మళ్లీ ‘మాధ్యమ’ వివాదం! | Government can’t impose mother tongue as instruction medium in primary classes | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘మాధ్యమ’ వివాదం!

Published Fri, May 9 2014 1:03 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Government can’t impose mother tongue as instruction medium in primary classes

సంపాదకీయం: ప్రాథమిక పాఠశాలల స్థాయిలో బోధన ఎలా ఉండాలి? అది మాతృభాషలో ఉంటే మంచిదా, ఇంగ్లిష్‌లోనా అనే వివాదం చాలా పాతది. లేలేత వయసు పిల్లలకు బుద్ధి వికాసానికైనా, గ్రహణ శక్తికైనా, ధారణకైనా...ఇంకా చెప్పాలంటే అభివ్యక్తీకరించడానికైనా మాతృభాష ను మించిన ఉత్తమ సాధనం లేదని విద్యారంగ నిపుణులు చెబుతారు. నిజానికి మాతృభాషపై పట్టు సాధించిన విద్యార్థే ఇంగ్లిష్‌తోసహా ఏ భాషనైనా సులభంగా నేర్చుకోవడం సాధ్యమవుతుందన్న అభిప్రాయ మూ ఉంది. బోధనా భాష ఏవిధంగా ఉండాలన్న అంశంలో తల్లిదం డ్రులపైగానీ, విద్యా సంస్థలపైగానీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునివ్వడంతో ఈ చర్చ మరోసారి ఎజెండాలోకి తెచ్చింది.

ప్రభుత్వ గుర్తింపును ఆశించే ప్రతి విద్యా సంస్థలోనూ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకూ విధిగా కన్నడ మాధ్యమంలోనే బోధన ఉండాలని 1994లో కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్న విద్యార్థులకు తప్ప మిగిలినవారందరికీ ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని తెలిపింది. కొన్నేళ్లక్రితం ఈ నోటిఫికేషన్‌ను అనుసరించని అనేక విద్యాసంస్థల గుర్తింపును ప్రభుత్వం రద్దుచేసింది కూడా. భాషాభిమానం అధికంగా ఉండే కన్నడ గడ్డ ఈ తీర్పుతో సహజంగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నది. రచయితలు, కవులు, కళాకారులు, భాషాభిమానులు ఏకమై తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలుచేయాలని, అవసరమైతే తీర్పును వమ్ముచేయడానికి రాజ్యాంగ సవరణకు కూడా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.
 
  వాస్తవానికి బోధనకు సంబంధించి త్రిభాషా సూత్రాన్ని అనుస రించమని 2005లో ఆమోదించిన జాతీయ పాఠ్య ప్రణాళికా నమూనా సూచించింది. అదే సమయంలో మాతృభాషే ఉత్తమ బోధనా మాధ్య మమని కూడా తెలిపింది. చెప్పాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టి వేసిన నోటిఫికేషన్ దానికి అనుగుణమై నదే. దాని ప్రకారం నాలుగో తరగతి వర కూ కన్నడ మాధ్యమాన్ని తప్పనిసరి చేసినా అయిదో తరగతి నుంచి ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విద్యార్థి తల్లిదం డ్రులు కోరుకున్న మాధ్యమంలో బోధన చేయవచ్చు. తరచిచూస్తే ఇందులో ఆక్షేపించదగ్గదేమీ కనబడదు. చిన్న వయసు పిల్లలపై అంతవరకూ పరిచయంలేని ఇంగ్లిష్ రుద్దడంవల్ల వారి మనోవికాసా నికి అది ఆటంకంగా మారుతుంది. మాతృభాషలో ఎంతో కొంత నేర్చుకున్నాక మాత్రమే ఇంగ్లిష్ మాధ్యమాన్ని అమలు చేయవచ్చున న్నది కర్ణాటక సర్కారు ఆలోచన. అయితే, ఇందులో మరికొన్ని కోణాలు ఇమిడి ఉన్నాయి.
 
