మాతృభాషపై మమకారం పెంచుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. స్థానిక వయ్యాలికావేల్‌లో తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో
- మంత్రి రామలింగారెడ్డి
- ఘనంగా ‘తెలుగు’ సంక్రాంతి సంబరాలు
బెంగళూరు, న్యూస్‌లైన్ : మాతృభాషపై మమకారం పెంచుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. స్థానిక వయ్యాలికావేల్‌లో తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సంక్రాంతి సంబరాలు’లో ఆయన ప్రసంగించారు. హిందూ సంప్రదాయాల్లో పండుగలకు కొదవ లేదని, సంక్రాంతి సంబరాలకు తనను ఆహ్వానించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. పండుగ సందర్భంగా తెలుగు వారందరూ ఒకే చోట కలవడం ఆనందదాయకమని అన్నారు.
దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా మాతృభాషను మరవరాదని సూచించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని భాషలపై కూడా మమకారం పెంచుకోవాలని కోరారు. కృష్ణదేవరాయ భవనం ఆధునీకీకరణ కోసం సమితి సభ్యుల అభ్యర్థన మేరకు నిధులు అందించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ... తెలుగు భాషకు శాస్త్రీయ హోదా కల్పించినప్పటికీ భాషాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేయకపోవడం బాధాకరమని అన్నారు.
కన్నడ భాషాభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని గుర్తు చేశారు. ఇందుకు కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 320 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇలాంటి కృషి మరే రాష్ర్టంలోనూ లేదని అన్నారు. కర్ణాటక రాష్ట్రాభివృధ్దిలో తెలుగు వారి కృషి అపారమన్నారు. అనంతరం ఉత్సవాలను గోపూజతో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. 11.30 నుంచి 1గంట వరకు చిన్నపిల్లల వివిధ వేషాధారణ పోటీలు ఆకట్టుకున్నాయి.
మధ్యాహ్నం ప్రముఖ జానపద కళాకారులు మాలూరు డీఆర్ రాజప్ప, చింతామణి మునిరెడ్డి బృందం జానపద గీతాలు ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో తొలి మూడు స్థానాలు సాధించిన ఉషా, స్వాతిశ్రీ, శ్రుతికు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు, సమితి ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎ.కె.జయచంద్రారెడ్డి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి సహకరించిన కృష్ణం నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, డి.గణేష్ శంకర్, టి.వేణుగోపాల్, లోకనాథనాయుడు తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు బత్తుల అరుణాదాస్, ఎస్‌ఆర్ నాయుడు, సీపీ శ్రీనివాసయ్య, శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్, సి.చెన్నారెడ్డి, ఆర్. ఆదికేశవులు నాయుడు, సమితి మాజీ అధ్యక్షుడు జెఎస్ రెడ్డి పాల్గొన్నారు.