మాతృభాషతోనే సృజనాత్మకత
మాతృభాషతోనే సృజనాత్మకత
Published Sun, Jul 30 2017 3:34 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM
‘సాక్షి’తో ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్
- ఆంగ్లం కంటే మాతృభాష మరింత ఎక్కువ అవసరం
- నేను హైస్కూల్ వరకు కన్నడ మాధ్యమంలోనే చదువుకున్నా..
- ఒక డాలర్ ఖర్చుతో చేసే పరికరాన్ని అర డాలర్‌తో చేసేవాడే ‘ఇంజనీర్’
మల్లు విశ్వనాథరెడ్డి (సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో)
కర్ణాటకలోని హసన్‌లో పుట్టిపెరిగిన ఎ.ఎస్.కిరణ్‌కుమార్ అంతరిక్ష శాస్త్రవేత్త (స్పేస్ సైంటిస్ట్)గా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తి స్తున్న ఆయన ప్రాథమిక, మాధ్యమిక విద్య ను మాతృభాష కన్నడంలోనే చదివారు. 4 దశాబ్దాల ‘ఇస్రో’ ప్రయాణంలో ఎన్నో మై లురాళ్లను దాటారు. మార్స్ మిషన్ మొద లు చంద్రయాన్ వరకు ఇస్రో మైలు రాళ్లలో భాగస్వామ్యం గణనీయమైనదే. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసు కెళ్లిన పీఎస్‌ఎల్‌వీ–సీ37 విజయంతో దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఆకాశమంత ఎత్తులో నిలిపిన ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ శనివారం విజ్ఞాన్ వర్సిటీ స్నాతకో త్సవంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చా రు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు...
సాక్షి: అంతరిక్ష శాస్త్రవేత్తగా మారడానికి విద్యార్థి దశలో మీకు స్ఫూర్తినిచ్చిన సంఘటనలు ఉన్నాయా?
ఎ.ఎస్.కె.: ఆకాశం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. నక్షత్రాలు, వాటి తీరును చూస్తూ ఏదో తెలియని అనుభూతిని పొందే వాడిని. అంతరిక్షంపై చిన్నప్పటి నుంచే అంతులేని ఆసక్తి కలిగిం ది. ఏడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి స్కూల్లో ‘వ్యూ మాస్టర్’ చూశాను. వస్తువులను ‘త్రీ డైమెన్షన్’లో చూపించడానికి దాన్ని వాడతాం. అది నాలో ఎంతో ఉత్సుకతను రేపింది. చిన్నప్పుడు మేం ఒక పెంకుటింట్లో ఉండేవాళ్లం. ఇంటి పై కప్పునకు ఒక రంధ్రం ఉండేది. సూర్యకిరణాలు అందులో నుంచి ఇంట్లోకి పడేవి. తలుపులన్నీ మూసి ఇంట్లో చీకటి చేసేవాడిని. అప్పుడు చూస్తే ఓవర్‌హెడ్ ప్రొజెక్షన్ లాగా ఉండేది. అది కూడా బాల్యంలో చిత్రంగా అనిపించేది. అంతరిక్షంపై ఆసక్తిని మరింత పెంచింది.
మీరు మాతృభాషలో చదువుకున్నారా?
హైస్కూల్ వరకు మాతృభాష కన్నడంలోనే చదువుకు న్నాను. తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనసాగింది. బెం గళూరు నేషనల్ కాలేజీ నుంచి డిగ్రీ ఫిజిక్స్(ఆనర్స్) చదివాను. ఎలక్ట్రానిక్స్‌లో పీజీ పూర్తిచేశా. ఐఐఎస్సీ నుంచి ఎంటెక్ చేశాను.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి మారిపోతున్నాయి. దీనిపై మీరేమంటారు?
ఆలోచనల్లో సృజనాత్మకత, స్వేచ్ఛను మాతృభాష ఇస్తుంది. మరో భాషలో చదివితే ఈ అవకాశం ఉండదు. మాతృ భాషను నిర్లక్ష్యం చేయడం విషాదం. ఇంగ్లిష్ కూడా అవసరమే. కానీ, మాతృభాష అంతకు మించి అవసరం. మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దు. రెండింటి మధ్య సమతుల్యం అవసరం.
1963లో ఇస్రో ప్రయోగించిన రాకెట్‌ను సైకిల్‌పై తీసుకెళుతున్న ఫోటో ఒకటి ఇప్పటికీ పత్రికల్లో వస్తోంది. ఆ దశ నుంచి 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించే దశకు ఇస్రో చేరింది. ఈ అద్భుత విజయాలను ఎలా చూడాలి?
భారతదేశం అట్టడుగుస్థాయి నుంచి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి ప్రపంచానికి చూపించింది. తొలి లాంచింగ్ వెహికల్ అసెంబ్లింగ్ ఒక చర్చిలో జరిగింది. తొలి ఉపగ్రహం తయారీ బెంగళూరులోని ఇండస్ట్రియల్ షెడ్‌లో జరిగింది. వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ సామర్థ్యాన్ని, మేధోసంపత్తిని పెంచుకుంటూ పోయారు. అద్భుత విజయాలు సాధించారు. తదేక దీక్షతో ప్రయాణం కొనసాగిస్తే లక్ష్యం చేరువవుతుంది. సరికొత్త రంగాల్లో విభిన్న అవకాశాలు అందివస్తాయి.
