వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు
Published Fri, Dec 4 2015 3:11 PM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
చత్తీస్ఘడ్: పెళ్లి ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పును వెలువరించింది. ఒప్పందం ప్రకారం చేయడంలో విఫలమైనందుకు గాను లక్షరూపాయలు, కోర్టు ఖర్చులకోసం మరో అయిదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఫోరం అధ్యక్షురాలు మైత్రి మాధుర్ ఈ తీర్పును వెలువరించారు.
బిలాయ్ కి చెందిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ తమ కూతురి పెళ్లి విందుకోసం స్తానిక వెడ్డింగ్ ప్లానర్స్తో ఒప్పందం కుదుర్చుకుని ఎడ్వాన్స్ చెల్లించారు. ఈ పెళ్లికి మూడు రోజుల పాటు భోజన సదుపాయం కల్పించేట్టుగా మాట్లాడుకొని, మెనూని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే అనుకున్నట్టుగా మూడు రోజులు భోజనం ఏర్పాట్లు చేయడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మూడు రోజులు వడ్డించాల్సిన భోజనాలు కాస్తా ఒక రోజుతో ముగించేశారు. కనీసం ఆ ఒక్కరోజుఏర్పాట్లు కూడా సవ్యంగా చేయలేదు. భోజనం బెండకాయ వేపుడు, అప్పడం వడ్డించడం మర్చిపోయారు. వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకుల నిర్వాకం ఇంతటితో ఆగిపోలేదు. మరో ఘోరమైనపొరపాటు చేశారు. ఏకంగా పెళ్లివేదిక అలంకరణలో వధూవరుల పేర్లు రాయడం మర్చిపోయారు...ఆహూతులకోసం వేసిన కుర్చీలను అస్తవ్యస్తంగా అమర్చారు. దాదాపు 100 కుర్చీలను వైట్ క్లాత్ తో కవర్ చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో పెళ్లివారిమధ్య వివాదం రేగింది.
జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పాల్సిన సదరు కంపెనీ,అదనంగా డబ్బులు చెల్లించాలని వేధించడం మొదలు పెట్టింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కంపెనీ నిర్వాకంతో ఆడపెళ్లి వారుగా తాము అనేక అవమానాలను, అవహేళనను ఎదుర్కొన్నామని దీనికి వారు తగిన మూల్యం చెల్లించాలని కోరారు. దీంతో అత్యుత్సాహంగా ప్రవర్తించిన వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
Advertisement
Advertisement