మాతృభాషను మరువొద్దు
Published Mon, Mar 17 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
చెన్నై, సాక్షిప్రతినిధి: ఉమ్మడి తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారి సేవలు అనంతమని గవర్నర్ కె.రోశయ్య పేర్కొన్నారు. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన తెలుగు నాట తెలుగువారి త్రిసంగ మహోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ తిరుమల నాయకర్, వీరపాండ్య కట్ట బ్రహ్మన్ వంటి మహామహులు తెలుగువారా, తమిళులా అనే విచక్షణను పక్కనపెట్టి వారు ఉమ్మడి తమిళనాడు రాష్ట్రానికి అందించిన సేవలు గుర్తు చేసుకోవాలని అన్నారు. తమిళనాడులోని తెలుగువారు మాతృభాషపై అభిమానం పెంచుకోవాలని, ఇతర భాషల పట్ల ద్వేషభావం కూడదని హితవుపలికారు.
తెలుగువాడిగా అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడం సమర్థనీయమని, అలాగే మాతృభాషను మాత్రం మరువరాదని అన్నారు. విదేశాల్లో తెలుగు వారి ఐక్యత మెండుగా ఉంటుందని, అటువంటి ఐక్యతను తమిళనాడులో కూడా చూడాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలుగువారికి స్థలంపై జయ హామీ: తమిళనాడులో స్థిరబడిన తెలుగువారు ఆంధ్రా భవన్ వంటి నిర్మాణాలకు స్థలం కావాలంటూ తనను కలిశారని తాను సీఎం జయతో మాట్లాడి కేటాయించిన స్థలం అనుకూలంగా లేకపోవడంతో పెండింగ్ పడిందని గవర్నర్ అన్నారు. స్థలం కోసం తెలుగు సంఘాల వారు అప్పుడప్పుడు అడిగి వదిలేస్తున్నారని చురకవేశారు. తప్పనిసరిగా స్థల కేటాయింపులో చొరవచూపుతానని జయ హామీ ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. త్రిసంగ మహోత్సవం పేరిట జరిగిన ఈ కార్యక్రమం నిజంగా ఒక పర్వదినం వంటిదన్నారు.
ప్రతిభతోనే గౌరవం
సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ మనిషికి గౌరవం ప్రతిభ, సామర్థ్యం వల్లనే వస్తుందని అన్నారు. ఐకమత్యం వల్లనే గుర్తింపు కూడా లభిస్తుందని తెలుగువారికి సూచించారు. తమిళనాడులో నాలుగేళ్లపాటు తాను చదువుకున్నందున తమిళ భాషపై గౌరవం, తెలుగు భాషపై ప్రేమ ఉందని చెప్పారు. తెలుగు వారు అనేక కారణాలతో విడిపోవడం నేర్చుకున్నారే గానీ, కలిసి ఉండడం తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తమిళుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఉన్నదని, అయితే రాజకీయ విన్యాసాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయని వ్యాఖ్యానించారు.
సినీ నేపథ్య గాయకులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తమిళనాడులో ఉంటున్న తెలుగువారు తెలుగు మాట్లాడేందుకు సిగ్గుపడరాదని కోరారు. ఇళ్లలో తెలుగు మాట్లాడండి, తెలుగు వాడని చెప్పుకునేందుకు గర్వించండని అన్నారు. జనాభా సేకరణకు వచ్చే ప్రభుత్వ సిబ్బందికి తాము తెలుగు వారమని స్పష్టంగా నమోదు చేసుకోవాలని కోరారు. మహోత్సవం చైర్మన్ డాక్టర్ సి.ఎం.కె.రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం మీద లింగ్విస్టిక్ మైనారిటీలు తమిళనాడులోనే ఎక్కువని, అందులోనూ తెలుగు వారు 25 శాతంగా ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. అనాదిగా తమిళనాడులో స్థిరపడిన వారిని మైనారిటీలు అని సంబోధించరాదని గతంలో జస్టిస్ పటాస్కర్ చెప్పారని, అయితే ఇది కార్యాచరణకు నోచుకోలేదన్నారు. తమిళనాడులోని వ్యవసాయ వర్శిటీకి తెలుగువాడైన జీడీ నాయుడు పేరును పెట్టి తొలగించారని,
ఇందుకు తెలుగువారి అనైక్యతే కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, నటి శారద, నల్లి కుప్పుస్వామి శెట్టి, జయ గ్రూప్ ఛైర్మన్ ఎ.కనకరాజ్, మహోత్సవం ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.మనోహరన్, కోశాధికారి రంగరాజన్, సంయుక్త కోశాధికారి ఆర్.నందగోపాల్, టామ్స్ అధినేత గొల్లపల్లి ఇజ్రాయిల్, సినీ నటి కుట్టి పద్మిని తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు సినీ నేపథ్యగాయకులు, సంగీత దర్శకులు జి.ఆనంద్ వారి స్వరమాధురి లైట్ మ్యూజిక్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. ఇందులో డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మనో, బి.వసంత, సిలోన్ మనోహర్, ఎస్.పి.శైలజ తదితరులు పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
సభ విజయవంతం
తెలుగువారి ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో సాగిన మహోత్సవం విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తెలుగువారు తరలివచ్చారు. వాహనాలు, రైళ్లలోను తరలివచ్చిన తెలుగు కెరటాల నడుమ నెహ్రూ స్టేడియం కిక్కిరిసింది. ఆ పరిసర మార్గాలు తెలుగు వెలుగుతో వికసించాయి.
Advertisement
Advertisement