ఇస్రో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి?
తొలి రోజుల్లో అంతరిక్ష రంగానికి సంబంధించిన పరిజ్ఞానం మన దేశానికి పరిమితంగానే ఉండేది. ఏది ఎలా పూర్తి చేయాలో తెలిసేది కాదు. వనరులూ పరిమితమే. విదేశాల నుంచి పరి జ్ఞానాన్ని తెచ్చుకొనే(కొనుక్కొనే) అవకాశం లేకపోడమే వరంగా మారింది. స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం.
ఇస్రో ప్రస్తుతం ఎలాంటి నూతన పరిజ్ఞానం సాధించే దిశగా అడుగులు వేస్తోంది?
పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, క్రయోజనిక్ ఇంజన్.. ఇప్పటికే సాధిం చాం. ఇందులోనే మరింత ఉత్తమ పరిజ్ఞానాన్ని సంపాదించే దిశ గా ప్రయత్నాలు సాగిస్తున్నాం. లాంచింగ్ వెహికల్‌ను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ‘రీయూజబుల్’ లాంచింగ్ వెహికల్‌ను వినియోగించడానికి రంగం సిద్ధమవుతోంది. వాతావరణంలో సహజంగా ఉండే ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకొనే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్(విద్యుత్ చోదక శక్తి)ని ఉపగ్రహాల్లో ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి ఉపగ్రహాలు రూపొందిస్తున్నాం.
ఇస్రో చైర్మన్‌గా వచ్చే రెండేళ్లలో మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాలేమిటి?
1.ఇస్రో పనితీరులో వేగాన్ని సుస్థిరం చేసుకోవడం. వేగాన్ని పెంచుతూ మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పం పించడం. దీనికి పారిశ్రామిక రంగం సహాయాన్ని తీసుకోవడం.
2. దేశంలో పలు రంగాల్లో సామర్థ్యాల పెంపునకు అంతరిక్ష పరి జ్ఞానాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించడానికి అనుకూలమైన అప్లికేషన్లు రూపొందించడం.
3. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలు చూపించి ‘ఇస్రో’కు ‘గ్లోబల్ స్పేస్‌మార్క్’ సృష్టించడం.
మార్స్ మిషన్, చంద్రయాన్ ప్రాజెక్టుల బడ్జెట్ కంటే హాలీవుడ్ భారీ సినిమాల బడ్జెట్ ఎక్కువని చలోక్తులు వినిపిస్తు న్నాయి. అంతరిక్ష పరిజ్ఞానాన్ని సామాన్యుడికి చేరువ చేసే దిశగా దీన్ని చూడొచ్చా?
పరిమిత వనరులతోనే లక్ష్యాన్ని చేరుకోవడం ఇస్రో తొలి అడుగుల్లోనే నేర్చుకుంది. దేశంలో కమ్యూనికేషన్ విప్లవానికి ఇస్రో వాస్తవరూపం ఇచ్చింది. తుపానుల గమనాన్ని ముందుగా గుర్తించడం, దేశం మొత్తాన్ని అనుసంధానం చేయడం.. సుసాధ్యం చేసింది. త్వరలో ‘నావిగేషన్ శాటిలైట్’ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికే కాకుండా అంతరిక్ష శాస్త్రంలో పరిశోధనలకూ ఇస్రో పెద్దపీట వేస్తోంది.
ఇస్రో సాధిస్తున్న విజయాలు ప్రజలు, రైతులకు ఎలా ఉపయోగపడతాయి?
11 రకాల పంటల దిగుబడి అంచనాలను పంట కోయకముందే చెబుతున్నాం. కరువునూ అంచనా వేయగలుగుతున్నాం. ‘సాయిల్ హెల్త్’ను అంచనా వేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పనకు ఇస్రో ఇస్తున్న డేటా ఉపయోగప డుతుంది. ఇస్రో రూపొందించిన జియో ఫ్లాట్‌ఫాం ‘భువన్’ అందిస్తున్న సమాచారం ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది.
ఏపీ, తెలంగాణలో వేల సంఖ్యలో ఇంజనీర్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు రావడం లేదు ‘ఇంజనీర్’కు ఉండాల్సిన నైపుణ్యాలు ఏమిటి?
ఒక డాలర్ ఖర్చుతో చేయగలిగిన పరికరాన్ని రెండు డాలర్లు ఖర్చు చేస్తే మూర్ఖుడు కూడా తయారు చేయగలడు. అర డాలర్‌తోనే పని పూర్తి చేసేవాడే ‘ఇంజనీర్’. ఇంజినీర్లకు వినూత్నంగా ఆలోచించే శక్తి ఉండాలి. ఆలోచనల్లో నవ్యత ఉండాలి. లోతైన విషయ పరిజ్ఞానం ఉండాలి. క్లిష్టమైన సవాళ్లను అధిగమించడానికి సులవైన మార్గాలను సూచించే సామర్థ్యం ఉండాలి.
Advertisement
Advertisement