Creative art
-
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
ఆల్–వుమెన్ ప్లే:జీవన నాటకం
జీవితమే ఒక నాటకరంగం... తాత్విక మాట. నాటకంలోకి జీవితాన్ని తీసుకురావడం... సృజనబాట. ఈ బాటలోనే తన నాటకాన్ని నడిపిస్తూ దేశ, విదేశ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది రమణ్‌జిత్ కౌర్.... చండీగఢ్‌లో పుట్టి పెరిగిన రమణ్జిత్కౌర్ పెళ్లి తరువాత కోల్‌కతాలో స్థిరపడింది. అక్కడి నాటకరంగంపై తనదైన ముద్ర వేసింది. జాతీయత, ప్రాంతీయత, కులం, వర్గం, జెండర్ అంశాల ఆధారంగా ఆమె రూపొందించిన ‘బియాండ్ బార్డర్స్’ నాటకం దేశవిదేశాల్లో ప్రదర్శితమై ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ నాటకంలో 29 మంది మహిళలు నటించడం ఒక విశేషం అయితే, ఇంగ్లీష్, హిందీతో పాటు పంజాబీ, బెంగాలి, మరాఠీ, గడ్వలి... భాషలను ఉపయోగించడం మరో విశేషం. సమకాలీన సమస్యలను నాటకానికి వస్తువుగా ఎంచుకోవడం ఒక ఎత్తయితే... వీడియో ఆర్ట్, ఇన్స్టాలేషన్ ఆర్ట్, ఫొటోగ్రఫీ, సౌండ్ డిజైన్‌లాంటి సాంకేతిక అంశాలను కూడా సృజనాత్మకంగా ఉపయోగించడం మరో ఎత్తు. నాటకం నాడి తెలిసిన కౌర్‌కు సినిమాలపై కూడా మంచి అవగాహన ఉంది. దీపా మెహతా దర్శకత్వంలో వచ్చిన ఫైర్, హెవెన్ ఆన్ ఎర్త్ చిత్రాలలో నటించింది. ‘మ్యాంగో షేక్’లాంటి షార్ట్‌ఫిల్మ్స్ కూడా రూపొందించింది. ‘నాటకరంగం, సినిమా రంగానికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇలా జవాబు ఇస్తుంది... ‘పెద్ద తేడా ఏమీలేదు. భావవ్యక్తీకరణకు రెండూ ఒకేరకంగా ఉపయోగడపడతాయి. అయితే నాటకం ద్వారా తక్షణ స్పందన తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఒకవైపు నటిస్తూనే మరోవైపు ప్రేక్షకుల కళ్లను చూస్తు కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు’ ‘థియేటర్ గేమ్స్’ రచయిత క్లైవ్ బర్కర్లాంటి దిగ్గజాల దగ్గర శిక్షణ తీసుకున్న కౌర్ తొలిసారిగా డూన్ స్కూల్ స్పెషల్ చిల్డ్రన్స్ కోసం వర్క్‌షాప్‌ని నిర్వహించింది. నాటకరంగంలో పిల్లలు చురుకైన పాత్ర నిర్వహించాలనేది తన కల. ‘ది క్రియేటివ్ ఆర్ట్’తో తన కలను నెరవేర్చుకుంది కౌర్. ఈ సంస్థ ద్వారా వేలాదిమంది విద్యార్థులు యాక్టింగ్, వాయిస్ ట్రైనింగ్, ఎక్స్ప్రెషన్, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్... మొదలైన వాటిలో శిక్షణ తీసుకున్నారు. కౌర్ దర్శకత్వం వహించిన తాజా నాటకం ‘ది ఈగల్ రైజెస్’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాటకంలో నటించిన వారందరూ మహిళలే. జీవితం అనేది యుద్ధం అనుకుంటే... అక్కడ మనకు అడుగడుగునా కావాల్సింది సానుకూల దృక్పథం. మన మీద మనకు ఉండే ఆత్మవిశ్వాసం. ఇవే మన వజ్రాయుధాలు’ అని చెబుతుంది ది ఈగల్ రైజెస్. ‘థియేటర్ అంటే ముఖానికి రంగులు పూసుకొని, డైలాగులు బట్టీ పట్టడం కాదు. మనలోని సృజనాత్మక ప్రపంచాన్ని ఆవిష్కరించే వేదిక. అందుకు సరైన శిక్షణ కావాలి. కొందరు ఏమీ తెలియకపోయినా ఇతరులకు నటనలో శిక్షణ ఇస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. నాటకం అనేది ఉన్నచోటనే ఉండకూడదు. అది కాలంతో పాటు ప్రవహించాలి. సాంకేతికధోరణులను అందిపుచ్చుకోవాలి’ అని చెబుతున్న కౌర్, నటులకు ఫిజికల్ ఎనర్జీ, ఫిట్నెస్ ముఖ్యం అని నమ్ముతుంది. పిల్లలకు నాటకరంగలో శిక్షణ ఇవ్వాలనే తన కోరికను సాకారం చేసుకున్న కౌర్ ఆల్–వుమెన్ థియేటర్ కోర్స్‌కు రూపకల్పన చేస్తుంది. ఈ కోర్స్‌లో భాగంగా దేశ, విదేశ కళాకారులు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తారు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ ఉంటుంది. కౌర్ రెండో కల నిజం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. -
ట్రెండ్ సెట్టర్
డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మరుగున పడిన, మారుమూల ప్రాంతాల్లోని ఎంతోమంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. వినూత్న నైపుణ్యాలతో తామేంటో నిరూపించుకుంటూ ట్రెండ్సెట్టర్లుగా నిలుస్తున్నవారు ఎందరో. ఈ కోవకు చెందిన వారే జ్యోతి అధవ్. కార్పొరేట్ రంగంలోనేగాక, సామాజిక సేవారంగంలోనూ విశేషమైన సేవలందించి 2022 సంవత్సరానికి గానూ టైమ్స్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మహిళలు బలహీనులు కాదు, మనసుపెట్టి పనిచేస్తే ఒకచేత్తో ఎన్నో పనులు చక్కదిద్దగలుగుతారు అని నిరూపిస్తోంది జ్యోతి అధవ్. పూనేకు చెందిన జ్యోతి క్రియేటివ్ ఆర్టిస్టేగాక, విజయవంతంగా రాణిస్తోన్న వ్యాపారవేత్త. ఒక పక్క నైరూప్య చిత్రకారిణిగా రాణిస్తూనే, బిజినెస్ ఉమెన్‌గా దూసుకుపోతూ, ఎన్జీవోని నడుపుతున్నారు. జ్యోఆర్ట్స్ అండ్ డెకార్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేస్తోంది. తన చిత్రకళా నైపుణ్యంతో అల్ట్రా మోడ్రన్ ఆర్ట్ స్టూడియోను నిర్వహిస్తూ...చిత్రకళానైపుణ్యంతో స్పష్టమైన, ప్రత్యేకమైన డెకరేటింగ్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. పూనే కేంద్రంగా నడుస్తోన్న మసాలా కంపెనీ ‘సాఫ్రో’కు ఒక డైరెక్టర్‌గా పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా తన ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఇలా అనేక వ్యాపారాలను ఎంతో నైపుణ్యంతో చూసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించడం విశేషం. వసుమతి వెల్ఫేర్ మంచి కళాకారిణిగానేగాక విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోన్న జ్యోతికి మానవత్వ గుణాలు కాస్త ఎక్కువే. సమాజానికి తిరిగిచ్చేయాలన్న ఉద్దేశ్యంతో భర్త విజయ్ అధవ్ సహకారంతో వసుమతి వెల్ఫేర్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఆసరా కోల్పోయిన వారు, నిరుపేదలకు సాయం చేస్తోంది. పేదల ఆకలి తీర్చడం, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యసదుపాయాలను అందిస్తోంది. అంతేగాక మహిళ అభ్యున్నతికి కృషిచేస్తోంది. ఆడపిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారి విద్యకయ్యే ఖర్చునూ భరిస్తోంది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు అయ్యే ఖర్చును ఈ ఫౌండేషన్ అందిస్తోంది. కరోనా సమయంలోనూ రోగులకు వైద్య సదుపాయం, ఆహారం, నీటిప్యాకెట్లు, వంట సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది. చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె 2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్ అప్లోడ్స్ ట్రెండ్ సెట్టర్’గా నిలిచింది. కష్టపడేతత్వం, ఓర్పు సహనం ఉండాలేగానీ నాలుగైదు పనులు ఒక్కసారే చేయవచ్చు అని నిరూపిస్తోంది జ్యోతి. ప్రతి మనిషికీ ఉండేది 24 గంటల సమయమే. కానీ జ్యోతి అధవ్ లాంటి వాళ్లు ఆ ఇరవై నాలుగు గంటల్లోనే ఎన్నో పనులు చేసి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె 2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్ అప్లోడ్స్ ట్రెండ్ సెట్టర్’గా నిలిచింది. -
ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం!
అప్‌కమింగ్ కెరీర్ ఒక భాషలో ఉన్న ప్రాచీన సాహిత్యాన్ని, విలువైన గ్రంథాలను చదవాలంటే ఆ భాషను స్వయంగా నేర్చుకోవాల్సిన పనిలేదు. మాతృభాషలోకి తర్జుమా చేసిన పుస్తకాలను చదివితే సరిపోతుంది. అనువాదం ద్వారా ప్రపంచ సాహిత్యం అన్ని భాషల ప్రజలకు చేరువవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనువాదానికి గిరాకీ పెరుగుతోంది. గ్రంథాలు ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనువాదకులకు(ట్రాన్స్‌లేటర్స్) డిమాండ్ నానాటికీ విస్తృతమవుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారికి దేశవిదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ట్రాన్స్లేషన్ కోర్సుల్లో చేరే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. అవకాశాలు.. పుష్కలం ప్రపంచీకరణతో అన్నిదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. కార్పొరేట్, బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో అడుగుపెడుతున్నాయి. అక్కడ కార్యకలాపాల నిర్వహణకు స్థానిక భాషలు తెలిసినవారిని నియమించుకుంటున్నాయి. రవాణా, పర్యాటక రంగాల్లో అనువాదకులకు భారీ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్, రిలీజియన్ వంటి వాటిలో అవకాశాలకు కొదవే లేదు. విదేశీ భాషలను నేర్చుకొనేవారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రాన్స్లేటర్లకు ఫారిన్ లాంగ్వేజ్ టీచర్లుగా ఉపాధి లభిస్తోంది. బోధన, శిక్షణపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా స్థిరపడేందుకు వీలుంది. ట్రాన్స్లేషన్ కోర్సును పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సులువుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆంగ్లంతోపాటు జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఆయా భాషలను నేర్చుకున్నవారికి ఎన్నో రంగాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. అనువాదాన్ని కెరీర్‌గా మార్చుకున్నవారికి ఉద్యోగాలు, ఉపాధి పరంగా ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. కావాల్సిన లక్షణాలు: అనువాదం అనేది ఒక సృజనాత్మక కళ. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతోనే పాఠకులు మెచ్చే అనువాదం సాధ్యమవుతుంది. ఈ రంగంలో పనిచేయాలంటే భాషలపై అనురక్తి ఉండాలి. అందులో లోటుపాట్లను తెలుసుకోవాలి. ఒక గ్రంథంలోని భావం మారిపోకుండా దాన్ని మరో భాషలోకి తర్జుమా చేసే నేర్పు సాధించాలంటే నిత్యం నేర్చుకొనే తత్వం ఉండాలి. వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్రాన్స్‌లేషన్‌లో అవి ప్రతిఫలించాలి. అర్హతలు: మనదేశంలో పలు విద్యాసంస్థలు ట్రాన్స్లేషన్ స్టడీస్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దూర విద్యా విధానంలోనూ కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉన్నత విద్యనభ్యసించినవారికి మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: అనువాదకులకు అనుభవం, పనితీరును బట్టి వేతనాలు లభిస్తాయి. ఇంటర్ప్రిటేటర్స్కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ. 50 వేలకుపైగానే పొందొచ్చు. ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్లకు డాక్యుమెంట్ ఆధారంగా ఆదాయం ఉంటుంది. ఫుల్‌టైమ్ ట్రాన్స్‌లేటర్లు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగా అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in ద్రవిడియన్ యూనివర్సిటీ. వెబ్సైట్: www.dravidianuniversity.ac.in ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్. వెబ్సైట్: www.ntm.org.in యూనివర్సిటీ ఆఫ్ లక్నో. వెబ్సైట్: www.lkouniv.ac.in యూనివర్సిటీ ఆఫ్ పుణె. వెబ్సైట్: www.unipune.ac.in అన్ని భాషల్లో అవకాశాలు ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ భాషల అనువాద నిపుణులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం సాహిత్య రంగంలో పుస్తకాల అనువాదానికే పరిమితం కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ వీరి అవసరం పెరుగుతోంది. ఇంటర్ప్రిటేటర్స్గా కూడా పనిచేయొచ్చు. ఒక వ్యక్తి సంభాషణను అప్పటికప్పుడు అనువాదం చే సేవారే ఇంటర్‌ప్రిటేటర్స్. వీరికి అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలున్నాయి. దాదాపు అన్ని భాషల్లో ట్రాన్స్లేటర్స అవసరం ఉంటుంది. ప్రధానంగా ఇంగ్లిష్‌తోపాటు యూరోపియన్ భాషలు నేర్చుకున్న వారికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ తదితర భాషల నుంచి తొలుత ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేస్తుండడమే దీనికి కారణం. తర్వాతే ఇంగ్లిష్ నుంచి మాతృభాషల్లోకి అనువదిస్తున్నారు’’ - డా. కె. వెంకట్‌రెడ్డి, రిజిస్ట్రార్, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్