 ఒక మాధ్యమాన్ని మాత్రమే బోధించాలని విద్యా సంస్థలపై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చునా... అలా విధించే ఆంక్షలు విద్యాసంస్థల ఏర్పాటుకు పౌరులకుండే హక్కులను హరించ డంలేదా... బోధనా మాధ్యమాన్ని ఎంచుకోవడానికి విద్యార్థుల తల్లి దండ్రులకుండే స్వేచ్ఛను ఇది ఆటంకపరచడం కాదా వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. వీటన్నిటినీ మించి భాషాపరంగా మైనారిటీలుగా ఉండే వారు ఈ నోటిఫికేషన్ కారణంగా అన్యాయానికి గురయ్యే అవకాశం ఉండదా అనేది మరో ప్రశ్న. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రేతర ప్రాంతాలనుంచి ఉపాధి కోసం వచ్చేవారు తమ పిల్లలను వారికి పరిచ యంలేని కన్నడ మాధ్యమంలోనే చదివించాల్సి ఉంటుంది. అంటే... మాతృభాషలో విద్యాబోధన జరగాలని పట్టుబట్టేవారు ఇంగ్లిష్‌కు సం బంధించి ఏ అభ్యంతరాన్నయితే చెబుతున్నారో...రాష్ట్రేతర ప్రాంతాల వారు కూడా కన్నడ మాధ్యమానికి ఆ రకమైన అభ్యంతరమే చెబుతున్నారు.
 
 మాతృభాషలో బోధన ఉంటేనే పిల్లల అవగాహనా శక్తి వికసిస్తుం దన్న నిపుణుల అభిప్రాయంతో సుప్రీంకోర్టు విభేదించడంలేదు. విద్యా సంస్థను గుర్తించడానికి దాన్నొక షరతుగా విధించడాన్నే ప్రశ్నిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగకరమని చెబుతు న్నది. మాతృభాషలో బోధించాలన్నది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని, దాన్ని అమలు చేయాలన డంలో రాజ్యాంగ విరుద్ధత ఏమున్నదని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తు న్నది. ఎక్కడైనా 30 శాతంమందికి పైగా విద్యార్థులు పరాయిభాషలో విద్యాభ్యాసం చేస్తుంటే వారి మాతృభాష ఉనికి ప్రమాదంలో పడిందని తెలుసుకోవాలని పదేళ్లక్రితం యునెస్కో సంస్థ హెచ్చరించింది. మాతృ భాషలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని సూచించింది. 

ఇంగ్లిష్ బోధనామాధ్యమంగా చదువుకునే విద్యార్థులతో మాతృభాషలో చదువుకునే విద్యార్థులు చదువులోనూ, ఉపాధి అవకాశాల్లోనూ కూడా పోటీపడలేకపోతున్నారని అయిదేళ్ల క్రితం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయప డింది. పేదవర్గాల్లో చాలామంది ఈ ధోరణిని గుర్తించే తమ పిల్లలకు ఇంగ్లిష్ చదువులు నేర్పించాలని తహతహలాడుతున్నారు. తమలా తమ పిల్లలు బతకకూడదనుకుంటే ఇది తప్పనిసరని వారు భావిస్తు న్నారు. ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా మాతృభాషను ఉంచుతూనే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులకు కల్పిస్తే ఇలాంటి వివాదాలుండవు. దీనికి తోడు ఇంగ్లిష్ బోధనా మాధ్యమంగా ఉండేవారికి మాతృభాషను ఒక సబ్జెక్టుగా నేర్చుకోవడం తప్పనిసరి చేయడం... మాతృభాష బోధనామాధ్యమం ఉన్నవారికి ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా పరిచయం చేయడంలాంటి చర్యలు తీసుకోవాలి. బోధనామాధ్యమం ఎలా ఉండాలన్న అంశాన్ని స్వీయ భాషాభిమాన కోణంలోనుంచి మాత్రమే చూస్తే సమస్యకు పరిష్కారం లభించదని అందరూ గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement