సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని మాన్యుడిగా మార్చేది విశ్వవిద్యాలయమేనని తెలుగు విశ్వవిద్యాలయ చాన్స్‌లర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన తెలుగు విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మాతృభాష అందరూ నేర్చుకోవాలని, మాతృభాషలోనే మాట్లాడాలని అన్నారు.
విదేశీయులు మాతృభాషలోనే మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తారని, మాతృభాషలో మాట్లాడటానికి సిగ్గు పడకూడదని తెలిపారు. తెలుగు వర్సిటీ నుంచి పట్టాలు పొందిన విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి గ్రామాలకు వెళ్లి.. అక్కడి ప్రజలకు మన సాహిత్యం, సంస్కృతి, లలిత కళలు, వారసత్వ సంపద గురించి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులందరికీ సామాజిక సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
స్వచ్ఛత అభియాన్ కింద కాలనీలను దత్తత తీసు కుని పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విదేశీయుల నుంచి యోగా గురించి తెలుసుకుంటున్నామని, మన సంస్కృతి గురించి మనమే తెలుసుకుని ఆచరిస్తే మంచిదన్నారు. ఈ సందర్భంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథి ఆచార్య రవ్వా శ్రీహరిని గవర్నర్ సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment