మాతృభాషలు
భారత్‌లో వివిధ భాషలు, మాండలికాలు, యాసలు కలిపి మొత్తం 19,569 మాతృభాషలు మాట్లాడు తున్నారు. ప్రస్తుతం దేశ జనాభా 121 కోట్ల పైచిలుకే ఉంది. అయితే పదివేలు అంతకు మించిన సంఖ్యలో ప్రజలు మాట్లాడితేనే వాటిని భాషలుగా గుర్తిస్తున్నారు. దేశంలోని భాషలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్చిన 22 భాషలు, ఈ షెడ్యూల్‌లో చేర్చని 99, తదితర భాషలను రెండు భాగాలుగా వర్గీకరించారు. ఈ ›ప్రాతిపదికన ప్రస్తుతం భారత్‌లో మొత్తం 121 భాషలున్నాయని జనాభా గణన తాజా విశ్లేషణలో స్పష్టమైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది షెడ్యూల్‌లో చేర్చిన 22 భాషల్లో ఏదో ఒక భాష, 3.29 శాతం మంది మిగిలిన భాషలు మాట్లాడుతున్నారు.
అనేక ఆసక్తికర అంశాలు...
2011 జనాభా లెక్కల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుతున్న మాతృభాషలకు సంబంధించి సేకరించిన ఈ గణాంకాల్లో అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఒక కుటుంబంలో రక్తసంబంధీకులే కాకుండా సంబంధంలేని వ్యక్తులు లేదా ఈ రెండింటి మిశ్రమం కలగలిసే అవకాశం ఉన్నందున...కుటుంబంలోని ప్రతీ సభ్యుని మాతృభాష ఏమిటనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఈ నివేదిక విడుదల చేసిన భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ విభాగం పేర్కొంది. తాము రోజువారి ఉపయోగించే భాషా మాధ్యమాలు, మాతృభాషలకు సంబంధించి జనాభా గణన సందర్భంగా వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు.
అయితే తాము మాట్లాడే లేదా విద్యాబోధన కొనసాగిస్తున్న భాషనే మాతృభాషగా కొందరు పేర్కొన్నా వాస్తవంగా వారి భాష లేదా యాస వేరేది ఉంటోంది. జనాభా లెక్కల సేకరణ సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. 2001 జనాభా గణన సందర్భంగా ఉన్న 22 షెడ్యూల్ భాషలే 2011 లెక్కల్లోనూ కొనసాగాయి. గతంలో 100 నాన్ షెడ్యూల్ భాషలుండగా, 2011 లెక్కలకు వచ్చేసరికి సిమ్టే, పర్షియన్ మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయి వాటిని మినహాయించారు. అయితే మావో భాష మాట్లాడేవారు పదివేల కంటే పెరగడంతో ఇందులో చోటు దక్కింది.
8వ షెడ్యూల్‌లో చేర్చిన 22 భాషలివే...
అస్సామీ, బాంగ్లా, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరి, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ,ఒడియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్ధూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ...
భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో తొలుత 14 భాషలకు చోటు లభించింది. ఆ తర్వాత 1967లో సింధీ, 1992లో కొంకణి, మణిపూరి, నేపాలీ, 2004లో బోడో, డోగ్రీ, మైథిలీ, సంథాలీ ఈ జాబితాలోకి వచ్చి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment