితాలు తీరికలేకుండా బిజీబిజీగా మారిపోయా యి. పెళ్లి వేడుకల కోసం ఎక్కువ సమయం వెచ్చించలేని పరిస్థితి. మారుతున్న కాలానికి తగ్గట్టు వెడ్డింగ్ ప్లానర్లు పుట్టుకొచ్చారు. సంతృప్తికి, ప్రశంసలకు, ఆదాయానికి లోటులేని కెరీర్.. వెడ్డింగ్ ప్లానింగ్. నేటి కార్పొరేట్ యుగంలో వెడ్డింగ్ ప్లానర్లకు డిమాండ్ పెరిగింది. వీరికి మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ప్రారం భంలో ఏదైనా వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థలో పనిచేసి తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. వివాహాల నిర్వాహకులు ఎన్నో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్లయింట్ల అభిరుచులు, అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వివాహ వేడుక జరిపించాలి. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి, పెళ్లి జరిగి, అప్పగింతలయ్యేదాకా అన్ని దశలు విజయవంతంగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షించాలి. వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అధిక శ్రమతో కూడుకున్న వృత్తి. ఇందులో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ముందే నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా చూసుకోవాలి. టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అర్హతలు: వెడ్డింగ్ ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ప్రత్యేకంగా విద్యార్హతలు లేవు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో నిలదొక్కుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు చదవాలి. ఈ కోర్సుల్లో భాగంగా వెడ్డింగ్ ప్లానింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ రంగానికి సంబంధించి ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా వెడ్డింగ్ ప్లానర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారెందరో ఉన్నారు. వేతనాలు: వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అనేక విభాగాల కలబోత. సాధారణంగా కో-ఆర్డినేటర్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. మూడేళ్లపాటు పనిచేసి అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు అందుకోవచ్చు. ఆపరేషన్స్ మేనేజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు లక్ష రూపాయల దాకా పొందొచ్చు. ఇక సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్న వెడ్డింగ్ ప్లానర్ వివాహాల సీజన్లో లక్షలాది రూపాయల ఆదాయం ఆర్జించొచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై వెబ్సైట్: www.niemindia.com - తానియా-తాపెల్ వెడ్డింగ్ ప్లానర్ ట్రైనింగ్ అకాడమీ-ముంబై వెబ్సైట్: www.tania-tapel.com - ఈవెంట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్-ముంబై వెబ్సైట్: www.emdiworld.com ఓర్పు, మాటతీరే.. పెట్టుబడి శ్రీ వివాహ మహోత్సవ వేడుక అత్యంత ప్రధానమైంది. ఎక్కడో దూరంగా ఉన్న ఆత్మీయులు పెళ్లి కార్యక్రమానికి తోడ్పాటును అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని పనులను ఒక్కరే చేసుకోలేరు. కాబట్టి వెడ్డింగ్ ప్లానర్లపై ఆధారపడుతున్నారు. అందమైన వేడుకను ఆహ్లాదభరితంగా నిర్వహించే వెడ్డింగ్ ప్లానర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. శ్రమ ఎక్కువైనా ఓర్పు వహించడం, అతిథులను ఆత్మీయంగా పలకరించడం వంటి లక్షణాలుంటే ఈ రంగంలో రాణించొచ్చు. విద్యార్ధులు, నిరుద్యోగులకు ఇది ఆర్థికంగా వెసులుబాటును ఇచ్చే కెరీర్. వెడ్డింగ్ ప్లానింగ్ రంగంలో అనుభవాన్ని బట్టి భారీ వేతనాలుంటాయి - అజ్మత్, ఈవెంట్ మేనేజర్